ఒగ్గుకథ 

ఒగ్గుకథ ఒక కళారూపం, కురుమ కులానికి చెందినవారు దీన్ని ప్రదర్శిస్తారు. 'ఒగ్గు' అంటే త్రినేత్రుడైన శివుడిని ప్రార్థించడం. వీరశైవారాధకుల్లో పురోహితులైనవారు శైవ దీక్ష తీసుకుంటారు. ఒగ్గు దీక్ష తీసుకున్నవారు మల్లన్న, వీరన్న కథలను వల్లె వేస్తారు. కోయతెగకు చెందిన ఒక వంశస్థులు సమ్మక్క కథ చెబుతూ పాటలు పాడతారు. 

బుడగ జంగాలు 

బుడగ జంగాలు శివభక్తులు. ఒక చేతిలో గంట వాయిస్తూ, శివుడి గురించి యక్షగానం చేస్తూ భిక్షాటన చేస్తారు. వినసొంపైన జానపద పాటలు పాడుతారు. ప్రజలకు విభూతిని పంచుతారు. అందువల్ల వీరిని 'జంగమదేవర' అని పిలుస్తారు. వీరు వాయించే గంటపై చిన్న 'నంది' విగ్రహం ఉంటుంది. 

శారదకాండ్రు 

శారదకాండ్రు అనే జానపద కళాకారులు కేవలం తెలంగాణాలోనే కనిపిస్తారు. వీరు ఎక్కువగా వరంగల్ ప్రాంతంలో ఉన్నారు, బుర్రకథ వాయిద్యకారులు, శారద కథకులకు మధ్య పెద్ద వ్యత్యాసమేమీ కనిపించదు. బుర్రకథకుల మాదిరిగానే వీరు కూడా డక్కీలను ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురాను 'శారద' అంటారు. అందువల్ల వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది. 

గంగిరెద్దులాట 

ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కని జానపద కళ. సాధారణంగా పూజగొల్ల కులానికి చెందినవారు గంగిరెద్దులను ఆడిస్తారు. వీరు ఎద్దును చక్కగా అలంకరించి, ఊళ్లలో తిరుగుతూ దాన్ని ఆడిస్తారు. వీరు ప్రధానంగా భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తారు. ఒక గంగిరెద్దుతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వీరిలో ఒకరు గంగిరెద్దును ఆడిస్తే మరో వ్యక్తి డోలు వాయిస్తాడు. మూడో వ్యక్తి సన్నాయి వాయిస్తాడు. ఇది గ్రామస్థులకు మంచి వినోదం. సాధారణంగా వీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా కనిపిస్తారు. 

సాధనాశూరులు 

వీరు ప్రదర్శనలను అందరికీ ప్రదర్శిస్తారు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు.  ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచరిస్తూ ప్రతీ గ్రామంలోని పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనను ప్రారంభిస్తారు. వీరి ప్రదర్శన పగటివేళ జరుగుతుంది. కావున దీనిని పగటి వేషంగా భావించవచ్చు. వీరి ప్రదర్శన ఇంద్రజాలానికి సంబంధించినది. ప్రదర్శన కాలం సుమారు మూడు గంటల వరకు ఉంటుంది. వీరి రంగస్థలం గ్రామ కూడలిలో ఉన్న విశాల స్థలంలో ఉంటుంది. వీరి కళారూపాల సాధనకు ఎంతో నిష్ఠ అవసరమంటారు. వీరి ప్రదర్శనలో ఇద్దరు వ్యక్తులు రెండు పళ్లేలు తీసుకుని ఏదో ఆకు పసరు పూసుకుని దూరంగా నిలబడతారు. వారి చేతులకున్న ఆకు పసరు ప్రభావం వల్ల వారి చేతుల్లోని పళ్లాలు ఒక్కసారిగా పైకెగిరి రెండూ కొట్టుకుని మరలా యథాస్థానానికి చేరుకుంటాయి. ఇలా అనేక అద్భుతాలను ప్రదర్శిస్తారు. 

