స్థూలంగా 20వ శతాబ్ది ఆరంభం నుంచి తెలంగాణ ఆధునిక కవిత్వ యుగంగా గుర్తించి అధ్యయనం చేయాలి. తెలంగాణ సామాజిక పరిణామ దశలు భిన్నంగా ఉన్నాయి. నిజాం రాచరిక పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. పన్నులు, వెట్టిచాకిరీ, నిరక్షరాస్యత, కాలుపద్ధతి వంటివి ఎన్నో సామాజిక సంచలనాలకు కారణమయ్యాయి. గ్రంథాలయోద్యమం, రైతాంగ విమోచనోద్యమం, సాయుధ పోరాటం వంటివి సంభవించాయి. ఈ సామాజిక విప్లవాలు, ఉద్యమాలన్నీ సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి. తెలంగాణలో ప్రత్యేకమైన సాహిత్యం పురుడు పోసుకుంది. సంప్రదాయరూపమైన పద్యంలో సామాజిక విప్లవ భావనలు పెల్లుబికాయి. పాటల్లో ప్రజల భావోద్వేగాలు ప్రజ్వరిల్లాయి. 354 మంది కవి, పండితుల రచనలతో సురవరం ప్రతాపరెడ్డి రూపొందించిన 'గోలకొండ కవుల సంచిక' తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. కాళోజీ, దాశరథి, సుద్దాల హన్మంతు, యాదగిరి, పొట్లపల్లి రామారావు, గంగుల శాయిరెడ్డి, వానమామలై సోదరులు మరెందరో ఉత్తేజభరితమైన రచనలు చేశారు. ఆధునిక సాహిత్యంలో అవతరించిన రచనా ప్రక్రియలు కథ, నవల, వ్యాసం, ఆత్మకథ మొదలైన ప్రక్రియలన్నీ తెలంగాణలో విశేషంగా వెలువడ్డాయి. వీటిని నాలుగు దశలుగా అధ్యయనం చేయవచ్చు. రైతాంగ విమోచనోద్యమ నేపథ్యంతోను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంతోను విప్లవోద్యమ భూమికగాను కాల్పనికోద్యమ ప్రభావంగాను వచ్చిన సాహిత్యాన్ని విడివిడిగా అధ్యయనం చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు.
సంబంధిత అంశాలు : తెలంగాణ ఆధునిక సాహిత్యం - కవిత్వం రూపాలు |
తెలంగాణలో తొలికథ కొమర్రాజు లక్ష్మణరావు 1910లో రాసిన ఏబది వేల బేరము. కొందరు మాడపాటి హనుమంతరావు 1912లో రచించిన హృదయశల్యము మొదటి కథగా భావిస్తారు. సురవరం ప్రతాపరెడ్డి సంఘాల పంతులు', కాళోజీ తెలియక ప్రేమ తెలిసి ద్వేషము', నెల్లూరి కేశవస్వామి 'యుగాంతం', ఆవుల పిచ్చయ్య రాసిన 'ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమిందారు, వెట్టిచాకలి దినచర్య' కథలు సుప్రసిద్ధమైనవి. వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన జైలుకథలు తెలుగు సాహిత్యంలో మొదటగా జైలు జీవితాన్ని చిత్రించాయి. పీవీ నరసింహారావు రాసిన 'గొల్లరామవ్వ' మంచి కథ. దళిత కవి భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందు సంస్థను స్థాపించి దళిత చైతన్యానికి ప్రేరకుడయ్యాడు. ఆయన రచించిన 'వ్యక్తి మాదిగ కథ దళిత జీవితాన్ని చిత్రించింది. తెలంగాణలో మొదటి నవల తడకమల కృష్ణారావు రచించిన కంబుకందర చరిత్ర, తెలంగాణ సాహిత్యంలో లోకమలహరి రాసిన 'జగ్గనియిద్దె' నవల దళిత జీవితానికి అద్దం పట్టింది.
