భారత రాజ్యాంగంలోని అధికరణ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా భారత రాష్ట్రపతి సిఫార్సుపై ఆర్థిక సంఘం ఏర్పాటుచేయాలి. ఆర్థికసంఘం సిఫారసులు తప్పనిసరిగా అమలు చేయాలని భారత రాజ్యంగంలో ఎక్కడా పేర్కొనకపోయినప్పటికీ దాని సిఫారసులు అమలు చేస్తారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థయే కాకుండా ఒక సలహా సంస్థ కూడా.

ఆర్థిక సంఘం నిర్మాణం

భారతదేశంలో మొదటి ఆర్థిక సంఘం నవంబర్ 1951లో ఏర్పాటు చేయబడింది. ఆర్థికసంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, ఒక కార్యదర్శితో కూడిన ఐదుగురు నిపుణులు కొలువై ఉంటారు. రాజ్యాంగంలోని 12వ భాగంలోని అధికరణ 280 ప్రకారం ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటుచేస్తాడు.

ఛైర్మన్ సభ్యుల అర్హతలు

(ఎ) హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడటానికి అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి.

(బి) ప్రభుత్వం యొక్క ఆర్థిక మరియు ఖాతాలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలి లేదా 

(సి) ఆర్థిక విషయాలలో మరియు పరిపాలన సంబంధిత అంశాలలో అపారమైన అనుభవం ఉండాలి లేదా

(డి) ఆర్థికశాస్త్రాంశాలపై ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అర్థికసంఘం యొక్క ప్రధాన బాధ్యతలు

  • కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడే పన్నుల నికర ఆదాయాల విభజన, రాబడి యొక్క సంబంధిత వాటాల రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేయడం.
  • ఆర్థిక సహాయం అవసరమైన రాష్ట్రాలకు నియమాలు, గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం.
  • రాష్ట్ర ఆర్థికసంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలోని పంచాయతీలు, మునిసిపాలిటీల వనరులకు అనుబంధంగా రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ (సంఘటిత నిధి)ను పెంచడానికి తగు చర్యలు తీసుకోవడం.
  • పంచాయతీలు, మునిసిపాలిటీలకు చట్టబద్ధమైన హోదాను కల్పిస్తూ 1992లో రాజ్యాంగంలోని 73వ మరియు 74వ సవరణల తర్వాత చివరి విధి జోడించబడింది.
  • రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన విధులు అన్ని ఆర్థిక సంఘాలకు ఒకే విధంగా ఉంటాయి. వివిధ ఆర్థికసంఘాల నిబంధనలలో పేర్కొనబడ్డాయి.
  • ఆర్థికసంఘం తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి వీలుగా రాజ్యాంగం ఆర్థికసంఘం దాని విధివిధానాలను రూపొందించే సంపూర్ణ అధికారం కల్పించింది.
  • భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘం చేసిన ప్రతి సిఫార్సును, తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరణాత్మక మెమోరాండంను రాష్ట్రపతి ప్రతి పార్లమెంటు సభకు సమర్పించాల్సి ఉంటుంది.
  • ప్రణాళిక గ్రాంట్లకు సంబంధించిన మూడవ కమీషన్ సిఫార్సులు మినహా కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్థికసంఘం సిఫార్సులను అంగీకరిస్తుంది.
  • కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల నికర రాబడిని పంపిణీ చేయడం లేదా వాటి మధ్య విభజించబడం. అటువంటి రాబడి యొక్క సంబంధిత వాటాల రాష్ట్రాల మధ్య కేటాయింపు చేయడం.
  • కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా(భారత సంఘటిత నిధి) నుండి రాష్ట్రాల ఆదాయాల గ్రాంట్స్-ఇన్- ఎయిడ్ను నియంత్రించాల్సిన నియమాలు రూపొందించడం.
  • రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలోని పంచాయితీల వనరులకు అనుబంధంగా రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టడం.

ఈ విధంగా, ఆర్థికసంఘం దాని విధానాలను రూపొందిస్తుంది. దాని విధుల నిర్వహణలో పార్లమెంటు చట్టం ద్వారా వాటికి సూచించిన అధికారాలను కలిగి ఉంటుంది.

ఆర్థిక సంఘాలు - అధ్యక్షులు :

1వ ఆర్థిక సంఘం(1951) - కె.సి.నియోగి 

2వ ఆర్థిక సంఘం(1956) - కె. సంతానం 

3వ ఆర్థిక సంఘం(1960) - ఎ.కె. చాందా 

4వ ఆర్థిక సంఘం(1964) - పీ.వి. రాజమన్నార్ 

5వ ఆర్థిక సంఘం(1968)- మహావీర్ త్యాగి 

6వ ఆర్థిక సంఘం(1972) కె. బ్రహ్మానందరెడ్డి 

7వ ఆర్థిక సంఘం(1977) - జె.ఎమ్. షెలాత్ 

8వ ఆర్థిక సంఘం(1982) వై.బి. చవాన్ 

9వ ఆర్థిక సంఘం((1987) – ఎన్.కె.పి.సాల్వే 

10వ ఆర్థిక సంఘం(1992) - కె.సి. పంత్ 

11వ ఆర్థిక సంఘం(1998) - ఎ.ఎమ్. ఖుస్రో 

12వ ఆర్థిక సంఘం(2002) - సి.రంగరాజన్ 

13వ ఆర్థిక సంఘం(2007) - విజయ్ కేల్కర్ 

14వ ఆర్థిక సంఘం(2013) – వై.వి. రెడ్డి 

15వ ఆర్థిక సంఘం(2017) - ఎన్.కె. సింగ్