చోడిగాని కలాపం 

ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో ప్రదర్శించే విచిత్ర వేషాల్లో సోలిగాడివేషం ఒకటి. ఈ సోలిగాడిని చోడిగాడని, పోడిగాడని, సింగడని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. సోలిగాడు వంకరదుడ్డుకర్రతో ప్రవేశించి పిల్లలందరిని పరిగెత్తించేవాడు. వేషధారణ అంతా హాస్యంగా ఉండేది. ముఖం నిండా సున్నపుబొట్లు, బొట్ల మధ్య నల్లచుక్కలు, నల్లగుడ్డ కట్టిన తలకు ఒక పక్కన కాకి ఈకలను కుచ్చి పెట్టి, మొలకు గోచీకట్టి ఒక చేతిలో వంకరదుడ్డుకర్ర, మరొకచేతిలో జోలెవేసుకొని ఏదో ఒక మూల నుంచి హఠాత్తుగా లేచి పిల్లలందర్ని హడలెత్తించేవాడు. తోలుబొమ్మలాటల్లో జుట్టుపోలిగాడు, బంగారక్క ఎటువంటి ప్రాముఖ్యత వహిస్తున్నారో ఈ చోడిగాడు కూడా చోడిగాని కలాపంలో అటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. బొమ్మలాటలోని పాత్రలు కేవలం హాస్యపాత్రలు మాత్రమే. కానీ చోడిగాని పాత్ర అలాగాక కథానాయకుడిగాను, హాస్య పాత్రగాను జీవిస్తున్నాడు.

కొలనుపాక భాగవతులు 

కొలనుపాక భాగవతులనే గంటె భాగవతులుగా పేర్కొంటారు. వీరికి, ఆంధ్ర ప్రాంతంలో ఉండే గంటె భాగవతులకూ వ్యత్యాసం ఉంది. తెలంగాణలో గంటె భాగవతులు ఎక్కువగా కరీంనగర్ జిల్లా కొలనుపాకలో ఉన్నారు. వీరు రాత్రి వేళల్లోనే ప్రదర్శన చేస్తారు. వీరి ప్రదర్శనలకు సాహిత్యపరంగా అంతగా ప్రాముఖ్యం లేదు. వీరు ప్రదర్శనల్లో ప్రధానంగా గరిటెలను ఉపయోగిస్తారు. అందువల్ల వీరిని గరిటె భాగవతులు, గంటె భాగవతులుగా వ్యవహరిస్తారు. ప్రతి పాత్రధారి చేతిలోనూ ఒక గరిటె ఉంటుంది. అందులో చమురు పోసి, వత్తి వేసి వెలిగిస్తారు. ప్రతి పాత్ర హావభావాలూ, ఆంగిక చలనాలు ఈ గరిటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు విశదంగా వెల్లడవుతాయి. ప్రదర్శనలో భాగంగా మధ్య మధ్య నటనను సాగిస్తూ, గరిటెలలోని వత్తిని ఎగదోస్తూ ఉంటారు. గరిట ప్రాముఖ్యంతోనే నాటకాలను ప్రదర్శిస్తారు. 

కప్పతల్లి 

అత్యంత ప్రాచీనమైన జానపద కథ ఇది. నృత్యం, పాట, తప్పెట, లయతో ఈ జానపద కళ ఎంతో రమ్యంగా ఉంటుంది. తప్పెటను ఎదురు రొమ్ముపై పెట్టుకొని వాయిస్తారు. తెలంగాణలో ఈ కళను 'కప్పతల్లి'గా వ్యవహరిస్తారు. 

మాయాజాల కళాకారులు 

వీరిని 'విప్ర వినోదులు'గా పేర్కొంటారు. వీరు గారడి ద్వారా అనేక మాయలను ప్రదర్శించి, యాచిస్తారు. 

మందెచ్చు కళాకారులు 

వీరు యాదవ కులానికి చెందినవారు. ఈ జానపద కళాకారులు 'ఒల్లమాదేవి' కథను పాడుతూ యాచిస్తారు. వీరిలో ప్రధాన కళాకారుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో చిరుతలు పట్టుకొని కథకు సంబంధించిన పాటలు పాడతాడు. మరో ఇద్దరు.. ఒకరు కత్తి, మరొకరు కర్ర పట్టుకొని ఇతడికి వంత పాడతారు. 

రంజు కళాకారులు 

విశ్వ బ్రాహ్మణులపై ఆధారపడి రంజు, పవన, సమయాలు ఇచ్చే ప్రదర్శనలు ఎంతో రమ్యంగా ఉంటాయి. వీరు 'రంజు' అనే వాయిద్యాన్ని వాయిస్తారు. వీర బ్రహ్మేంద్ర స్వామి కథ, విశ్వకర్మ పురాణం చెబుతారు. వీరు శైవ మతాన్ని అనుసరిస్తారు. 