మొదటి చారిత్రక నవల ఒద్దిరాజు రామచంద్రరావు రచించిన రుద్రమదేవి. తెలంగాణ విమోచనోద్యమాన్ని చిత్రించిన నవలలు - వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజలమనిషి', 'గంగు', దాశరథి రంగాచార్య నవలలు - జనపదం, మోదుగుపూలు, చిల్లరదేవుళ్ళు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించాయి. విప్లవోద్యమ నేపథ్యంతో తెలంగాణలో చాలా నవలలు వెలువడ్డాయి. అల్లం రాజయ్య రచనలు - కొలిమంటుకున్నది, కొమరంభీం. సుప్రసిద్ధ నవలా రచయిత నవీన్ రచించిన “అంపశయ్య' ద్వారా సుప్రసిద్ధుడై నవల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
సంబంధిత అంశాలు : తెలంగాణ సాహిత్యం - ప్రాచీన సాహిత్య చరిత్ర |
పోరాట గీతాలు
సుద్దాల హన్మంతు, తిరునగరి రామాంజనేయులు, దాశరథి, కాళోజీ, సోమసుందర్, సుంకర సత్యనారాయణ తదితరులు ఎన్నో పోరాట గీతాలు రాశారు. సుద్దాల హన్మంతు 'పల్లెటూరి పిల్లగాడా!' పాటతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 'వెట్టి చాకిరి విధానమో రైతన్నా.. ఎంత జెప్పినా తీరదో కూలన్నా..' అనే గీతంలో ప్రతిఫలం లేకుండా చేసిన వెట్టిని గుండెలవిసి పోయేలా వివరించారు. సుద్దాల, నిజాం నవాబు పై రాసిన గీతాల్లో యాదగిరి రాసి, పాడిన 'నైజాం సర్కరోడా' పాట తెలంగాణ ప్రజల నోళ్లలో ఇప్పటికీ, ఎప్పటికీ నానుతూనే ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్య “ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ జైలు గోడలపై బొగ్గుతోనే పద్యాలు రాశారు. 'సైసై గోపాలరెడ్డి! నీవు, నిలిచావు ప్రాణాలొడ్డి..' అంటూ స్మృతి గీతాలు రాశారు. తిరునగరి, 'మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లల చంపి మనల బంధించిన..' అంటూ ఉద్యమ సందేశాన్నందిచారు కాళోజీ.
ప్రజా కళారూపాలు
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజా కళారూపాలు. తిరునగరి రామాంజనేయులు తన పాటలతో పాటు హరికథలు, బుర్రకథలు అల్లి ప్రజల్లో చైతన్యం నింపారు. సుద్దాల హన్మంతు గొల్లసుద్దులు, పిట్టలదొర వేషం, బుర్రకథ తదితర ప్రక్రియలతో ప్రజలను కదిలించారు. సుంకర-వాసిరెడ్డిల 'మాభూమి' నాటకం చాలా ప్రాచుర్యం పొందింది. సుంకర సత్యనారాయణ 'కష్టజీవి' బుర్రకథను వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు. 'ఆంధ్ర మహాసభ కాఫిర్ల సంఘం.. ' అందులో చేరకూడదు అంటూ ప్రచారం చేసే వారిని దెబ్బతీసేందుకు తిరునగరి 'వీరబందగీ', పోరాటం తీవ్రమవుతున్న దశలో 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలు రాసి ప్రదర్శించారు. చెర్విరాల బాగయ్య 'షోయబుల్లాఖాన్', చౌడవరపు విశ్వనాథం *ఆంధ్రమహాసభ లాంటివి పోరాట కాలంలో ప్రజలను చైతన్య పరిచాయి. ఉద్యమ కాలంలో ప్రజా కళారూపాలకు లభిస్తున్న ఆదరణను సహించలేని నాటి నిజాం ప్రభుత్వం 'కష్టజీవి', 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలను, 'మాభూమి' నాటకాన్ని నిషేధించింది. 'వీర తెలంగాణు' గొల్లసుద్దులను తిరునగరి ప్రదర్శించారు. 'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ సాగే బుడబుక్కల కథ, నందన.. అంటూ పంతులు కంచు పళ్లెం మీద దరువేస్తూ పాడే చెంచుల కళా రూపం, పిట్టలదొర లాంటి కళారూపాలు అణగారిన వర్గాల్లో చైతన్య జ్వాలలు రగిల్చాయి.
