మానవతావాద కవిత్వం:
నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన దాశరథి 'తిమిరంతో సమరం' సమకాలీన ఉద్యమ చైతన్యాన్ని జీర్ణించుకుని మానవతను వినిపించిన డాక్టర్ సి. నారాయణరెడ్డి 'విశ్వగీతి', 'విశ్వంభర' 'సమదర్శనం', 'మట్టి మనిషీ ఆకాశం' మొదలైనవి ఆయన ముఖ్య రచనలు. 'నా గొడవ' కాళోజీ రచన. ప్రాచీన, ఆధునిక సాహితీ సంప్రదాయాలకు నిలయమైన బాపురెడ్డి పద్య, గేయ, వచన కావ్యాలు, 'తంగేడుపూలు', 'జలగీతం' వంటి రచనలు డాక్టర్ ఎస్.గోపి కవితా ప్రస్థానంలో మానవతా దృక్పథమే అంతః సూత్రంగా కనిపిస్తుంది.
దిగంబర కవిత్వం:
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ సాహిత్యం విస్తృతంగా వెలువడింది. తర్వాతి రోజుల్లో స్తబ్దత ఏర్పడింది. దాన్ని తొలిగించి జాతిలో చైతన్యం రేకెత్తించాలన్న ఉద్దేశంతో దిగంబర కవులు కవితా రంగంలో ప్రవేశించారు. 1966-68 మధ్య కాలంలో మూడు కవితా సంపుటాలను వెలువరించారు. వారు కవితలకు “దిక్'లు అని పేరు పెట్టారు. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (బద్దం భాస్కర్ రెడ్డి), జ్వాలాముఖి (ఏవీ రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్ (యాదవరెడ్డి) తెలంగాణ ప్రాంతీయులు.
సంబంధిత అంశాలు : తెలంగాణ ఆధునిక సాహిత్యం |
విప్లవ కవిత్వం:
నక్సల్ బరి, శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణతో 1970లో విప్లవ రచయిత సంఘం(విరసం) ఆవిర్భవించింది. 1969-70 మధ్య 'తిరగబడు', 'లే', 'మార్చ్', 'విప్లవం వర్ధిల్లాలి' లాంటి కవితా సంపుటాలు వెలువడి విప్లవ కవితా దృక్పథానికి విస్తృతిని చేకూర్చాయి. దిగంబర కవుల్లో కొందరు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాటకు చాలా ప్రాముఖ్యం లభించింది. శివసాగర్ రాసిన నరుడా భాస్కరుడా!, చెల్లీ చంద్రమ్మా!.. గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!' లాంటి పాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి. గద్దర్, వంగపండు ప్రసాదరావు లాంటి వారి పాటలు విస్తృత ప్రాచుర్యం పొందాయి.
మినీ కవిత్వం
వచన కవితలోని అస్పష్టత, సుదీర్ఘతలను పరిహరించే ఉద్దేశంతో ఆధునిక కాలంలో మినీ కవిత ఆవిర్భవించింది. సంక్షిప్తత, కొసమెరుపు మినీ కవితకు ప్రాణం. అలిశెట్టి ప్రభాకర్ కార్టూన్ కవితలు, దేవిప్రియ లాంటి వారి రాజకీయ వ్యాఖ్యాన కవితలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయి. మినీ కవితకు విశేషమైన ప్రాచుర్యం కల్పించినవారు అలిశెట్టి ప్రభాకర్, ఎర్ర పావురాలు', 'మంటల జెండాలు', 'చురకలు', 'సంక్షోభగీతం', 'రక్తలేఖ', 'సిటీలైఫ్' లాంటి మినీ కవితా సంకలనాలు వెలువరించారు. హైకులు, నానీలు కూడా మినీకవిత రూపాలే. హైకూ రూపంలో పెన్నా శివరామకృష్ణ కవితా సంపుటాలు వెలువరించారు. డాక్టర్ ఎస్.గోపి ప్రారంభించిన 'నానీ'లు జీవితానుభూతులను చిత్రిస్తాయి.
