భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించాడు. అతని అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. అతను తన తండ్రి తరపున తైమూర్ మరియు తల్లి వైపు మంగోల్ పాలకుడు చెంగిజ్ ఖాన్తో సంబంధం కలిగి ఉన్నాడు. మొఘలులను తైమూర్ వంశానికి చెందిన వారిగా పరిగణిస్తారు కావున వారిని తైమూరిడ్స్ అని కూడా పిలుస్తారు. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మీర్జా తర్వాత ట్రాన్సోక్సియానాలోని ఒక చిన్న రాజ్యమైన ఫర్హానాకు 12 సంవత్సరాల చిరు ప్రాయంలోనే బాబర్ పాలకుడయ్యాడు. మధ్య ఆసియా నుండి భారతదేశంపైకి దండెత్తి వచ్చిన ఇతర ఆక్రమణదారుల వలె, బాబర్ కూడా మొదట భారతదేశంలోని అపారమైన సంపదలను చూసి భారతదేశం వైపు ఆకర్షితుడయ్యాడు. కానీ తరువాత కాలంలో భారతదేశంలో మొఘల్ పాలనకు పునాది వేశాడు.

బాబర్ (క్రీ.శ.1526-1530)

బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. మొదట కాబూల్ లో స్థిరపడిన బాబర్ తరువాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. బాబర్ పంజాబ్ లోని భీరా (క్రీ.శ.1519 - 1520), సియాల్కోట్ (క్రీ.శ.1520), లాహోర్లోని శక్తివంతమైన కోటలను జయిస్తూ భారతదేశంలో విజయపరంపర కొనసాగించాడు. బాబర్ పంజాబ్ పరగణాలను జయించాలని కోరుకోవడానికి ప్రధాన కారణం తాను కాబూల్ సామ్రాజ్య పోషణకు సరిపోయినంత ఆదాయం లేకపోవడం. అంతేకాకుండా అతను కాబూల్పై ఉజ్బెక్లో దాడి గురించి కూడా కాస్త భయపడడం మరియు ఉజ్బెక్లలకు వ్యతిరేకంగా నిర్వర్తించే కార్యకలాపాలకు భారతదేశం తగిన స్థావరంగా భావించాడు. సికిందర్ లోఢీ మరణం తర్వాత క్రీ.శ.1517 నుండి భారతదేశంలో ఏర్పడిన అస్థిర రాజకీయ పరిస్థితులు బాబర్ ను భారతదేశంపైకి దండెత్తడానికి మరింతగా సహాయపడ్డాయని చెప్పవచ్చు.

ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోఢీ పట్ల అసంతృప్తితో ఉన్న పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్  బాబర్ ను భారతదేశం పైకి దండేత్తాల్సిందిగా ఆహ్వానించాడు. 21 ఏప్రిల్ 1526 న, బాబర్ కు ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీం లోఢీకి మధ్య జరిగిన పానిపట్ యుద్ధంలో ఇబ్రహీంలోడిని ఓడించి బాబర్ ఢిల్లీని ఆక్రమించాడు. ఇబ్రహీం లోడి అత్యున్నత సైనిక వ్యస్థ కలిగి ఉన్నప్పటికీ, బాబర్ యొక్క అత్యుత్తమ వ్యూహం, ఫిరంగిదళాల వినియోగం కారణంగా యుద్ధంలో ఓటమిపాలు కావాల్సి వచ్చింది.

మొదటి పానిపట్ యుద్ధంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ వరుసగా ఖన్వా యుద్ధం (క్రీ.శ.1527), చందేరి యుద్ధం (క్రీ.శ.1528 ), గోగ్రా యుద్ధం (క్రీ.శ.1529) యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు.