మార్చి 18, 2015వ తేదీన విపత్తు నష్టాల తగ్గింపుపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన 3వ ప్రపంచ మహాసభలో భారత్ సహా ఐక్యరాజ్య సమితిలో గల 188 దేశాలు 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రణాళికను ఆమోదించాయి. ఈ సభ జపాన్ లోని సెండాయ్ నగరంలో జరిగింది. అందుకే ఈ ఒప్పందానికి 'సెండాయ్ ఒప్పందం' (Sendai Framework for Disaster Risk Reduction 2015-2030)అని పేరు.

సెండాయ్ ఒప్పందం(Sendai Framework)లో ముఖ్యమైన అంశాలు :

1) విపత్తులపై అవగాహన

2 విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని బోపేతం చేయడం

3) విపత్తు నుంచి కోలుకోవడానికి పెట్టుబడులు

4) విపత్తును ఎదుర్కొనే సామర్థ్య పెంపుదల, మెరుగైన పునర్నిర్మాణం సెండాయ్ ఒప్పందం ప్రాముఖ్యత

హ్యెౄగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ 2005-2015 (Hyogo Framework for Action 2005-2015)కు కొనసాగింపుగా సెండాయ్ ఒప్పందం అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం విపత్తు నిర్వహణలో అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. 1989 నాటి ప్రకృతి వైపరీత్యాల దశాబ్దం రీత్యా అంతర్జాతీయ కార్యాచరణ, 1994 నాటి భద్రమైన ప్రపంచం కోసం యోకాహోమా ప్రణాళిక, 1999 నాటి వైపరీత్య నష్టాలను తగ్గించే అంతర్జాతీయ ఒడంబడికల అమలులో ప్రపంచ దేశాల చర్యలకు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ ఒప్పందం రూపొందించబడినది. ఈ ఒప్పందం జరగడానికి పదేళ్ళ ముందు జరిగిన హెలాగో ఒప్పందంలో భాగంగా సభ్యదేశాలు, ఇతర భాగస్వాములు చేసిన కృషికి కొనసాగింపుగా, అనేక కార్యాచరణయుత అంశాలతో కూడిన అనేక సరికొత్త మార్పులతో సెండాయ్ ఒప్పందం రూపొందించడం జరిగింది.

సంబంధిత అంశాలు : హ్యోగో ఫ్రేమ్‌వర్క్ ఫర్ యాక్షన్ 2005-15

విపత్తు నిర్వహణ రంగంలో గతంలో చేసిన అనేక తీర్మానాల కార్యాచరణలను ముందుకు తీసుకువెళుతూ, భవిష్యత్తు కోసం ఎన్నో నూతన ఆలోచనలకు రూపకల్పన చేయబడిప సెండాయ్ ఒప్పందం విపత్తు నిర్వహణ నుంచి విపత్తు ముప్పు తగ్గింపునకు ముందస్తు చర్చలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. దీనిని ఒక సానుకూల మార్పుగా చెప్పవచ్చు. ఈ ఒప్పందంలో భాగంగా విపత్తు ముప్పు తగ్గింపు పరిధిని విస్తృతం చేయడే కాకుండా, దానిని ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులకు, పర్యావరణ, సాంకేతిక, జీవవైవిధ్య మొదలైన వాటికి సంబంధించిన విపత్తులకు పరిధిని పెంచారు. ఆరోగ్యంపై కూడా ప్రధానంగా దృష్టిపెట్టారు.

సెండాయ్ ఒప్పందం విపత్తు ముప్పుకు సంబంధించి మరింత అవగాహన అన్ని స్థాయిలలో పెరగాల్సిన అవసరాన్ని గూర్చి తెలుపుతున్నది. అంతేకాకుండా విపత్తు ముప్పు తగ్గింపు ముందస్తు చర్యల పాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, జవాబు దారీతనాన్ని పెంపొందించడం, జాతీయ స్థాయిలో వేదికల ఏర్పాటు, ఉత్తమ పునర్నిర్మాణ కార్యక్రమాల సన్నద్ధత, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం వంటి అంశాలను ఈ ఒప్పందంలో ప్రస్తావించడం జరిగింది.

సెండాయ్ ఒప్పందం-భారత్ ప్రణాళిక

"జాతీయ విపత్తు నిర్వహణ నూతన ప్రణాళిక - 2016" విపత్తులను ఎదుర్కోవడంలో అన్ని స్థాయిలలో మన సమర్ధతను గరిష్ఠస్థాయికి చేరుస్తోంది. అన్ని రంగాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో విపత్తు ముప్పు నివారణ ముందస్తు చర్యలను అంతర్భాగం చేశారు. అలాగే జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (ఎన్.డి.ఎం.పి) అంతర్జాతీయంగా విపత్తు నిర్వహణలో అనుసరిస్తున్న ధోరణులను పరిగణనలోకి తీసుకుంటుంది. అదేవిధంగా భారత దేశం సంతకం చేసిన సెండాయ్ ఒప్పందం మార్గసూచిని అనుసరిస్తుంది. విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాలంటే అభివృద్ధి ప్రణాళికలలోనే ముందస్తుగా విపత్తు నష్ట నివారణకు దోహదపడే రీతిలో పెట్టుబడులు పెట్టాల్సిన అసవరం ఉంటుంది. విపత్తు కారణంగా సంభవించే ముప్పు గురించిన సమాచారాన్ని సమాచారాన్ని అందుబాటులో ఉంచి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే, పెట్టుబడులు పెట్టే విధానాలను ప్రోత్సహించడం సరైనదపి భావించడం జరిగింది. భవిష్యత్తులో విపత్తులకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల విషయంలో ఆయా ప్రాజెక్టులకు విపత్తు ముప్పును అంచనా వేయడం తప్పనిసరి చేయాలి. అది ప్రభుత్వ ప్రాజెక్టు ఆయినా, ప్రైవేటు పెట్టుబడి ప్రాజెక్టు అయినా అభివృద్ధి ప్రయోజనాలను కాపాడేదిగా ఉండేట్టు చూడాలి. విపత్తు ముప్పును ఎదుర్కోవడానికి

సుస్థిరాభివృద్ధి సాధన లక్ష్యసాధన

ప్రజలు కేంద్రంగా ముందస్తు నష్ట నివారణ విధానాలు ఉండాలి. విపత్తు ముప్పు తగ్గింపునకు అనుసరించే విధానాల అమలులో అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా, సమర్థంగా ఉండాలి. విపత్తు ముప్పు తగ్గింపు విధానాల అమలులో, ప్రమాణాలను పాటించడంలో, ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించాలి. మహిళలు నాయకులుగా, విద్యార్థులు, మేధావులు, యువకులు, పిల్లలు, పౌర సమాజం, ఇలా అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధన శాలలు కలిగిన రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేయాలి. వివిధ వర్గాలు విపత్తు ముప్పు తగ్గింపును తమ యాజమాన్య విధానాలలో అంతర్భాగం చేయాలి. ఇటువంటి అంశాలను సమర్ధవంతంగా అమలుచేయడం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధ్యపడుతుంది.