సమ్మక్క-సారక్క జాతర
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ఆసియాలోనే అతి పెద్ద జాతర సమ్మక్క-సారక్క ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సమ్మక్క-సారక్క జాతర జరిగే ప్రదేశం మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కలదు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్రవారాల్లో ఈ జాతర సాగుతుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్కను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజు చిలుకలగుట్టలో ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్టిస్తారు. మూడోరోజు గద్దెలపై అమ్మవార్లు ఇద్దరినీ కొలువు చేస్తారు. నాలుగో రోజు ఆవాహనం పలికి సాయంత్రం అమ్మవారిద్దరిని తిరిగి యుద్ధరంగానికి తరలిస్తారు.
ఏడుపాయల జాతర
మెదక్ జిల్లా నాగసానపల్లి గ్రామంలో అమ్మ దుర్గాభవాని దేవాలయం ఉంది. ఈ దేవాలయం మంజీరా నది ఏడుపాయలు వేరుపడే చోట ఉంది. మంజీరా ఉపనదులైన ఏడు నదులు సంగమం చెందుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఏడుపాయల జాతరను ఇక్కడ మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ ఏడుపాయల వద్ద జరిగే జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొంటారు. దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతంతో కూడి పచ్చని చెట్లు, గుట్టలు, రాళ్ళతో ఆవరించి ఇక్కడ మంజీరానది ఏడుపాయలుగా విడిపోయి మధ్యలో గుహలో స్వయంభూ మాతగా వెలసింది. ఈ దేవాలయం మంజీరా నది ఏడుపాయలు వేరుపడే చోట ఉంది. కావున ఈ జాతరను ఏడుపాయల జాతరగా పేర్కొంటారు. ఈ జాతరలో పాల్గొన్న భక్తులు గుడిలో ఒక రోజు రాత్రి నిద్ర చేసి తమ సొంత గ్రామాలకు వెళ్లడం ఆచారంగా వస్తోంది. సామాజిక కట్టుబాట్లలో భాగంగా 18 వర్గాలుగా విభజించబడి ఉన్న గ్రామీణ జీవన వ్యవస్థలోని 18 వర్గాల ప్రతినిధులు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం వద్ద తప్ప మరెక్కడా కనిపించదు.
సంబంధిత అంశాలు : తెలంగాణ సంస్కృతి |
గొల్లగట్టు జాతర
తెలంగాణలో సమ్మక్క-సారక్క తర్వాత అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర. ఈ జాతర జరిగే ప్రదేశం సూర్యాపేట జిల్లాలోని దురాజపల్లి, రెండు సంవత్సరాలకోసారి నాలుగు రోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు. యాదవుల కులైదవం పరమశివుడి అవతారమైన లింగమంతుల స్వామిని కొలుస్తారు. లింగమంతుల స్వామి తోబుట్టువు చౌడమ్మ తల్లి. ఈ జాతరలో సూర్యాపేటకు సమీపంలోని కేసారం గ్రామానికి 30 విగ్రహాలున్న పెట్టెను తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఆ తర్వాత లింగమంతులస్వామి తోబుట్టువు అయిన చౌడమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఈ జాతరలో పసిడి కుండను గోపురంపై భాసింపేట యాదవ కులస్థులు అలంకరిస్తారు. స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు సూర్యాపేట యాదవ కులస్థులు. నాలుగో రోజు (చివరి రోజు) పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర ముగుస్తుంది.
నాగోబా జాతర
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామ సమీపాన ఉన్న కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరుగుతుంది. నాగోబా గిరిజనుల ఆరాధ్య దైవం. ఏటా పుష్య మాసంలో అమావాస్య రోజున ఈ జాతర జరుపుకుంటారు. పూర్వం గోండుల కుటుంబంలో నాగోబా సర్పరూపాన జన్మించి, అద్భుతమైన శక్తియుక్తులు ప్రదర్శించి, మహిమలను చూపుతూ కేస్లాయి గ్రామాన ఉన్న పుట్టలో దూరిందని చెబుతారు.
నల్లగొండ జాతర
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ సమీపాన ఏటా మాఘ పౌర్ణమి రోజు ఈ జాతర జరుగుతుంది. శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించి, ఉగ్రరూపాన తిరుగుతూ ఈ కొండపై పాదం పెట్టగా నల్లటి కొండగా మారిందని ఆ కొండ మీద విశ్రాంతి తీసుకున్నాడని స్థల పురాణం.
కొమురవెల్లి జాతర
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఏటా మాఘమాసం నుంచి ఉగాది (చైత్ర మాసం) వరకు మల్లన్న దేవునికి ఈ జాతర జరుగుతుంది.
వేలాల జాతర
మంచిర్యాల జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాలలో మహాశివరాత్రికి ఈ జాతర జరుగుతుంది. సామూహిక పూజలు, భజనలతో శంకరుని పూజించి భక్తులు తరిస్తారు.
కొండగట్టు జాతర
జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట సమీపంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ జాతర నిర్వహిస్తారు. హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపు ఆంజనేయుని ముఖంతో రెండు ముఖాలతో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శంఖ, చక్రాలను కలిగి ఉండి హృదయంలో సీతారాములను కలిగి ఉండడం విశేషం. ఈ గుడిలో, 40 రోజులపాటు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. క్షేత్రపాలకుడైన భేతాలస్వామి ఆలయం కొండ పైన ఉంది.
Pages