మలిదశ ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలుగా దోహద పడిన సాంస్కృతిక అంశాలు :
అమరవీరుల స్థూపం
- 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులయిన వారి స్మృత్యర్ధం నిర్మించినదే గస్పార్క్ అమర వీరుల స్థూపం. - ఈ స్తూపాన్ని చెక్కిన శిల్పి ఎక్కా యాదగిరి రావు.
- 1970, ఫిబ్రవరి 23వ తేదీన స్థూప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వారు ఆనాటి మున్సిపల్ మేయర్ లక్ష్మీ నారాయణ. అయితే ఈ స్థూప నిర్మాణం 1975లో పూర్తయినది.
స్థూపం విశేషాలు :
- ఎరుపు రంగు రాయితో చెక్కబడిన స్థూపం నలు వైపులా కనిపించే తొమ్మిది రంధ్రాలు అమర వీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్లకు ప్రతిరూపాలు.
- అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నందుకు సంకేతంగా శిలాఫణలకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు.
- స్తూపంలో కనిపించే తొమ్మిది గీతలు అప్పటి తెలంగాణ జిల్లాలకు సంకేతం
- 1969 నాటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 369 మంది విద్యార్థుల స్మృతి చిహ్నంగా దీన్ని హైదరాబాదులోని రాష్ట్ర శాసనసభ భవన సముదాయానికి ఎదురుగా ఉన్న గన్ పార్క్ నిర్మించారు.
- అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని మొదటిసారిగా పోరాడిన వ్యక్తి 1969 జై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి.
- స్తూపాన్ని ట్రెపీజియం ఆకృతిలో నిర్మించారు. అది ఓర్పు, సహనం, సత్యాన్ని తెలియజేస్తుంది. ట్రెపీజియాన్ని ఎర్రటి గ్రానైట్ శిలతో నిర్మించడం సాహసానికి, త్యాగానికి నిదర్శనం. స్తూపం పైన మకరతోరణం అమరవీరులకు స్వాగత తోరణంగా నిలిచి శ్రద్ధాంజలి ఘటించడాన్ని సూచిస్తుంది.
- స్తూపంపై చెక్కిన అశోక చక్రం శాంతి, ధర్మాలను, రాజ్యాంగ హక్కులను సూచిస్తుంది. జాగృతిని, గతిశీలతను కూడా పేర్కొంటుంది.
- స్తూపం శీర్ష భాగంలో తెలుపు వర్ణంలో తొమ్మిది రేకులున్న తెల్లని పూలు శాంతిని, స్వచ్ఛతను, కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
తెలంగాణ తల్లి విగ్రహం
- తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బి. వెంకట రమణా చారి.
- తలపై కిరీటం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడిచేతిలో కంకితో గ్రామీణ తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించబడింది.
- మలి దశ ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి వూళ్ళో ప్రతిష్ఠించి ఉద్యమాన్ని బలోపేతం చేశారు.
- వజ్రాలు పొదిగిన కిరీటంతో, బంగారు ఆభరణాలతో, పట్టువస్త్రాలతో వైభవంగా నిలబడి ఉండే భంగిమలో తెలంగాణ తల్లి విగ్రహం దర్శనమిస్తుంది.
- తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన పోచంపల్లి / గద్వాల్ పట్టుచీరతో, మెడలో కంఠహారం, పొడవైన బంగారు హారంతో, నడుముకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్, జాకోబు వజ్రాలు పొదిగిన బంగారు వడ్డాణంతో, తలపై రాజసం ఉట్టిపడే కోహినూర్, జాకోబు వజ్రాలు పొదిగిన కిరీటంతో అచ్చం దేవతామూర్తి విగ్రహం మాదిరిగా తెలంగాణ తల్లి విగ్రహం మలచబడింది.
- తెలంగాణ ప్రత్యేక హస్తకళకు నిదర్శనమైన కరీంనగర్ ఫిలిగ్రీ మెట్టెలు కాలివేళ్లకు కనిపిస్తాయి.
- తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని సూచించే బతుకమ్మను ఎడమచేతిలో, అదేవిధంగా తెలంగాణాలో మెట్టపంటగా విరివిగా పండే మొక్కజొన్న కంకిని కుడిచేత్తో పట్టుకుని చల్లనిచూపుతో తెలంగాణ ప్రజలను కరుణించే దేవతాప్రతిమగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
Pages