భారత దేశంలో పాత, సూక్ష్మ, కొత్త రాతి యుగముల తరువాత లోహయుగము ప్రారంభమైనది. కొత్త రాతియుగ చివరి సంవత్సరాలలో, లోహయుగానికి ఆరంభ కాలంలో మానవ వికాస పరిణామానికి, సంస్కృతికి, నాగరికతకు మూలాధారంగా భావించబడిన మొహంజొదారో, హరప్పా, చనుదారో మొదలైన ప్రాంతాలలో విలసిల్లిన నగరాలు, పట్టణాలు భారతదేశ చరిత్ర నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత వహిస్తున్నవి. సర్ జాన్ మార్షల్ భారత పురాతత్త్వశాఖకు డైరెక్టర్ గా క్రీ.శ. 1921-1927 మధ్య కాలంలో పనిచేశారు. ఆయన ఆ కాలంలో తన అనుచరులతో కలిసి మొహంజోదారో ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఆ విశేషాలను మూడు గ్రంధాల రూపంలో రచించి భారతదేశ చరిత్రకు గొప్ప ఉపకారం చేశాడని చెప్పవచ్చును.

మొహంజోదారో ఖనన పరిశోధనలు నిర్వహించిన వారిలో ఇతర ప్రముఖులు : 

1) జె. హెచ్.మాక్యే - ఇతను క్రీ.శ.1927 నుండి 1931 మధ్య కాలంలో పరిశోధనలు నిర్వహించాడు. 

2) జి.ఎఫ్.డేల్స్ - ఇతను క్రీ.శ. 1963లో పరిశోధనలో చేశారు. 

మొహంజోదారో సింధు రాష్ట్రంలోని లార్ఖానా  జిల్లాలోనిది. హరప్పా పంజాబ్ పశ్చిమ ప్రాంతములోని మౌంట్ గోమరీ జిల్లాలోనిది. మొహంజోదారో అనే పదానికి "మృతుల దిబ్బ" (Mound of the Dead) అనే అర్థం గలదు. క్రీ.పూ. 6-5 వేల సంవత్సరాలలో ఇరానియన్ పీఠభూమిలోని యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదీలోయలు కొత్త రాతియుగ మానవులకు ఆవాసాలుగా ఉండేవి. వారు కొండలపై తాత్కాలికంగా నివాసముంటూ పశుపాలన, వ్యవసాయముతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చారు. తరువాత కాలంలో వారందరూ జనసంఖ్య పెరగడం వలన బాబిలోనియా, అస్సీరియాలకు వలస వెళ్ళారు. సింధులోయలో వృద్ధి చెందిన నాగరికత, సంస్కృతి హరప్పా సంస్కృతిగా గణతికెక్కింది. హిమాలయ పర్వతాల్లో జన్మించిన రావీ, జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్ నదులు సింధు నదిలో కలిసినవి. హరప్పా నగరం జీలం-చీనాబ్-రావి నదుల యొక్క కూడలి. రావి నదికి ఎడమ వైపు సింధూనది, కుడి పక్కన హరప్పా నగరమునకు 640 కి.మీ. దూరములో మొహంజోదారో పట్టణం ఉన్నది. చనుహుదారో, కోటి డిజీ, మాధారెహకొ, కోటానూర్ మొదలైన ప్రాచీన నగర అవశేషాలు సింధూ నదీ తీరంలో ఉన్నవి. సౌరాష్ట్రలోని లోథాల్, రాజడి రంగాపూర్, సోమనాథ్, అహలోను; క లోని దేశ పూర్, మర్ కోయిడా ప్రాంతములందున్న నగర నిర్మాణ పద్ధతి ఒకే విధంగా ఉన్నది.

మొహంజోదారో దిబ్బల తవ్వకములలో ఇటుకలతో నిర్మించిన ఒక కోటగోడ బయల్పడింది. మొహంజోదారో నగర నిర్మాణము క్రీ.పూ. 5వేల సం||ల నాటిది. ఖనన పరిశోధనలకు పూర్వము ఈ మహానగరం దిబ్బల రూపంలో ఉండేది. సౌరాష్ట్రలోని లోథాల్ లో 17 సమాధులు కనిపించాయి. అందులో ఒక సమాధిలో రెండు అస్థిపంజరాలు బయటపడినవి. దీనిని బట్టి సతీసహగమనము ఆ రోజుల్లో ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయబడినారు. కృష్ణానది ఉత్తర తీరములో గల ఏలేశ్వరములో జంట మానవ అస్థికలున్న శవ పేటిక లభించింది. హరప్పాలో లభించిన రెండు మొండెములలో ఒకటి ఎరుపు రంగులో మరొకటి పలక రంగులో ఉన్నది. హరప్పాలో అర్ధ నిమీలిత నేత్రములతో కూడిన ఒక రాజగురువు విగ్రహం లభించింది. ఇక్కడ లభించిన దేవతా, రాజరికపు లక్షణములు గల కాంస్య విగ్రహములు, నృత్య భంగిమలోనున్న నగ్న స్త్రీ విగ్రహము ఆకర్షణీయముగా ఉన్నవి. ఈ విగ్రహము ఆదిమవాసుల నృత్యభంగిమను పొలి ఉన్నది. 

 RELATED TOPICS 

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -2

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -3

సింధూ నాగరికత - హరప్పా సంస్కృతి -4