జీవన విధానం 

మొహంజోదారో ప్రజలు విలాసవంతమైన భవనాల్లో నివసించేవారు. వీరికి వేటయందు ఆసక్తి తక్కువగా ఉండేది. నృత్యగానాదుల వంటి లలిత కళలలో వీరికి ప్రవేశం కలదు. మొహంజోదారోలో బొమ్మలు, చిత్రములు ఎక్కువ సంఖ్యలో కనుగొనబడినవి. వీటి ద్వారా ఆ నాటి బాల బాలికలు ఆట పాటలందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది. మొహంజోదారో, హరప్పా ప్రాంతపు తవ్వకాలలో లభించిన మృణ్మయ పాత్రలు పై భాగంలో నలుపు, ఎరుపు రంగులలో చిత్రములతో తయారు చేయబడినవి. మృణ్మయ పాత్రల లోపలి భాగములో నీలి ఆకుపచ్చని ద్రవపదర్థామును పూసి ఆరబెట్టడం వలన నునుపుగా, ఈ కాలంలోని జాడీల వలె ఉండేవి. సింధు లోయలో జరిగిన త్రవ్వకాలలో క్రొత్త రాతియుగ కాలం నాటి శిలా పరికరములు లభించినవి. మొహంజోదారలో తవ్వకాలలో రాగి, కంచు, రాతి ఆయుధాలు కనుగొనబడినవి. వాటిలో కత్తులు, ధనుస్సులు, బాణములు, బరిసెలు మొదలైనవి కలవు. ఆ కాలంలో కాలక్రమాన ఆయుధముల తయారీ ఒక పరిశ్రమా మారింది. 

దైవారాధన 

సింధు లోయలో లభించిన ముద్రికలు మొహంజోదారో, హరప్పా నాగరికతను తెలిసికొనుటలో ప్రధాన పాత్ర వహిస్తున్నవి. ఈ ముద్రికల పై జంతువుల ప్రతిమలు కలవు. రాతిపైన, స్తంభముల పైనను గల ప్రతిమలు గ్రీకు నాగరికతా చిహ్నముల కతి సన్నిహితముగనున్నట్లు భావింపబడినది. రావి నదీ పరివాహక ప్రాంతంలో లభించిన దిగంబర దేవత మూడు ముఖాలు, కొమ్ములు కలిగి, పీఠముపై కూర్చన్నది. ఈ దేవతా ప్రతిమ చుట్టూ అనేక జంతువులు చిత్రింపబడినవి. గాజులు తొడుగబడిన చేతులతో గల ఈ దేవత వెంట్రుకలు నిడుపుగా నుండి చక్కగా దువ్వబడి ఉన్నది. ఇది పరమ శివుని సూచించు ప్రతిమ గల ముద్రిక. శివుడినే పశుపతిగా కొలిచేవారు. ఒక దున్నపోతును మానవ సమూహము ఎదుర్కొంటున్నట్లు గల ముద్రిక మొహంజోదారోలో లభించినది. సింధు నాగరికతా కాలంనాటి ప్రజలు శివపూజా ధురంధరులని హరప్పా, మొహంజోదారో ప్రాంత తవ్వకాలలో లభించిన ముద్రికల వలన తెలుస్తున్నది. శివపూజ, శక్తి ఆరాధన ఆ రోజుల్లో వ్యాప్తిలో ఉంది. సింధూ ప్రాంతములలో లభించిన స్త్రీ దేవతా మూర్తులలో మాతృదేవత విశిష్టమైనది. ఇటువంటి మాతృదేవతా ప్రతిమలు బెలూచిస్థాన్ దక్షిణ భాగాలలో అసంఖ్యాకంగా దొరికనవి. జోబ్ లోయలో కాళీమాతకు సంబంధించిన ప్రతిమలు, చిత్రములు లభించినవి. శక్తి యొక్క ఆరాధన విధానము సింధునదీ పరీవాహక ప్రాంతము నుండి యూఫ్రటీస్, టైగ్రీస్, నైలు, డాన్యూబ్ నదుల పరీవాహక ప్రాంతాల వరకు విస్తరించింది. సింధూ లోయలో నివసించిన ప్రజలు స్త్రీ, పురుష, ప్రకృతి ఆరాధకులని అక్కడ లభించిన ముద్రికల వలన తెలుస్తున్నది. వీరు ప్రకృతిలోని వృక్షములను, కూరమృగాలను, సరీసృపాలను కూడా పూజించారు. రావిచెట్టు తదితర వృక్షములను శక్తివంతమైన వృక్షములుగా భావించి పూజించేవారు. వనదేవతకు రూపము కల్పించి పూజించారు. రావి, కసివింద వంటి వృక్షాలు ఆనాటి ప్రజలచే పూజలందుకొని పవిత్రమైనవిగా భావింపబడినవి. ఆ కాలంలోనే వృక్షారాధన జాతీయారాధనగా భావించబడినది. మూడు ముఖాలు గల పురుషాకృతి సింధు నాగరికత విలసిల్లిన కాలమున ప్రకటింపబడిన ముద్రికలలో కనిపిస్తుంది. దానికి ఇరువైపులా జంతువులు చిత్రించడం జరిగింది. ఈ పురుషాకృతి శివునిది. ఇది అత్యంత ప్రాచీనమైన శివ ప్రతిమగా భావించబడినది.

