వ్యాపారం 

మొహంజోదారో నగర వర్తకులు, వర్తక వ్యాపారాలు చేసేవారు. వారు ఈజిప్టు, మెసపటేమియా, బాబిలోనియా వంటి పశ్చిమ దేశాలతో కూడా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. తమ ప్రాంతంలో లభించే వస్తువులను, పనిముట్లను, ఆహార ధాన్యాలను విదేశాలకు సరఫరా చేసి అధిక మొత్తంలో లాభాలు గడించేవారు. అదే విధంగా విదేశాల నుండి వస్తువులను తెచ్చి తమ ప్రాంత ప్రజలకు విక్రయించేవారు. దీని వలన సింధు నాగరికత కాలంలో విదేశీ వ్యాపారం ఉచ్ఛ స్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది. 

సింధు ప్రజలు ఉన్నిబట్టలు, నూలు బట్టలు ధరించేవారు. ఆ కాలంలో ప్రత్తి పంట ఎక్కువగా పండేది. సింధు ప్రాంతము నుండి ఈజిప్టు, మెసపుటేమియా, బాబిలోనియాలకు నూలు బట్టలను ఎగుమతి చేసేవారు. పంజాబ్  లోని రావి నదీతీరమున విలసిల్లిన హరప్పా నాగరికతా కాలం నాటి ప్రజలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గొట్టెల పెంపకంను అభివృద్ధి పరిచి ఉన్ని దుస్తులకు గొట్టెలను వాడేవారు.

వృత్తి 

సింధు లోయలో విలసిల్లిన నాగరికత కాలం నాటి నగర జీవనము పల్లెలపై ఆధారపడినది. ప్రజల్లో ఎక్కువ శాతం మంది వ్యవసాయం ముఖ్యవృత్తిగా స్వీకరించడం దీనికి ప్రధాన కారణం. వ్యవసాయదారులు గోధుమ, బార్లీ, ఉలవలు, పెసలు వంటి పంటలను పండించి నగరాలకు సరఫరా చేసి తగిన లబ్ది పొందేవారు. సింధూ ప్రజలు గోధుమను ముఖ్యమైన ఆహారంగా స్వీకరించేవారు. పశువుల పాల నుండి పెరుగు, జున్ను, వెన, నెయ్యి మొదలైన పదార్థాలను తయారు చేయడం వారికి తెలుసు. సింధూ కాలం నాటి ప్రజలకు రుచికరమైన భోజన పదార్థాలను తయారు చేయడం తెలుసు. మేకలు, గొట్టెల వంటి జంతువులను పెంచుతూ వాటి సంతతిని అభివృద్ధి చేసి అధిక లాభాలు గడించేవారు. 

జంతువులు

ఈ కాలం నాటి ప్రజలకు తెలసిన జంతువులు - ఏనుగులు, ఒంటెలు, మహిషములు(దున్నలు), ఎద్దులు, గుఱ్ఱములు, శునకములు, గొట్టెలు, నల్ల ఎలుకలు, జింకలు, ముంగీసలు, కారెనుము(బైసన్) కుందేలు, కోతులు, పులులు. ఈ జంతువులకు సంబంధించిన ముద్రికలు సింధూ నది లోయల్లో లభించినవి. ఏనుగులు, ఒంటెలను వస్తువులను ఒకచోటి నుండి మరొక చోటికి తరలించుటలో ఉపయోగించేవారు. అదే విధంగా ఎద్దులు, దున్నలు, గుఱ్ఱములు వ్యవసాయ పనులలో ఉపయోగించేవారు. గొట్టె, మేక తదితర జంతువుల ఎరువులు పంటపొల్లాల్లో వాడేవారు. కుక్కలను ఇండ్లలో పెంచుకొనే అలవాటు ఆనాటి ప్రజలకు కలదు. 

లోహ పరిజ్ఞానం - ఆభరణాలు 

మొహంజోదారో ప్రజలకు రాగి, వెండి, సీసము, బంగారము, రేకు వంటి లోహముల పరిజ్ఞానం కలదు. వీరికి ఇనుము వాడకం తెలియదు. రాగి పనిముట్లను ఎక్కువగా వాడేవరు. వీరికి రాగి పుష్కలముగా లభించడం వలన ఇనుమును ఉపయోగించే అవసరం రాలేదు. వేటకు సంబంధించిన ఆయుధములు, ఇళ్ళలో రోజువారీ వాడే వస్తువులు, వంట పాత్రలన్నీ రాగితోనే తయారు చేసుకొనేవారు. బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువగా ఉపయోగించే వారు. బంగారం, వెండి అంటే వారికి అమితమైన ప్రీతి. ఎముకలు, నత్తగువ్వలతో అనేక వస్తువులను తయారు చేసుకొనేవారు. స్త్రీలు అలంకారం కొరకు బంగారు, రాగి, వెండి ఆభరణాలు ధరించేవారు. పురుషులు దండ కడియాలు, కాలి కడియాలు, మొలత్రాళ్ళు ధరించేవారు. గృహోపకరణాలను, మృణ్మయ పాత్రలే కాకుండా రాగితో తయారు చేయబడిన వస్తువులు కూడా ఆనాడు వాడుకలో కలవు. ప్రజలు నత్తగుల్లలు దండలుగా చేసుకొని మెడలో ధరించేవారు. 

 RELATED TOPICS 

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -1

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -2

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -4