రోబోట్‌ల రూపకల్పన, నిర్మాణం,అమరిక, నమూనా,  అనువర్తనాలు, ఉపయోగాలకు సంబంధించిన సాంకేతిక శాస్త్రాన్ని రోబోటిక్స్ (Robotics) అంటారు. రోబోటిక్స్ అనేది ఇంజినీరింగ్ మరియు సాంకేతికతల కలయికతో కూడి ఉంటుంది. వర్తమాన కాలంలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. రోబోట్ అనేది స్వయగా కానీ,  మానవుడి మార్గదర్శకత్వంలో కానీ మానవుడు నిర్వహించే అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించే యంత్రం.

రోబోటిక్స్(Robotics) లో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సూత్రాలు  మిళితమై ఉంటాయి. అందుకే ఆ విభాగాల ఆధారిత విభాగంగా కూడా రోబోటిక్స్ ను పేర్కొంటారు. మానవులకు కష్టతరమైన, ప్రమాదకరమైన, అసాధ్యమైన పనులను చేయగల యంత్రాలను రూపొందించడానికి రోబోటిక్స్ సాంకేతికత సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రంగాల్లో మానవునికి ప్రత్యామ్నాయంగా కూడా రోబోట్ లను వాడుతున్నారు.

పూర్వరంగం : 

  • రోబోట్ పదానికి రోబోటా(Robota) అనే స్లావిక్ పదం మాతృక. ఈ పదానికి “బలవంతపు శ్రామికుడు” అని అర్థం.  రోబోట్ అనే పదం నుండే రోబోటిక్స్ పదం ఉద్భవించింది. కారెల్ ఈపెక్(Karel Eapek) అనే చెక్ రచయిత (Czech writer) 1920లో రచించిన (R.U.R.-Rossum’s Universal Robots) అనే నాటకంలో మొదటి సారి ఈ పదాన్ని ఉపయోగించాడు. 
  • నోర్ బెర్ట్ వీనెర్(Norbert Wiener) అనే శాస్త్రవేత్త తొలిసారిగా 1948లో ప్రయోగాత్మక రోబోటిక్స్ సూత్రాలను సైబెర్నెటిక్స్ అనే పేరుతొ ప్రతిపాదించాడు. కానీ పూర్తిస్థాయి రోబోటిక్స్ సాంకేతికత 20వ శతాబ్దంలో రూపొందించబడ్డాయి. 
    సంబంధిత అంశాలు : రోబోటిక్స్ అనువర్తనాలు    

ఉపయోగాలు :

  • తయారీ, ఆరోగ్య సంరక్షణ, రవాణా, వినోదం, విద్య, అంతరిక్ష పరిశోధనలతో సహా అనేక రకాల అనువర్తనాల్లో రోబోట్‌లను ఉపయోగించవచ్చు. 
  • వస్తువులను ఎత్తడం, తరలించడం, శస్త్రచికిత్సా విధానాలు, స్వయంచాలక  డ్రైవింగ్ వంటి సాధారణ నుండి సంక్లిష్టమైన పనులన్ని చేయడానికి రోబోట్లను  రోబోటిక్స్ సాంకేతికతతో రూపొందించవచ్చు.  
  • జీవ-ప్రేరిత రోబోటిక్ యంత్రాలు ప్రకృతి ద్వారా ప్రేరణ పొంది రూపొందించబడుతున్నాయి.
  • పారిశ్రామిక రోబోట్‌లు, సర్వీస్ రోబోట్‌లు, మొబైల్ రోబోట్‌లు, హ్యూమనాయిడ్ రోబోట్‌ (మానవ రోబోట్) లతో సహా అనేక రకాల రోబోట్ లు అందుబాటులో ఉన్నాయి. 
  • పారిశ్రామిక రోబోట్‌లు వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లీ వంటి పునరావృత పనులను నిర్వహించడానికి తయారీ, ఇతర పారిశ్రామికరంగాలలో ఉపయోగించబడతాయి. 
  • గృహావసరాల రోబోట్‌లు శుభ్రపరచడం, మిలిటరీ రోబోట్లు భద్రత; ఇంకా కొన్ని రోబోట్లు వృద్ధులు, వికలాంగులకు సహాయం అందించడం వంటి అనేక రకాల పనులలో ఉపయోగించబడతాయి. 
  • బోధనోపకరణాలుగా ఉపయోగించే రోబోట్లను STEM (Science, Technology, Engineering & Mathematics) అని పిలుస్తారు. 
  • మొబైల్ రోబోట్‌లు చుట్టూ తిరిగేలా రూపొందించబడ్డాయి.  అన్వేషణ లేదా డెలివరీ వంటి అవసరాలకు  వీటిని ఉపయోగించవచ్చు. హ్యూమనాయిడ్ రోబోట్‌లు మనుషుల్లా కనిపించడమే కాకుండా, మనుషులు చేసే పనులు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.  వీటిని వినోద, పరిశోధనా రంగాల్లో  ఉపయోగించవచ్చు.
       సంబంధిత అంశాలు : రోబోట్‌ల విడిభాగాలు      

కీలక భాగాలు 

మెకానికల్ స్ట్రక్చర్ , సెన్సార్‌, యాక్యుయేటర్‌, నియంత్రణ వ్యవస్థ (కంట్రోల్ సిస్టమ్‌)లు రోబోట్‌లోని కొన్ని కీలక భాగాలు. రోబోట్ యొక్క భౌతిక ఫ్రేమ్‌వర్క్‌ను మెకానికల్ స్ట్రక్చర్నిర్ణయిస్తుంది.  అయితే సెన్సార్లు దాని వాతావరణంలో మార్పులను గుర్తించడానికి, ప్రతిస్పందించడానికి సహకరిస్తాయి. యాక్యుయేటర్‌లు రోబోట్‌ను వస్తువులను తరలించడానికి, మార్చడానికి అనుమతించే భాగాలు.  చేయాల్సిన పనిని పూర్తిచేయడానికి వివిధ భాగాల చర్యలను సమన్వయం చేయడం నియంత్రణ వ్యవస్థ యొక్క విధి. ఈ విధంగా రోబోట్లలో ఉండే వివిధ భాగాలు తమతమ విధులను నిర్వర్తిస్తాయి.

       సంబంధిత అంశాలు : హ్యూమనాయిడ్ రోబోట్లు