తెలంగాణ కేంద్రంగా వివిధ రాజవంశాల పరిపాలన సాగిన ప్రాంతమంతటిలోనూ తెలంగాణ సంస్కృతి కనిపిస్తుంది. దక్కన్ పీఠభూమి పరిసర ప్రాంతాలతో కూడుకున్నది తెలంగాణ సంస్కృతి. .తెలంగాణ సాంస్కృతిక రూపాలు మిగిలిన ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. 1956 తర్వాతనే ఇతర ప్రాంతాల సంస్కృతి తెలంగాణ మీదికొచ్చింది. మహారాష్ట్ర ప్రాంతంలోని చీరకట్టు, పదాలు, భాషాపరమైన సారూష్యత తెలంగాణలో కనిపిస్తుంటాయి. అలాగే కన్నడ ప్రాంతానికి, తమిళనాడుకి వలస వెళ్లిన జానపద కళాకారుల్లో చాలామంది తెలంగాణవారే. వారి దగ్గర రాగిపత్రాలుంటాయి. కేవలం లలిత కళలు మాత్రమే సంస్కృతి కాదు. ఆహారపు అలవాట్లు చూస్తే తెలంగాణ సంస్కృతి తెలుస్తుంది. తెలంగాణలో కొన్ని పదార్థాలు ప్రత్యేకంగా వండుతారు. తెలంగాణ భౌగోళిక, నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లుంటాయి. జొన్నలు తదితర చిరుధాన్యాల వాడకం ఎక్కువ. బతుకమ్మ పండగలో ఎక్కువగా ఉండేవి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలే. చిరుధాన్యాలను గౌరవించడం, పూజించడం, వాటిని గుర్తించడం కూడా ఎక్కువ. ఆయా పండగల్లో, సందర్భాల్లో వీటినే వాడతారు. భౌగోళిక అవసరాలకు, శీతోష్ణస్థితి, వాతావరణానికి అవసరమైన రీతిలో ఇక్కడి అలంకరణ, వేషధారణ రూపొందాయి. తెలంగాణ లోనే వస్త్రధారణలో ముఖ్యమైన గోచీకట్టు సంస్కృతి నుంచే నృత్యం, శ్రమ, శ్రమవిధానం ఉంటాయి. ఈ వస్త్రధారణ  ఆదివాసీ సంస్కృతి అయిన  గోండుల్లోనూ ఉంది. ముస్లింల పాలన కాలంలో రాజ్యంలో కూడా ఇదే విధంగా వస్త్రధారణ ఉండేది.  ఇక్కడి వాతావరణంలో పనిచేసేప్పుడు ఎండ నుంచి తట్టుకోవడానికి తలపాగా తప్పనిసరి. వెండి వాడకం తెలంగాణలో ఎక్కువ. 

విశిష్ట సంస్కృతి మహా రాజవంశాలు, మహానగర సంస్కృతి ఇక్కడ వెల్లివిరిసాయి. బౌద్ధానంతర కాలంలో కొండాపూర్, పెదబంకూరుల్లోనూ మహానగర సంస్కృతి కనిపిస్తుంది. అక్కడ టంకశాలలున్నాయి. ఏ బౌద్ధ క్షేత్రానికి వెళ్లి చూసినా అందమైన గాజులు ఇప్పటికీ కనిపిస్తాయి. శాతవాహనులకు పూర్వం కూడా ఆంధ్ర రాష్ట్రాలున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో ప్రధానమైంది కోటిలింగాల. ఇక్కడ నాణేలు, కట్టడాలు ప్రత్యేకం. నాణేల తయారీ కేంద్రం ఉంది. వ్యవసాయ క్షేత్రాలున్నాయి. కేంద్రీకృతమైన రాజ్యవ్యవస్థ మూలరూపాలున్నాయి. శాతవాహనుల కాలంలో కూడా బౌద్ధ క్షేత్రాలకు ఇది ప్రసిద్ధి. బౌద్ధానికి కోటిలింగాల వద్ద ఉన్న దహేగాంలో బౌద్ధ స్తూపంలాంటి నిర్మాణం ఉంది. జైనం కూడా ఇక్కడి నుంచి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఉత్తర, దక్షిణ భారత భూభాగాలకు ప్రవేశద్వారం (గేట్వే) దక్కన్ పీఠభూమి. సంస్కృతి, రాజ్యం, వ్యాపారం తరలి రావడానికి ఇదే ప్రవేశద్వారం. అన్ని సంస్కృతుల సమ్మేళనం ఇక్కడ జరిగింది కాబట్టి తెలంగాణ భాషలో అత్యధిక భాషలు కనిపిస్తాయి. ప్రాకృతం, అరబిక్, పర్షియన్, ఉర్దూ (ఇక్కడ పుట్టిందే) సంస్కృతం కనిపిస్తాయి. ఇన్ని భాషల సమాహారం తెలంగాణ తెలుగు. ఇన్ని సంస్కృతులను తట్టుకొని నిలబడగలగడం తెలంగాణ ప్రజల గొప్పతనం.