డోలి కళాకారులు 

కోయ జాతికి చెందిన వీరు అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. డోలి కళాకారులు వారి జాతికి చెందిన ఆదిపురుషుల గురించి కథల రూపంలో చెబుతారు. కోయజాతిలో మూడో తరానికి చెందిన 'పేరంబోయరాజు' కథను వల్లె వేస్తారు. బండారు కళాకారులు వీరు పెరిక కులంపై ఆధారపడి ఉంటారు. బండారు కళాకారులు పెరిక జాతి గొప్పతనం గురించి పురాణకథలు చెబుతారు. వీరు ఏ రకమైన వాయిద్యాలను ఉపయోగించరు. ప్రధాన కథకుడు కథ చెబుతూ ఉంటే మరో ఇద్దరు వంత పాడతారు. 

డాథీల ప్రదర్శన 

వీరు లంబాడీ తండాలకు వెళ్లి అక్కడి పెద్దలను కలిసి ప్రదర్శనలు ఇస్తారు. వీరిని 'భట్టు' అనే పేరుతో కూడా పిలుస్తారు. వీరు తమ జాతిలో మూలపురుషుల కథలను పాడుతూ సంచారం చేస్తూ భిక్షాటన చేస్తారు. వీరు ఒక బృందంగా ఏర్పడి పాటలు పాడతారు. ఒక్కో బృందంలో అయిదు నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. 

బుడబుక్కల వాళ్లు 

వీరు తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతికి చెందినవారు. వీరు ఊరూరా తిరుగుతూ ఉంటారు. సాధారణంగా వీరు క్షుద్ర దేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున విచిత్ర వేషధారణతో ఢమరుకం వాయిస్తూ గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతారు. జ్యోతిషం చెబుతూ, తాయత్తులు కడుతూ యాచిస్తారు. 

అసాదులు 

తెలంగాణా ప్రజలకు అనేక గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉంది. వీరు ప్రకృతి దేవతలను కూడా పూజిస్తారు. ఎల్లమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ పేర్లతో దేవతలను పూజిస్తారు. రాష్ట్రంలో అడుగడుగునా ఇలాంటి దేవాలయాలు కనిపిస్తాయి. ఈ దేవాలయాల్లో అన్ని రకాల శూద్ర కులాలకు చెందినవారు అర్చకులుగా ఉంటారు. వీరినే 'అసాదులు' అంటారు. ఈ అసాదులు అమ్మవార్లను 'తాంత్రిక' పద్ధతిలో పూజిస్తారు.  వీరు ప్రధానంగా ఎల్లమ్మ కథను గానం చేస్తూ చిందులు వేస్తారు. 

తోటి కళాకారులు 

గిరిజన, అడవి జాతులకు చెందిన కోయ, గోండు, నాయకపోడు కులాలకు ఆశ్రిత కులం తోటివారు. గిరిజన జాతులన్నీ లక్ష్మీదేవి జాతికి చెందినవి. తోటి కళాకారులు కురువంశానికి చెందినవారిగా, వారికి వారసులుగా భావిస్తారు. వీరు కురువంశ మూలపురుషుల కథలు చెబుతారు.

పెద్దమ్మ కళాకారులు 

వీరు సంచార జాతికి చెందిన మహిళా కళాకారులు, సాధారణంగా ముగ్గురు లేదా నలుగురు కలిసి ప్రదర్శనలు ఇస్తారు. పెద్దమ్మ దేవత విగ్రహాన్ని ఒకరి చేతిలో ఉంచుతారు. మరో కళాకారిణి డోలు వాయిస్తుంది. చేతిలో పెట్టిన విగ్రహాన్ని కళాకారిణి తలపై పెట్టుకొని డోలు శబ్దానికి అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తుంది. వీరు నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన విప్లవ వీరుడు 'పండుగ శాయన్న' గాథను పాడుతూ ప్రదర్శన నిర్వహిస్తారు. 

యానాది భాగవతం 

యానాది కులానికి చెందినవారు చెప్పే భాగవతాన్ని 'యానాది భాగవతం' అంటారు. వీరు చెంచులక్ష్మీ కథను ఎంతో రమ్యంగా చెబుతారు. దీన్నే 'గరుడాచల భాగవతం'గా వ్యవహరిస్తారు. వీరు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ కథను వల్లె వేస్తారు. 

