సంవత్సరం పొడవునా పనులు చేసుకుంటూ ఉండే ప్రజలు తమ సంస్కృతిలో భాగంగా కొన్ని పండగలను, జాతరలను, ఆటవిడుపు రోజులను ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తులకు, కుటుంబాలకు సంబంధించినవే కాకుండా ఊరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న పండగలు తెలంగాణలో ఎక్కువ. వర్షాకాలం నుంచి సంక్రాంతి దాకా వచ్చే పండగలు ప్రధానమైనవి. పూజలు వానలతో పాటే జబ్బులు కూడా వస్తాయి. అంటు వ్యాధులు ప్రబలిపోతాయి. వాటిని తగ్గించుకోవడం కోసమని ఆనాటి ప్రజలు కొంతమంది దేవతలను పూజించడం అలవాటు చేసుకున్నారు. శరీరంపై ముత్యాల్లా పొంగే చర్మవ్యాధులు ఎక్కువగా వచ్చేవి. దీన్ని ముత్యాలమ్మ దేవతకు ఆపాదించుకున్నారు. ఆమెను శాంతింపజేస్తే ఈ జబ్బులు కూడా శాంతిస్తాయనుకున్నారు. అప్పట్లో రుఊరంతా అనారోగ్య గ్రస్థం కావడం ఉండేది. దానికి ప్రజలు భయపడేవారు. దానిని తగ్గించడం కోసం దేవతకు అదిమ భావన ప్రకారం పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

బోనాలు 

బోనం అంటే భోజనం అని అర్థం. బోనాల పండగ జులైలోనే వస్తుంది.  వానలు మొదలైన రోజుల్లో ఈ పండగను జరుపుకుంటారు. బోనాల పండుగ తంతును ఊరడి అంటారు. ఊరుఊరంతా కలిసి పండుగ చేసుకుంటారు.  దేవుళ్లు, దైవాలకు సంబంధించిన పండగల్లో ఈ ఊరి పండగ విలక్షణమైంది. ఆరోగ్యం దీని పరమార్థం. నిజానికి చాలా పండగల్లో ఆరోగ్యమే అంతర్లీనమైన అంశం. పండగ పరమార్గం పరిశుద్ధత! వ్యక్తిగతంగా, ఇంటి పరిసరాల్లో, వాడకట్టులో, గ్రామంలో.. ఇలా ప్రతిచోటా పరిశుభ్రత నెలకొల్పడం. అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ పండగను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి పండగలో ఆట, పాట, సంభాషణ, భోజనం ఉంటాయి. వీటివల్లే తెలంగాణలోని పండగల్లో ప్రత్యేక ఆహార సంస్కృతి కనిపిస్తుంది. దీంతో పాటు ఆహార్యం కూడా భిన్నమే! బోనాలు జరిపే విధానం బోనాల పండగలో అమ్మవారి ప్రతిమ ఉన్న ఘటం ఊర్లోని అన్ని ఇళ్లకు వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ భక్తితో ఘటం ముందు నీళ్లను పోస్తారు. అంటే ప్రతి ఇల్లు శుభ్రమైతే వాడ శుభ్రమైనట్లు.. వాడలన్నీ శుభ్రమైతే ఊరంతా శుభ్రమవుతుంది.. ఊరంతా శుభ్రమైతేనే ఆరోగ్యం పరిఢవిల్లుతుంది. దైవభావన సంగతి అలా ఉంచి - అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాల నుంచి కాపాడుకోవడం అంతస్సూత్రంగా కనిపిస్తుంది. ధాన్యాన్ని సామూహికంగా సేకరించడం కూడా ఇందులో భాగమే. ఊరుఊరంతా కలసికట్టుగా అనారోగ్యాన్నిఎదుర్కొంటుంది. ఇది స్త్రీ, పురుషులు కలసి చేసే పండగ. 