మొహంజోదారో, హరప్పా పట్టణ ప్రజలు శివలింగమును, యోనిని పూజించేవారు. శివుని వాహనమైన నంది వంటి మృగముగా సింధు లోయలో లభించిన ముద్రికలపై కనిపిస్తుంది. వీరికి యోగవిద్య కూడా తెలుసని తవ్వకాలలో లభించిన యోగ ప్రతిమలు, ముద్రికల ద్వారా తెలుస్తున్నది. మరణించిన వారి శవములను పూడ్చి పెట్టే ఆచారం ఆనాడు అమలులో ఉండెను. కొన్ని ప్రాంతాల్లో దహనం, పూడ్చి పెట్టడం రెండు ఆచారాలుండేవి. దీనిని బట్టి నాగరికత గల ప్రజలు ఆచరించే అని సంస్కార క్రియలన్నీ మొహంజోదారో, హరప్పా నగరముల ప్రజలు ఆచరించినట్లు తెలుస్తున్నది. క్రొత్త రాతియుగం నాటి సిన్, డాల్మెన్ సమాధులు భారతదేశంలో లభించినవి. 
లిపి 
రావి నదీ పరివాహక ప్రాంతంలో చిన్న ముద్రికలు లభించినవి. ఈ ముద్రికలపై వ్రాతలు కూడా కలవు. ఆనాటి ప్రజలు వాడిని లిపి ఈ ముద్రికలపై కనిపిస్తుంది. దీనిని బట్టి వారు లిపి, భాషా జ్ఞాన సంపన్నులని తెలుస్తున్నది.  మొహంజోదారో, హరప్పా నాగరికతా కాలం నాటి లిపిని గురించి పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. హీరోస్ అనే పండితుడు సింధూలోయలో లభించిన ముద్రికల పై గల లిపిని కుడి నుండి ఎడమవైపునకు చదవ గలిగాడు. తాను చదివిన లిపిని అతడు తమిళ భాషలోనికి అనువదించాడు. కానీ ఇతని అభిప్రాయంతో శాస్త్రజ్ఞులు ఏకీభవించలేదు. "ది ఇండో సుమేరియన్ సీల్స్ డెసిఫర్డ్" అనే గ్రంథంలో సర్ జాన్ మార్షల్ సింధులోయలో కనుగొనబడిన ముద్రికల పై ఉన్న భాష సుమేరియన్ల భాషలాగా ఉన్నదని భాష, లిపి వివరాలు తెలిపినాడు. డా॥ ప్రాణ్ నాథ్ సుమేరియన్ లిపి సింధు లోయలో విలసిల్లిన లిపికి భిన్నముగా ఉన్నదని భావించాడు. హరప్పాలో మూడు సార్లు పునర్నిర్మించబడిన నగరములు గలవు. హరప్పా, మొహంజోదాలో త్రవ్వకాలలో 2000 ముద్రలు లభించాయి. వీటిపై ఒక పక్క జంతువుల బొమ్మలు, చిత్ర లిపులున్నవి. రెండవ పక్క గుబ్బలున్నవి. ఈ ముద్రికలలో కొన్నిటి పై లిపులు కూడా ఉనన్నవి. స్వస్తిక్ చిహ్నము, రేఖాగణితము గుర్తులు, మృగముల బొమ్మలు, ఎత్తైన మూపురము గల దున్నపోతులు, నేలపై నడిచే గంగడోలు ఎడ్లు, ఏకశృంగ వృషభములు, ఏనుగులు, కారెనుములు, వివిధ జాతి మృగములు మనిషి పులితో పోరాడుతున్న దృశ్యములు ముద్రికలపై కనిపించుచున్నవి. ఇక్కడ లభించిన ముద్రికలపై 396 