బొడ్డెమ్మ 

భాద్రపద మాసంలో బహుళ పంచమి నుండి మహాలయ అమావాస్య వరకు తొమ్మిది రోజులు జరుపుకునే పండగ ఇది. బొడ్డి అంటే చిన్నపిల్ల అని అర్థం. ఇది చిన్నపిల్లలు మాత్రమే జరుపుకునే పండగ. వాడవాడలో మూడు దొంతరల్లో గద్దె ఏర్పాటు చేసుకొని ఈ బొడ్డెమ్మను తయారు చేస్తారు. పసుపుబెట్టిన దేవతారూపాన్ని బొడ్డెమ్మ అంటారు. అక్కడే వెంపలి చెట్టు మొక్క పెడతారు. దానిచుట్టూ సాయంత్రం తపుకుల్లో (చిన్న 'ప్లేటు) లేదా తడికలు అల్లేవారు చేసే సిబ్బిల్లో పూలను పేర్చుకొని వచ్చి ఆటాడుతారు. వీరికి కూడా పాటలుంటాయి. 

బతుకమ్మ 

బొడ్డెమ్మ పండుగ తర్వాత వచ్చేది బతుకమ్మ, మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఇది పూలతో కూడిన ప్రకృతి పండగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలను ఏరుకొని వచ్చి బతుకమ్మను పిరమిడ్ ఆకారంలో కళాత్మకంగా పేరుస్తారు. ఇది పూర్తిగా ఊరి పండగ. ప్రతివాదకట్టులోనూ బతుకమ్మ కనిపిస్తుంది. పువ్వులు, నీరు, ప్రకృతి ఇందులో ప్రధాన అంశాలు. స్త్రీ చుట్టూ ఈ మూడూ, ఈ మూడింటి చుట్టూ స్త్రీ ఉంటుంది. పౌష్టికతను కలిగించే శక్తి పంటల్లో ఈ పువ్వుల ద్వారా వస్తుంది. నీటిని శుద్ధి చేసే క్రియగా కూడా బతుకమ్మను గుర్తించొచ్చు. ప్రకృతి పర్యావరణాన్ని గుర్తించిన పండగ. అంతా కలసి సామూహికంగా చేసుకునే పండగ. ఇందులో ఆట, మాట, పాట కలగలిపి ఉంటాయి. సంగీతం, సాహిత్యం రెండూ ఉన్నాయి. సామరస్య ధోరణిని పెంచేలా పాటలుంటాయి. పూలను పేర్చడంతో పాటు ఆట, పాట అనేవి తెలంగాణ ప్రత్యేకత. గ్రామం వెలుపల, గ్రామం లోపల ఉండే పువ్వులన్నీ ఇందులో భాగమే. ప్రతి పువ్వులోని గుణాలు నీటిని శుద్ధి పరిచి నీటికి శక్తినిస్తాయి. ఈ శక్తిమంతమైన నీరు పొలాల్లోకి పారి పంటలు పచ్చగా ఉంటాయనేది భావన. ఎరువులు తదితరాలు లేనికాలంలో నీటికి శక్తినివ్వడానికి పెట్టుకున్న ఏర్పాటిది. గడిపూలు, పిచ్చిపూలు అనుకునే వాటిలోని ఔషధ గుణాలు పొలానికి చీడ పట్టకుండా కాపాడతాయి. గునుగు పూవు, తంగేడు, గుమ్మడి పూలు ప్రధానం. రుద్రాక్ష, చంద్రకాంత పూలు కూడా ఉంటాయి. పొట్లకాయ పూలు, బీరకాయల పువ్వులను కూడా పెడతారు. గునుగు పూవులాంటి వాటిలో ఔషధ గుణాలున్నట్లు పెద్దలు చెబుతుంటారు. అందుకే దాన్ని చేరుస్తారు. రంగులద్దడం వచ్చాక ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. తంగేడు పువ్వు లేనిది బతుకమ్మ పండగ జరుగదు. దడులు, అడవుల వెంట తిరిగి వీటన్నింటినీ మగవారు ఏరుకొని వస్తారు. అలా సాయం చేస్తారు. బతుకమ్మలో బోలెడంత సాహిత్యం ఉంది. చప్పట్లతో పాటపాడటం మరో ప్రత్యేకత. వర్తులాకారంలో పువ్వును ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం అంతా సాగుతుంది. మధ్యలో ఈ బతుకమ్మలను పెట్టి వంగుతూ లేస్తూ మంగళకరమైన శబ్దాలు చేస్తారు. భ్రమరాలు వచ్చి ఝుమ్మని చేసే ఝంకారంలా ఈ చప్పట్లుంటాయి. పువ్వులు ముడుచుకొని విచ్చుకున్నట్లుగా వీరు వంగి లేస్తుంటారు. పువ్వులోని పుప్పొడి సంతాన సాఫల్యానికి ప్రతీక. బతుకమ్మలో మళ్లీ పసుపు ఉంటుంది. అన్ని రకాల చిరు ధాన్యాలను ఈ పండగలో వాడతారు. రోజుకోరకం చిరుధాన్యంతో ప్రసాదం చేస్తారు. చివరి రోజు చేసే సద్గులన్నీ ఈ చిరుధాన్యాలతో తయారయ్యేవే. ఇది పుష్టికరమైన ఆహారం. బతకమ్మకు తంగేడు పూవు ప్రధానమైంది. పూలల్లో శ్రేష్టమైంది మాత్రం గుమ్మడి పువ్వని అంటారు. ఎందుకంటే గుమ్మడిలోని కేసరాలు వసుపులాంటి గౌరమ్మకు ప్రతీక. గుమ్మడి కాయ, పువ్వును సంతాన సాఫల్యతకు ప్రతీకగా చూస్తారు. బతుకమ్మ పాటల్లో కూడా చాలావరకు సంతాన సాఫల్యం, కలిగిన సంతానాన్ని కాపాడుకునే భావనలు కనిపిస్తాయి. దైవచింతన ఉన్నప్పటికీ చాలా పాటల్లో సామాజికపరమైన ఆలోచనలు కనిపిస్తాయి. మానవవీయమైన ఆశలు, ఆశయాలకు దగ్గరగా ఉంటాయి. 

