సోమనకు పూర్వయుగం- (క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 940)
తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆదికవి అయిన పాల్కురికి సోమనాథుడు కేంద్రంగా తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే సులువుగా ఉంటుంది. సోమనకు పూర్వం తెలంగాణలో జరిగిన సాహిత్య కృషిని ముందు పరిశీలించాలి. ఇది తొలిదశ. శాతవాహనుల కాలంలో క్రీ.శ. 2వ శతాబ్ది పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచించిన బృహత్కథ, హాలుడు ప్రాకృతంలో గ్రంథస్థం చేసిన గాథాసప్తశతి అవి తెలుగులో లేకపోయినా తెలంగాణకు తలమానికాలు. జిన వల్లభుడు క్రీ.శ. 940లో వేయించిన కుర్కాల శాసనం తొలి తెలంగాణ పద్యశాసనం. మల్లియ రేచన రచించిన 'కవి జనాశ్రయం' తెలుగులోనే మొదటి లక్షణ గ్రంథం.
సోమన యుగం - (క్రీ.శ. 1100 నుంచి 1300)
పాల్కురికి సోమన ప్రధానంగా శివకవి. దేశీచ్ఛందస్సులో దేశికవిత సృష్టించాడు. జాను తెలుగులో స్థానిక శివభక్తుల కథలు రచించాడు. సోమన రచించిన 'వృషాధిప శతకం' తెలుగులో మొదటి శతకం, తెలుగులో మొదటి వచనం - సింహగిరి వచనాలు. దీనిని రచించింది కృష్ణమాచార్యులు, రంగనాథ రామాయణాన్ని రచించిన గోనబుద్ధారెడ్డి, మార్కండేయ పురాణాన్ని రచించిన మారనలను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.
సంబంధిత అంశాలు : తెలంగాణ ఆధునిక సాహిత్యం - కవిత్వం రూపాలు |
పోతన యుగం-(క్రీశ. 1300-1500)
పోతన యుగంగా చెప్పే ఈ కాలంలో మడికి సింగన (సకల నీతి సమ్మతం), మల్లినాథ సూరి (కాళిదాస కావ్యాలకు వ్యాఖ్యానాలు), గౌరన (హరిశ్చంద్రోపాఖ్యానం) మొదలైన కవులను పరిశీలించవచ్చు. హాలికుడిగా జీవనం గడుపుతూ రాజాశ్రయాన్ని ధిక్కరించి శ్రీమత్ భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన తెలంగాణ గర్వించదగ్గ కవి. ఈ కాలంలో పేరొందిన మరోకవి గౌరన, దేశీ ఛందమైన ద్విపదలో 'హరిశ్చంద్రోపాఖ్యానం', 'నవనాథ చరిత్రలు రచించాడు. మత్స్య పురాణం, నారసింహపురాణం రచించిన కవి హరిభట్టు ఈ కాలానికి చెందిన వాడే. కాళిదాసు రచించిన రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం కావ్యాలకు మల్లినాథ సూరి రచించిన వ్యాఖ్యానాలు సంస్కృత సాహిత్యంలో గొప్ప గుర్తింపును పొంది, కాళీదాసుకు పునర్జీవం పోశాయి. రాచకొండను పరిపాలించిన అనపోతానాయుడు, రెండో సింగభూపాలుడు స్వయంగా కవులు. అనపోతానాయుడి ఆస్థానంలో పశుపతనాగనాథ కవి పేరెన్నికగన్నవాడు.
సంబంధిత అంశాలు : తెలంగాణ ఆధునిక సాహిత్యం |
గోపరాజు యుగం (క్రీశ 1500 - 1600)
గోపరాజు యుగం లేదా కుతుబ్ షాహీల యుగంగా చెప్పే ఈ కాలంలో సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కేంద్రంగా అద్దంకి గంగాధరుడు (తపతీ సంవరణోపాఖ్యానం), పొన్నగంటి తెలగన (యయాతి చరిత్ర), చరిగొండ ధర్మన (చిత్రభారతం)లను పరిశీలించాలి. తెలుగులో తొలి చతురర్థి కావ్యం తెలంగాణ నుంచి వెలువడింది. మరింగంటి సింగరాచార్యులు రచించిన 'నలరాఘవ యాదవ పాండవీయం నాలుగు కథలను ఏకకాలంలో బోధిస్తుంది. ఇంత అద్భుతమైన ప్రక్రియలకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. గొప్ప అవధాని ఎలకూచి బాలసరస్వతి తెలంగాణ వాడే. ఇతడు యాదవరాఘవ పాండవీయం త్ర్యర్తి (ఏకకాలంలో మూడు కథల సారాన్ని తెలిపే) కావ్యాన్ని రచించాడు. ఇదే కాలంలో కందుకూరి రుద్రకవి రచించిన 'సుగ్రీవ విజయం తెలుగులో తొలి యక్షగానం. తెలంగాణ నుంచి వేలాది యక్షగానాలు రచించారు. తెలంగాణ నుంచి వందలాది శతకాలు వెలువడ్డాయి. శతక ప్రక్రియ తెలంగాణలోనే విరాజిల్లి వెలుగొందింది. ధర్మపురిలో వెలసిన శేశప్పకవి రాసిన నారసింహ శతకం, నరసింహదాసు శ్రీకృష్ణ శతకం, కుమ్మరి సిద్దప్ప సిద్దప్ప శతకం ఇప్పటికీ ప్రజల నాలుకలపై ఆడుతున్న సుప్రసిద్ధాలు. తెలంగాణలో పదసంకీర్తన సాహిత్యం పుష్కలంగా వెలువడింది. అంతగా గుర్తింపునకు మాత్రం నోచుకోలేదు. రామదాసు, హనుమద్దాసు, కంకటదాసు, ఈద్దాసు వేలాది కీర్తనలు రచించి ప్రాచుర్యంలోకి తెచ్చారు.
Pages