సంబంధిత అంశాలు :  తెలంగాణ సంస్కృతి 

వర్గాన్ కళాకారులు 

ఇది గోండు జాతి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన జానపద కళ. ఆదిమవాసీలైన పర్ణాన్లు 'దేవాల్ పులాక్' పురాణగాథను ఆలపిస్తూ ప్రదర్శనలు ఇస్తారు. వీరు డక్కి తాళాలు అనే వాయిద్యాలను ఉపయోగిస్తారు. జముకులవారు పోచమ్మ, ఎల్లమ్మ, అక్కమ్మ, సారంగధర మొదలైన గ్రామ దేవతల కథలను వీరు ఎంతో మనోరంజకంగా చెబుతారు. వీరు ఉపయోగించే వాయిద్యాల్లో 'జమిడిక' లేదా 'బవనిక' ముఖ్యమైంది. సాతాను వైష్ణవులు వీరు వైష్ణవ భక్తులు. విష్ణువును ఆరాధిస్తారు. విష్ణువు గురించి పాటలు పాడుతూ యాచిస్తారు. 

పిట్టల దొర 

తెలంగాణాలో ఆదరణ ఉన్న మరో ముఖ్యమైన జానపద కళాకారుడు 'పిట్టల దొర'. ఈ వేషాన్నే 'లత్కోర్ సాబ్', 'బుడ్డర్ ఖాన్', 'తుపాకి రాముడు'గా పేర్కొంటారు. ఇది పగటి వేషాల్లో ఒక రకానికి చెందింది. వీరు ప్రధానంగా గ్రామాల్లో ప్రదర్శనలు ఇస్తారు. పిట్టల దొర వేషగాళ్లు సమాజంలోని లోపాలు, కుతంత్రాలను హాస్యాత్మకంగా, వ్యంగ రూపంలో చెబుతారు. ఖాకీ ప్యాంటు లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు, తలపై దొర టోపి, రాళ్లకు బూట్లు ధరిస్తారు. టోపి పై ఒక పక్కన తెల్లటి ఈక, చేతిలో కట్టి తుపాకీ, మెడలో రుమాలు ఉంటుంది. వీరు ముఖానికంతా తెల్ల రంగు పూసుకుని, ఫ్రెంచ్ కట్ మీసంతో దొరలా హంగామా చేస్తూ విరామం లేని వాగోరణితో ప్రజలను అలరిస్తారు.

పగటివేషాలు 

ఒకనాడు మనదేశంలో స్వతంత్ర సామంతరాజుల పరిపాలనలో చిత్రవిచిత్ర వేషాలు వ్యాప్తిలోకి వచ్చాయని తెలుస్తుంది. గూఢచారులుగా మారువేషాలు ధరించి వర్తమానాలు చేరవేసే చారులుగాను, రత్నాలు, పచ్చలు అమ్మేవ్యాపారులుగాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులుగాను చిత్ర, విచిత్రమైన మారువేషాలతో కోటల్లో చొరబడి ఒక రాజు మరొక రాజును వంచించటం, కోటలోని రహస్యాల్ని, బలహీనతల్ని తెలుసుకొని యుద్ధం ప్రకటించడం జరుగుతుండేది. ప్రజావినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు రాత్రివేళ మాత్రమే ప్రదర్శింపబడేవి. అలాకాకుండా పగటి పూట ప్రదర్శించడంతో వీటికి పగటివేషాలు అని పేరు వచ్చింది. పగటివేషాల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే వారు కేవలం తమ వేషధారణతోగాక వారి పాత్రల ద్వారా సంఘంలో ఉండే మూఢనమ్మకాలను, దురాచారాలను వ్యంగ్యంగా, హాస్య ధోరణిలో ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పర్చేవారు. ఈనాటి కంటే ఆనాడు గ్రామాల్లో కరణాలు, మునసబులు, వర్తకులు, ఉద్యోగులు మొదలైనవారంతా ఏ విధంగా మోసం చేస్తుండేవారో ఈ వేషాల ద్వారా తగిన సాహిత్యంలో ఎవరికీ బాధ కలుగకుండా వారి గుట్టును బట్టబయలు చేసేవారు. ఈ పగటివేషాలను ఒకప్పుడు బహురూపాలుగా పిలిచేవారు. పగటి వేషాల్లో పంతులు వేషం, పఠానువేషం, రెడ్డి వేషం, తాగుబోతు వేషం, కోమటి వేషం, గారడివేషం, ఫకీరు మొదలైన వేషాలను ప్రదర్శించేవారు. ఫకీరువేషంలో ఫకీరు పాత్రధారి ఖురాన్ చదువుతూ పాడిపంటల సల్లగుండాలి అల్లాకేనామ్ అంటూ ఆయా పాత్రలకు అనుగుణమైన భాషను ఉపయోగించేవాడు. పగటివేషాల్లో ప్రసిద్ధిపొందినవి భైరాగుల వేషాలు, బుడబుక్కల వేషం, ఫకీరు వేషం, తహశీల్దారు, భోగంవేషం, పాములవాడు, ఎరుకలవేషం, దొమ్మరవేషం, కోయవేషం, పడుచు పెళ్లాం, ముసలిమొగుడు, గయ్యాలి పెళ్ళాం, పిట్టలదొర, గొల్లభామ, రెడ్డివేషం, భట్రాజువేషం, సింగిసింగడు మొదలైనవి. 