సంబంధిత అంశాలు :  బోనాలు 

తొమ్మిది రోజులు బతుకమ్మ జరిపే విధానం 

  • మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ (నైవేద్యం: పువ్వులు, నూకలు) 
  • రెండో రోజు అటుకుల బతుకమ్మ (నైవేద్యం: ఉడకపెట్టిన పప్పు, బెల్లం, అటుకులు) 
  • మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ (నైవేద్యం: ముద్దపప్పు, పాలు బెల్లం) 
  • నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ (నైవేద్యం: తడి బియ్యం, పాలు, బెల్లం) 
  • ఐదో రోజు అట్ల బతుకమ్మ (నైవేద్యం: అట్లు,దోసె) ఆరో రోజు అలిగిన బతుకమ్మ (నైవేద్యం: అటు/దోసె) 
  • ఏడో రోజు వేపకాయల బతుకమ్మ (నైవేద్యం: బియ్యపు పిండిని వేపపండ్ల ఆకారంలో) 
  • ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ (నైవేద్యం: వెన్న, నువ్వులు, బెల్లం) 

  • తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ (నైవేద్యం: పెరుగన్నం, చింతపండు, చిత్రాన్నం, నిమ్మ చిత్రాన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం )

పొలాల అమావాస్య 

ఇది పశుపోషణ పండగ. పశు సంపదను గౌరవించడం, పశువులకు, మనుషులకు ఉండే అనుబంధాన్ని తెలియజేసే పండగ ఇది. శ్రావణ మాసం చివర్లో భాద్రపద మాసం ప్రారంభంలో జరుపుకుంటారు. పశువులను అలంకరించి గౌరవిస్తారు. చిన్నపిల్లలు బంకమట్టితో అన్ని రకాల పశువులను తయారు చేసి వాటికి చిరుధాన్యపు గింజలను అతికించి అలంకరిస్తారు. ఉత్తర తెలంగాణలో ఈ పండగ రోజు పశువులను కళాత్మకంగా అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు, అలంకరణలు ప్రత్యేకంగా చేస్తారు. ఏడాదంతా కష్టపడి ప్రత్యేకంగా పశువులకు దుస్తులను కుట్టించడం, చేతులతో అల్లడం ఇదంతా పశుసంపద పట్ల మనకున్న గౌరవాన్ని, అనుబంధాన్ని చాటేవే.