సంబంధిత అంశాలు :  తెలంగాణ  పండగలు

ముత్యాలమ్మకు తమ్ముడైన పోతరాజు సారథ్యంలో ఈ పండగ జరుగుతుంది. పోతరాజు సంస్కృతి మరాఠీ, చత్తీస్ గఢ్ ల్లోనూ ఉంది. స్త్రీ దైవానికి అంగరక్షకుడిగా పోతరాజు ఉంటాడు. పోతరాజు దైవం కాదు. స్త్రీలతో పాటు పులి వేషధారణతో పోతరాజులు కూడా ఒళ్లంతా పసుపు రాసుకోవడంలోనే చర్మవ్యాధులు రాకుండా ఉండాలనే భావన ఉంది. ఈ పండగలో కుమ్మరి ప్రధాన పూజారి. బైండ్లవారు లేనప్పుడు కుమ్మరే ఇక్కడ పూజారి. కుండ లేకుండా మన సమాజం లేదు. కుండ గర్భానికి కూడా సంకేతం. కుండ ద్వారానే గ్రామం శుద్ధి! బావిలోని నీటికి, ఊరి అవసరాలకు కుండే ఆధారం. బోనం పెట్టడం - అమ్మవారిని శాంతింపజేయడమనే అలౌకిక భావనలో అంతా కలసి వ్యాధులను ఎదుర్కొనే సౌహారత దాగుంది. మూడోరోజు పెట్టే ఫలహార రథంలో పెట్టే పదార్థాలు కూడా ఆరోగ్యాన్ని పెంచేవే! చిరుధాన్యాలతో చేసేవే. మరింత ఆరోగ్యవంతంగా తయారయ్యేలా, పుష్టినిచ్చేలా, రోగనిరోధక శక్తిని పెంచేలా ప్రసాదాలుంటాయి.

రంగం 

బోనాలు జరుపుకున్న మరుసటి రోజు జరిగే ముఖ్యమైన అంశం 'రంగం'. పూనకం వచ్చిన స్త్రీ ఈ 'రంగం'లో భవిష్యవాణి వినిపిస్తుంది. భవిష్యత్తు కష్టనష్టాలు, సుఖాలు, వ్యవసాయం, వర్షాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం 'రంగం' చేస్తారు. బోనాలు హైదరాబాద్ లో ప్రధానంగా కనిపించినా తెలంగాణ అంతటా ఏదో రూపంలో  నిర్వహిస్తారు. ప్రజల మాటలు, పాటలు, వ్యవహారాల్లో ఎంతో ఉన్నతమైన భావన, మంచి జరగాలన్న ఆకాంక్ష ఈ పండగలో కనిపిస్తుంటుంది. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అందరికీ శుభం జరగాలనే సామూహిక ఆకాంక్షలు కనిపిస్తాయి. దొంతి పెట్టే ఘటాల్లో (కుండల్లో) నీరు, ఆహారం ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడాన్ని రతిపోయడం, కుంభం పోయడం, పొంగళ్లు పెట్టడం.. అని కూడా అంటారు. ఇందులో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేవి. మొత్తం క్రతువులో స్త్రీ ప్రధాన బిందువు. పురుషుడు సహాయకారిగా ఉంటాడు. తన బిడ్డలు, కుటుంబ ఆరోగ్యాన్ని కోరుకుంటుంది తల్లి. పిల్లలు కలగాలని కూడా దేవతను కొలుస్తారు. అందుకోసం తొట్టెల రూపంలో ప్రభలు కడతారు. అంటే సంతానం కోసం చేసే ఆవాహన ఇది. ఆదిలాబాద్ సరిహద్దుల్లోని మహారాష్ట్ర మాహోర్‌లో ఉండే దేవతను మావూరి ఎల్లమ్మ, మావురాల ఎల్లమ్మగా పిలుస్తారు. అక్కడ శిరస్సు మాత్రమే ఉంటుంది. కింది భాగం కర్ణాటకలో ఉంటుంది. జానపదాల్లో వీటికి సంబంధించిన పాటలన్నీ ఉన్నాయి.