సంబంధిత అంశాలు : తెలంగాణ జాతరలు 

రుంజలు 

విశ్వబ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిపై ఆధారపడిన తెగ రుంజలవారు. వీరి ముఖ్య వాయిద్యం రుంజ అవడం వల్లవీరిన రుంజలు అని వాడుకలోకి వచ్చింది. వీరు గ్రామ గ్రామం తిరుగుతూ విశ్వబ్రాహ్మణులను యాచిస్తారు. విశ్వబ్రాహ్మణులు వీరిని ఎంతో ఆదరిస్తారు. వీరు విశ్వకర్మ పురాణాన్ని గానం చేస్తూ పారితోషికాన్ని పొందుతారు. రుంజ వాయిద్యం దాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క జట్లలో దాదాపు పదిమంది వరకు ఉంటారు. అందరూ రుంజ వాయిద్యాన్ని వాయిస్తారు.

బుట్ట బొమ్మలు 

పేడతో చేయబడిన ఈ బుట్టబొమ్మలు పెళ్లి ఊరేగింపుల్లోనూ, జాతర సందర్భాల్లో ప్రదర్శిస్తుంటారు. ఈ బొమ్మల్ని పురుషులు ఆడిస్తారు. పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ కాళ్లభాగంలో, నోటి దగ్గర రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి నృత్యం చేస్తే కేవలం బొమ్మే నాట్యం చేసినట్లు ఉంటుంది. ఈ బొమ్మల్లో ఒకటి స్త్రీ బొమ్మగాను, మరొకటి పురుషుడి బొమ్మ ఉంటుంది. కొన్ని బొమ్మలు సింగిసింగడుగా ఉంటాయి. ప్రజలను ఆనందపర్చే కళారూపాల్లో ఇది ఒకటి. ఇది ఇప్పుడు పూర్తిగా కనుమరుగై పోయింది. 

వీరముష్టివారు 

వీరశైవ వాజ్ఞయానికి సంబంధించిన గేయాలను భక్తుల గాథలను, కన్యకపరామేశ్వరీ కథలను చెబుతుంటారు. వీరు ఎక్కువగా జంగాలను యాచిస్తారు. వీరముష్టులు పాడేపాటల్లో ఎక్కువ భాగం కన్యకకు సంబంధించినవి. అందువల్ల వీరిని కోమట్లు ఎక్కువగా ఆదరిస్తారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు వీరముష్టులను ఉదాహరించినట్లు బిరుదురాజు రామరాజు గారు జానపదగేయ సాహిత్యంలో తెలిపాడు. వీరభద్రుడు దక్షుడిని ధ్వంసం చేయునప్పుడు అతడి చెమట నుంచి వీరముష్టులు జన్మించారని ఒక కథ ఉంది. వీరు వీరభద్ర ఖడ్గాలను కూడా చెబుతుంటారు. వీరు వీరశైవుల వలె కత్తులను కుచ్చుకుని నాట్యం చేస్తారు. 