అక్షరాలున్నవి. ఇటువంటి అక్షరాలు గల ముద్రికలే మెసపుటేమియాలో కూడా లభించాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలోని సరగ్వాలా గ్రామంలో శిథిలావశేషాలు కనుగొనబడినవి. అవి లోథాల్ అనే ప్రాచీన నగరం యొక్క అవశేషాలుగా గుర్తించబడినవి. ఇక్కడ జరిగిన తవ్వకాలలో 210 ముద్రికలు దొరికనవి. ఇవి సుద్ద రాతి ముద్రలు. వీటి పై చిత్రింపబడిన లిపి మొహంజోదారో, హరప్పాలలో లభించిన ముద్రలిపిని పోలి ఉన్నది. లోథాల్ ప్రాచీన రేవు పట్టణము దేశ విదేశ వ్యాపారముకు అనువైన నగరముగా ఉండేది. మొహంజోదారో లిపి మొదట చిత్రలిపిగా ఉండేది. ఏదైనా ఒక వస్తువును తెలియజేయడానికి ఆ వస్తువు పేరులోని తొలి అక్షరమును సూచించే చిత్రాన్ని ముద్రికపై చిత్రించేవారు. 
బ్రాహ్మీలిపి భారత లిపి. ఖరోష్టి లిపి సెమ్ జాతిలోని అరమీన్ తెగవారు వాడిన లిపి. బ్రాహ్మీ లిపి సంపర్కము వలన ఖరోష్టి లిపి సంస్కృత ప్రాకృతాది భాషలను అక్షర రూపంలో రూపొందించుటలో తోడ్పడింది. క్రీ.పూ. ఆరవ శతాబ్ది నుండి భారతదేశంలో శాసనములు వేయింపబడుచూ వచ్చినవి. బ్రాహ్మీ లిపిలో కనిపించు తొలి శాసనములు ఆర్యావర్త మందును, దక్షిణాపథ, దక్షిణ భారతములందు ఉన్నవి. బ్రాహ్మీ లిపి పూర్వరూపము మొహంజోదారో, హరప్పా, లోథాల్ లందు లభించిన ముద్రల లిపిలో కనిపిస్తుంది. క్రమ పరిణామంలో ఈ లిపి బ్రాహ్మీ లిపిగాను, బ్రాహ్మీ లిపి నుండి మిగిలిన భారత లిపులు ఏర్పడినవి. హిబ్రూ, బైబిల్ భాషకు సంబంధించిన భాష, సింధూ లోయలోని ప్రజలు మాట్లాడిన భాష, హిబ్రూ భాష ఒక్కటే అని 'మోరిస్ జెస్సి వాన్' అనే అమెరికా పురాతత్త్వ శాస్త్రవేత్త అభిప్రాయపడినాడు. సింధు నాగరికత లిపి, భాష ప్రాచీన సంస్కృత భాషకు, లిపికి సంబంధించినదని సుధాంశు రాయ్ తెలిపినాడు. సింధు నాగరికత భాష, లిపి, వేదకాలమునాటి లిపికి, నాగరికతకు అతి దగ్గరగా ఉన్నదని ఎం. వి. ఎస్. కృష్ణారావు తెలిపాడు. డా|| ఫతే సింగ్ (డైరెక్టర్ రాజస్థాన్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్ పూర్) సింధులోయలోని లిపి, భాష సంస్కృతం అని తెలిపాడు. స్కాండినేవియాలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ అనే సంస్థలోని ఫిన్నిష్ మేధావులు సింధు నాగరికతను పూర్వార్య లేదా ద్రావిడ నాగరికత అని వెల్లడించారు.