సంబంధిత అంశాలు : తెలంగాణ సాహిత్యం - ప్రాచీన సాహిత్య చరిత్ర |
స్త్రీవాద కవిత్వం :
1981లో ప్రచురితమైన రేవతీదేవి 34 కవితల శిలాలోలిత' స్త్రీవాద సంపుటాలకు నాంది పలికింది. స్త్రీల సమస్యలను స్త్రీలే శక్తిమంతంగా ప్రదర్శించగలరన్నది స్త్రీవాదుల అభిప్రాయం. 1990లో త్రిపురనేని 'గురిచూసి పాడేపాట పేరుతో స్త్రీవాద కవితల సంకలనాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి స్త్రీవాద కవిత్వం విస్తృతంగా వెలువడుతోంది. 1998లో అస్మతవారు 'నీలి మేఘాలు' పేరుతో కవితలు సేకరించి ప్రచురించారు. షాజహానా, అనిశెట్టి రజిత, శిలాలోలిత' (పి. లక్ష్మి), జాజుల గౌరి, జూపాక సుభద్ర తదితరులు తెలంగాణ స్త్రీవాద కవయిత్రులు.
దళితవాద కవిత్వం:
90వ దశకంలో వినిపించిన బలమైన గొంతుక దళితవాదం. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో 1993లో 'దళిత గీతాలు', త్రిపురనేని శ్రీనివాస్, జి. లక్ష్మి నరసయ్య సంపాదకత్వంలో 1995లో 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కిన పాట' సంకలనాలు వెలువడ్డాయి. దళిత ఐక్యవేదిక తరపున బీఎస్ రాములు ప్రవహించే పాట - ఆంధ్రప్రదేశ్ దళిత గీతాలు' ప్రచురించారు. 'బహువచనం', 'దండోరా', 'మేమే', 'నిశాని', 'గుండెడప్పు', 'మూలవాసుల పాటలు'.. లాంటి సంకలనాలు ప్రాచుర్యం పొందాయి. జూలూరి గౌరీశంకర్, బన్న ఐలయ్య, కలేకూరి ప్రసాద్ తదితరులు ప్రత్యేక కావ్యాలు వెలువరించారు.
మైనార్టీ కవిత్వం
ఇతర వెనకబడిన వర్గాలవారీ మాదిరిగానే ముస్లింలు కూడా అన్యాయాలకు గురవుతన్నారన్న అభిప్రాయంతో మైనార్టీవాదం, ముస్లింవాదం వెలుగులోకి వచ్చాయి. నల్గొండ ప్రాంతం నుంచి వెలువడిన 'బహువచనం', 'మేమే సంకలనాలు', 'బీసీ కవుల ప్రత్యేక సంచిక' లాంటివి బహుజన కవిత్వానికి ప్రాతినిధ్యం వహించాయి. వర్గీకరణ పేరుతో దళిత వాదులు రెండు వర్గాలుగా చీలిపోవడం మంచి పరిణామం కాదంటూ మాస్టార్టీ లాంటి వారు హెచ్చరిస్తూ పాటలు రాశారు. ముస్లింలలో నెలకొన్న దారిద్ర్యం, అభద్రతా భావం, ఛాందసత్వం వస్తువులుగా చేసుకుని యాకుబ్, స్కైబాబా, దిలావర్, అఫ్సర్, ఖదీర్, ఖాజా, షాజహానా లాంటివారు కవితలు రాశారు. మైనార్టీవాద కవిత్వానికి మచ్చుతునక 'జల్ ఐలా' కవితా సంపుటి.
అస్తిత్వ పోరాట కవిత్వం
తెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించారు. 'పొక్కిలి' (జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో) 'మత్తడి' (సుంకిరెడ్డి సురేంద్రరాజు), 'కరువు' (మల్లేశం లక్ష్మయ్య) 'పరిచయిక'(సిరిసిల్ల సాహితీ సమితి) లాంటి కవితా సంకలనాలు ప్రాంతీయ అస్తిత్వ ధోరణిలో వెలువడ్డాయి. కాశీం “పొలమారిన పాలమూరు', వడ్డేబోయిన శ్రీనివాస్ 'పదావు' లాంటి దీర్ఘ కవితలు తెలంగాణ వాస్తవికతను చిత్రించాయి.
Pages