గారడి విద్యలు 

దీనిని ఇంద్రజాలమని గారడివాళ్లను ఇంద్రజాలికులని వ్యవహరిస్తారు. ఈ గారడి విద్య పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ప్రచారంలో ఉంది. పూర్వం రాజుల ఆస్థానాలలో విరివిగా ఈ విద్యను ప్రదర్శించి సన్మానాలను పొందేవారు. ఈ నాటికీ గ్రామాల్లో ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు. వేపాకులను దూసి తేళ్లను తెప్పించడం, అరచేతిలో రూపాయలను సృష్టించడం, అప్పటికప్పుడు మామిడిటెంకను పాతి మొక్కను మొలిపించడం, మనిషిని బుట్టలో పెట్టి మాయం చేయడం, గొంతును కోసి రక్తం చూపించడం మన వద్దనున్న వస్తువును మాయం చేసి మరొకరి జేబులో నుంచి తెప్పించడం మొదలైన అనేక ప్రదర్శనలు చేస్తారు. ఈ విద్య పూర్వం నుంచే ప్రచారంలో ఉందనడానికి అనేక గ్రంథాల నుంచి పలు ఉదాహరణలు కనిపిస్తాయి. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర దొమ్మరసానులు గడలపై ఆడినట్లే, గారడీవారు మోకులపై ఆడినట్లు అని ప్రస్తావించారు. పొడవైన మోకును ఆకాశంలోకి విసరగానే అది వెదురులాగా నిలుస్తుంది. తరువాత గారడీవాడు తాడుమీద నిచ్చెన ఎక్కినట్లు జరజరా కుకుంటూ పోయినట్లు పోయి మాయమై తిరిగి కనిపించి అక్కడే చిత్రవిచిత్రమైన విద్యలను ప్రదర్శించేవాడు.

పులి నృత్యం 

తెలుగు ప్రాంతాల్లో ప్రతి పల్లెలో ఈ పులి నృత్యం ప్రదర్శిస్తారు. ముఖ్యంగా దసరా పండుగలో, పీర్ల పండుగ సందర్భంలో, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ పులి వేషాన్ని ధరిస్తారు. పులి వేషం జంతు నృత్యాలకు అనుకరణ. ఈ కళారూపాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చినవారు పల్లె ప్రజలే. ఈ పులి వేషగాళ్లు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి యాచిస్తుంటారు. పిల్లలు భయపడేంత సహజంగా పులి వేషం వేస్తారు. పులి వేషం వచ్చిందంటే పల్లెల్లో పిల్లలకు, పెద్దలకు ఒక పండుగలా అనిపిస్తుంది. పులి వేషధారణ చాలా కష్టమైంది. మామూలు వేషాల్లాగా ఏదో ముఖానికి ఇంత రంగు పూసి తుడిచేయడం వంటిదికాదు. శరీరంలో అన్ని భాగాలను రంగులతో ముంచివేస్తారు. శరీరమంతటా అక్కడక్కడా నల్లటి చారలను చిత్రించడంతో పెద్దపులి ఆకారం వస్తుంది. నెత్తికి మాత్రం తోలుతో కుట్టిన టోపీని తగిలిస్తారు. వేషం పూర్తయిన తరువాత బజారులోకి వెళ్లి మధ్యమధ్యలో ఎగురుతూ, పల్టీలు కొడుతూ ఉంటారు. తొడ చరిచి పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. 

బాలసంతులవారు

వీరు తెల్లవారుజామున ఐదు గంటలకే శైవసంబంధమైన పాటలను పాడుతూ గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ జే గంటను మోగిస్తూ పాటలు పాడుతుంటారు. పాట పాడిన అనంతరం శంభాన్ని గట్టిగా ఊది ఆ ఇంటివారిని నిద్ర నుంచి మేల్కొలిపి, మరొక ఇంటికెళ్లి అదేవిధంగా చేస్తారు. ఇలా ప్రతి రోజూ కొన్ని ఇండ్లను తిరుగుతూ గ్రామంలోని ఇండ్లన్నీ తిరగడం పూర్తయిన తరువాత ఒక రోజును ప్రత్యేకంగా యాచించడానికి కేటాయిస్తారు. ఒక గ్రామం పూర్తయిన తరువాత మరొక గ్రామానికి వెళ్తారు.  

గంటె భాగవతులు 

వీరి ప్రదర్శన రాత్రిపూట జరుగుతుంది. వీరు ప్రదర్శించడానికి గంటెలను ఉపయోగిస్తారు. వీరి ప్రదర్శనలో వచ్చే పాత్రధారి చేతిలో ఒక గంటె ఉంటుంది. అందులో చమురుపోసి, ఒత్తివేసి వెలిగిస్తారు. ప్రతీ పాత్ర హావభావాలు, ఆంగిక చలనాలు ఈ గంటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు స్పష్టంగా కనబడతాయి, మధ్య మధ్య నటనను కొనసాగిస్తూ గంటెలలో ఒత్తి ఎగదోస్తూ ఉంటారు. ఈ ఒత్తుల వెలుతురు వల్ల ముఖంలో ప్రతిబింబించే అభినయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో గంట ఉంటుంది. కాబట్టి గంటె ప్రాముఖ్యతతో భాగవతాలను ప్రదర్శించడంతో వీరికి గంటె భాగవతులని పేరు వచ్చింది.

