1994లో జపాన్ లోని యొకొహోమ నగరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మొదటిసారిగా 'విపత్తు సంసిద్ధత'ను చర్చించారు. దాని స్ఫూర్తితో 1999లో భారత్ లో ఒక 'హై పవర్డ్ కమిటీ (హెచ్ పీసీ) ఏర్పాటు జరిగింది. 2001 గుజరాత్ భూకంపం అనంతరం భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ఏర్పాటుకు, నిర్మూలన చర్యలను సూచించడానికి ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలలో మొదటిసారి విపత్తు నిర్వహణకు సంబంధించిన అంశాన్ని చేర్చడం జరిగింది.

వ్యవస్థ నిర్మాణం

కేంద్ర హోంమంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ(విపత్తు నిర్వహణ) విపత్తు నిర్వహణ విభాగానికి నేతృత్వం వహిస్తారు. ఆయనకు సహకరించడానికి గాను డైరెక్టర్లు ముగ్గురు, అండర్ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్లు టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ ఎకనామిక్ ఇన్వెస్టిగేటర్, కన్సల్టెంట్స్, ఇతర సహాయక సిబ్బంది ఉంటారు.

విపత్తు నిర్వహణ చట్రం

పునరావాస కార్యక్రమాల స్థాయి నుండి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు చేయడం, వాతావరణ సంబంధిత వైపరీత్యాలకు సంబంధించిన వ్యవస్థల పర్యవేక్షణ స్థాయికి భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థ పరిణామం చెందింది. ఇందులో భాగంగానే ముంచుకొస్తున్న విపత్తు ప్రమాదాల గురించి హెచ్చరికలు, ఆదేశాలు, తాజా సమాచారం అందించడం మొదలైన పనులు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులోనే విభిన్న మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు భాగస్వాములుగా ఉండే ఒక అత్యున్నతాధికార బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మంత్రిత్వశాఖల్లో కొన్నిటిని వివిధ రకాల విపత్తుల కోసం నోడల్ అథారిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తు నిర్వహణపై ఏర్పాటు చేయబడిన అత్యున్నతాధికార కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా విపత్తుల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థాగతమైన నిర్మాణాన్ని, విపత్తు నిర్వహణను సంస్థాగతం

చేయడానికి సరైన చట్టాన్ని చేయడంలో భాగంగా మంత్రిత్వశాఖల మధ్య బహుళస్థాయి సంబంధాలు, విపత్తు నిర్వహణ చట్రం అవతరించడం జరిగింది.

Must Read : 

జాతీయస్థాయిలో విపత్తు నిర్వహణ, ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖలు

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (National Disaster Management Authority - NDMA)


విపత్తు నిర్వహణ చట్టం-2005

ఈ చట్టంను రాజ్యసభ 2005 నవంబర్ 28న, లోక్ సభ 2005 డిసెంబర్ 12న అమోదించగా, 2005 డిసెంబర్ 23వ తేదీనుండి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. 2006 జనవరి 9వ తేన రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఈ చట్టంలో 11 అధ్యాయాలు, 79 సెక్షన్లు ఉన్నాయి. భారతదేశంలో సమర్ధవంతమైన విపత్తు నిర్వహణకు, అందుకు సంబంధించిన లేదా దాని వలన సంభవించిన యాధృచ్ఛిక ఘటనల నిర్వహణకు తగిన చర్యలను ఈ చట్టం రూపొందించి, అమలు విధానం రూపకల్పనల పర్యవేక్షణకు కావలసిన వ్యవస్థాగత యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలకు భరోసా కల్పిస్తుంది.

* ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థలు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (National Disaster Management Authority-NDMA) 

* రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (State Disaster Management Authority-SDMA) 

* జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (District Disaster Management Authority-DDMA) 

* జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (National Institute of Disaster Management -NIDM) 

* జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (National Disaster Response Force-NDRF)