అకస్మాత్తుగా ప్రకృతి కారణంగా లేదా మానవ తప్పిదాల వలన సంభవించి, సమాజానికి లేదా వ్యవస్థకు అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని, భయాన్ని కలుగజేసే భయంకర సంఘటనలను “విపత్తు” అని నిర్వచిస్తారు. ఆంగ్లంలో విపత్తును “డిజాస్టర్” అని అంటారు. రెండు గ్రీకు పదాలైన డిస్(దుష్ట), ఆస్టర్(నక్షత్రం)ల కలయిక వల్ల ఉద్భవించింది. ఈ పదానికి 'దుష్ట నక్షత్రం' లేదా కీడు లేదా నష్టం కలిగించే నక్షత్రం అని అర్థం.

ఈ విపత్తులు పూర్వ కాలం నుండి కూడా అనేకం సంభవిస్తూనే ఉన్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి విపత్తులు సంభవించడం పెరిగింది. ఇవి ఆస్తి, ప్రాణ నష్టాలతో పాటు పర్యావరణ హానిని కూడా కలుగజేస్తున్నాయి.

విపత్తులు కలగడానికి అనేక రకాల కారణాలున్నప్పటికీ వాటిలో ముఖ్యమైనవి భౌగోళిక, వాతావరణ, మానవచర్యలు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఏదోఒక చోట తరచుగా ఏదో ఒక రకమైన విపత్తు సంభవిస్తూనే ఉంటుంది. భారతదేశంలో కూడా ఏదో ఒక రకమైన విపత్తు సంభవిస్తుంటుంది. భారతదేశంలో గల ఎత్తయిన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, అనేక వేల కిలోమీటర్లు ప్రవహించే నదీ వ్యవస్థలు విపత్తులు సంభవించడానికి కారణభూతమవుతున్నవి.

అటవీ వనరుల నిర్మూలన, చెట్లను నరకడం ద్వారా ఏర్పడే వాయుకాలుష్యం, జీవవైవిధ్యం దెబ్బతినడం వంటి కారణాల వలన ప్రకృతిలో కలిగే మార్పుల వలన కూడా విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతి సంరక్షిస్తే అది మనల్ని కూడా సంరక్షిస్తుంది అనే అనే దృష్టిలో ఉంచుకొని, మానవ తప్పిదాల వలన ప్రకృతిలో జరిగే నష్టాన్ని ఆప గలిగితే కనీసం మానవ తప్పిదాల వలన కలిగే విపత్తులను తగ్గించవచ్చు.

నిర్వచనాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినపుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి, సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితినే విపత్తు అంటారు.

విపత్తు నిర్వహణ చట్టం-2005

ఏదైనా ప్రాంతంలో ప్రకృతిసిద్ధంగా లేదా మానవ కల్పిత కారణాల వలన గానీ లేదా ప్రమాద వశాత్తూ గానీ లేదా నిర్లక్ష్యం వలన గానీ సంభవించి, సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా భారీ ఆస్తి, ప్రాణ విధ్వంసానికి లేదా నష్టానికి, పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం, తీవ్ర విపత్తు లేదా దుర్ఘటనగా భావించబడుతుంది.

ఐక్యరాజ్య సమితి

సమాజం లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణాన్ని, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద.

ఏదైనా ఒక కమ్యూనిటీ లేదా సమాజం తన సొంత వనరులతో కోలుకోగలిగే సామర్థ్యానికి మించి విస్తారమైన మానవ, ఆర్థిక లేదా పర్యావరణ నష్టాలకు కారణమవుతూ ఒక కమ్యూనిటీ లేదా సమాజ నిర్వహణకు వరుసగా అంతరాయం అంతరాయం కలిగించే ఘటనలను విపత్తు అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలుకోవడానికి బయటి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవసరమయ్యేంత నష్టం, ఆర్థిక విధ్వంసం, మానవ ప్రాణనష్టం; ఆరోగ్యం, ఆరోగ్య సేవల పతనానికి కారణమయ్యే ఏదయినా ఘటనను విపత్తు అంటారు.