పోరాట నవలలు
తెలుగు సాహిత్యం గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. వీటిలో పోరాటం కొనసాగుతుండగా 1947లో బొల్లిముంత శివరామకృష్ణ రాసిన 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ రాసిన 'సింహగర్జన' (1950) వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజల మనిషి'(1955), 'గంగు'(1965) నవలలు వెలువడ్డాయి. వీటిలో *ప్రజల మనిషి' తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రాసిన తొలి నవల. ఇది 1934-40 మధ్య తెలంగాణ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. వట్టికోట ఆళ్వారుస్వామి 1946-53 మధ్య దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు ఈ నవలను రాశారు. ఇది 1955 జనవరిలో వెలువడింది. 1940-45 మధ్య తెలంగాణ పోరాటాన్ని చిత్రించిన గంగు నవల ఆళ్వారు స్వామి అకాలమరణం (1961)తో అసంపూర్తిగా మిగిలిపోయింది. 1965 జనవరిలో అసంపూర్ణ నవలగానే అది ప్రచురితమైంది. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్ రావు రాసిన 'ఓనమాలు' 1956 మార్చిలో వెలువడింది. ఆయన మరో నవల 'మృత్యువు నీడల్లో 1962లో వెలువడింది. వట్టికోటకు కొనసాగింపుగా, తనదైన శైలిలో నవలా రచనకు పూనుకున్నారు దాశరథి రంగాచార్య. 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను చిత్రిస్తూ.. 'చిల్లర దేవుళ్లు (1969) రాశారు. 1942-48 మధ్య కాలం నాటి పరిస్థితులతో 'మోదుగు పూలు (1971), 1948-68 నాటి తెలంగాణ స్థితిగతులతో 'జనపథం'(1976) నవలలు రాశారు. తెలంగాణ పాత్రోచిత భాషతో వచ్చిన చిల్లరదేవుళ్లు నవల ఆనాడు చర్చనీయాంశమైంది. 1971లోనే ఈ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు 'తెలుగుగడ్డ' నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. ఇటీవల కాలంలో వచ్చిన 'సంగం' (తిరునగరి రామాంజనేయులు), 'బందూక్' (కందిమళ్ల ప్రతాపరెడ్డి), 'మలుపు తిరిగిన రథచక్రాలు' (ముదిగంటి సుజాతారెడ్డి), 'కాలరేఖలు' (అంపశయ్య నవీన్) .... తెలంగాలు ఇతివృత్తంతో వచ్చిన నవలలు.
పోరాట కథలు
నిజాం ప్రభుత్వం నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపిన వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలు లోపల' పేరుతో కథలు రాశారు. పొట్లపల్లి రామారావు 'జైలు' కథలు వెలువరించారు. హైదరాబాద్ సంస్థానం రద్దవుతున్న చివరి రోజుల్లో నవాబుల జీవితాలు, హిందూ ముస్లింల సంబంధాలను వివరిస్తూ నెల్లూరి కేశవస్వామి 'చార్మినార్' కథలు రాశారు. తెలంగాణ పోరాటం తర్వాతి కాలం నాటి జనజీవితాలను చిత్రిస్తూ కాంచినేపల్లి చిన వెంకట రామారావు 'మన ఊళ్లో కూడానా?' కథల సంపుటిని వెలువరించారు.
Pages