చెక్కభజన 

పల్లెల్లో తీరిక సమయాల్లో ఈ భజన చేస్తుంటారు. దేవుని ప్రమిదను పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ భజన చేస్తారు. సుమారు 20 మంది సభ్యులు ఇందులో ఉంటారు. ఈ భజనలో పాట పాడుతూ చేతితో చెక్కల ద్వారా తాళం వేస్తూ గజ్జెలు కట్టిన కాళ్లతో నృత్యం చేస్తుంటే చూడటానికి ఎంతో ఇంపుగా ఉండి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రకమైన నృత్యం ఉంటుంది. 

పిచ్చకుంట్ల కథలు 

తెలుగు ప్రాంతాల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్న కళారూపాల్లో పిచ్చకుంట్ల కథలు ఒకటి. ఈ కళారూపాన్ని పిచ్చకుంటులవాళ్లనే జాతివారు ప్రదర్శిస్తుంటారు. ఈ కథా బృందంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వీరు చెప్పే కథల్లో ప్రధానమైనది శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర. ఈ కథను ప్రారంభిస్తే మధ్యలో వదలకుండా పదిహేను రాత్రులు చెబుతారు. పిచ్చకుంట్ల కథల్లో శృంగార, కరుణ, వీర రసాలకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా వీరి వేషధారణలో కథకుడికి ఒక తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలు, కాళ్లకు గజ్జెలు ఉంటాయి. ఈయన పాడుతుంటే మిగతా ఇద్దరు ఆ.. అంటూ దీర్ఘం తీస్తూ కథకుడి గొంతుతో గొంతు కలుపుతారు. 

దొమ్మరాటలు 

గ్రామాల్లో ఇతర వినోద కార్యక్రమాలతోపాటు దొమ్మరాట కూడా ప్రాచీన కాలం నుంచి ప్రదర్శిస్తున్నారు. దీనికి సర్కసు అను పేరు కూడా ఉంది. దొమ్మరివారు గ్రామాల్లో నాలుగు వీధులు కలిసిన చోట ఒక పొడవైన వెదురుగడను పాతి డోలు వాయిద్యాన్ని వాయిస్తూ గ్రామ ప్రజలను ఆకర్షించేవారు. చిత్రవిచిత్రమైన వినోదాలతో సర్కసు పనులను చేస్తూ తమ నైపుణ్యంతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూ వారి వద్ద నుంచి డబ్బును, ధాన్యాన్ని వస్త్రాలను వసూలు చేసుకునేవారు. ఈ దొమ్మరాటలు 13వ శతాబ్దం కాలం నాటికే ఉన్నట్లు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణ ద్వారా తెలుస్తోంది. దొమ్మరసానులు వెదురుగడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్నంత భ్రమను కలిగించారని పాల్కురికి పండితారాధ్య చరిత్రలో వివరించాడు. గడను ఎదురొమ్ము మీద, నుదుటి మీద నిలబెట్టి ఆ గదల పై దొమ్మరసానులతో తమ విద్యలను ప్రదర్శించేవారు. 

జంతరుపెట్టె 

జంతరు పెట్టె ద్వారా వివిధ రకాల బొమ్మలను చూపిస్తూ పిల్లలను ఆకర్శిస్తూ ఉంటారు.  జంతరు వాడు ఆ పెట్టెలో చేయి పెట్టి బొమ్మలన్నీ ఒకదాని తరువాత ఒకటి, ఒకరి తరువాత మరొకరికి చూపిస్తూ “కాశీపట్నం చూడర బాబు, విశ్వనాథున్నే చూడర బాబు, చూసి మోక్షం పొందర బాబు" అంటూ పాట పాడుతూ దానికనుగుణంగా తాళం వాయిస్తూ ఆనందింపజేస్తాడు. ఈ కళారూపం ద్వారా సమాజంలో ఉన్న స్వార్థపరులను, తిండి దొంగలను, లంచగొండులను బయట పెడుతూ దేశభక్తి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.