హర్షుని కాలంలో భారతోత్తర భాగము విద్యా వైదుష్యములకు ఆలవాలమై ఉండెను. హర్షుడు స్వయంగా కవి. నాగానందము, రత్నావళి, ప్రియదర్శిక అను నాటకములు ఇతని రచనలు. బాణుడు హర్షుడి ఆస్థాన కవిగా ఉండేవాడు. హర్షచరిత్రలో హర్షుడిని గూర్చి బాణుడు అత్యంత మనోహరంగా వర్ణించాడు. కాదంబరి అనే కవ్యాం కూడా బాణుడు అమూల్యమైన రచన. హర్షుడు రచించిన నాగానందం నాటకం అహింసకు సంబంధించినది. ఇందులో విద్యాధర జీమూత వాహనుని గాథ ఉన్నది. ఇది హర్షుడు రచించిన చివరి గ్రంథము. బాణుడు బావమరిది మయూరుడు సూర్యశతకమును రచించి సూర్యారాధకుడైన హర్షుడి మన్ననలను పొందాడు. మయూరుడు ఆర్యముక్తమాల, మయూరాష్టకము రచించాడు. వాక్యపదీయకారుడిగా ప్రసిద్ధి చెందిన భర్తృహరి హర్షుని కాలంవాడే. క్రీ.శ. 671-695 వరకు భారతదేశంను సందర్శించిన చైనా యాత్రికుడు ఇత్సింగ్ తను భారతదేశానికి రాక ముందే క్రీ.శ. 631లోనే భర్తృహరి మరణించాడని తెలిపాడు. హర్షుడు తన 57వ యేట అనగా క్రీ.శ. 648లో మరణించాడు. 

హర్షుని కాలంలోని ప్రముఖ కవులు 

భవభూతి 

క్రీ.శ. 7వ శతాబ్దంలో గొప్పకవి. ఇతడు విదర్భ దేశంలోని పద్మపురంలో జన్మించాడు. యశోవర్మ మహారాజు ఆస్థానంలో ఉండేవాడు. కాశ్మీర ప్రభువైన లలితాదిత్యుడు యశోవర్మను యుద్ధంలో ఓండించి భవభూతిని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. మాలతీ మాధవం, మహావీర చరిత్రము, ఉత్తర రామ చరిత్ర నాటకము ఇతని రచనలు. మాలతీ మాధవం ఇతని స్వీయకల్పితము. 

భట్టి నారాయణుడు 

ఇతడు విద్వత్కవి. వేణీ సంహరమును రచించాడు. ఇతడు చక్కని కవితలను రచించడమే కాకుండా సంభాషణలను భావయుతంగా రూపొందించాడు.

విశాఖదత్తుడు 
ఇతడు క్రీ.శ. 7వ శతాబ్దం వాడు. ఇతని తండ్రి పృథు దత్తుడు. ఇతడు గొప్ప నాటక రచయిత మహా పండితుడు కూడా. ఇతడు చంద్రగుప్త నగరము లేదా చంద్ర పట్టణ వాసి. ఈ పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని చన్ రాయి పట్టణముగా భావిస్తున్నారు. ముద్రా రాక్షస నాటకం ఇతనిని సామంత రాజు అని తెలుపుతున్నది. దేవీ చంద్రగుప్త, ముద్రారాక్షస నాటకాలు ఇతని రచనలు.
శ్రీహర్షుడు 
క్రీ.శ. 7వ శతాబ్దికి చెందిన వాడు. శ్రీహర్షుడు భట్ట శ్రీహర్షునిగా ప్రసిద్ది. కాశ్మీరదేశ వాసి అయిన శ్రీహరుడు ఇతని తండ్రి. ఇతడు ప్రతిభావ్యుత్పత్తులున్న మహాకవి. నైషధ కావ్యమును ఇతడు రమ్యంగా రచించాడు. నైషధము, నల దమయంతుల చరిత్రను అతి మనోహరంగా తెలుపు గ్రంథము. ఇతని కావ్యము విద్వదౌషధమని ప్రసిద్ధి పొందింది.
వాక్పతిరాజు 
కన్యాకుబ్జ రాజు అయిన యశోధరుని ఆస్థాన కవి ఇతడు. రాఘవ పాండవీయము అను ధ్యర్థికావ్యము ఇతని రచన. సంస్కృత భాషలో రెండర్థములనిచ్చే కావ్యంగా ఈ గ్రంథమును రచించెను. గౌడమహాప్రాకృత కావ్యమును సైతం ఇతను రచించెను.
బాణుడు 
ఇతడు భట్టభాణుడిగా ప్రసిద్ది. కాదంబరి, హర్ష చరిత్రలను రచించాడు. హర్షచరిత్రలో హర్షవర్ధనుడి వంశ చరిత్రను అతి రమ్యంగా వర్ణించాడు. హర్ష చరిత్ర చారిత్రక గ్రంధము. 
మయూరుడు 
ఇతను బాణుడి బావమరిది. గొప్పకవి. మయూరాష్టకము, ఆర్యముక్తమాల, సూర్యశతకం మొదలైన గ్రంధాలు రచించాడు. 
హుయాన్‌త్సాంగ్ 
ఇతడు చైనా దేశానికి చెందిన బౌద్ధ మతాచార్యునిగా కీర్తి వహించాడు. ఇతడు సి.యూ.కి.అనే ప్రసిద్ధ గ్రంధాన్ని రచించాడు. హర్షుని రాజధాని నగరమైన కన్యాకుబ్దంలో హుయాన్‌త్సాంగ్ నివసించాడు. మధుర, ద్వారక, కురుక్షేత్రలను కూడా ఇతడు దర్శించాడు. రెండవ పులకేశి రాజుగా ఉన్నప్పుడు బాదామీ చాళుక్య రాజ్యాన్ని కూడా ఇతడు దర్శించాడు. హుయాన్‌త్సాంగ్ దర్శించినపుడు బౌద్ధమతము అవంతీ నగరంలో క్షీణదశలో ఉండినది. హుయాన్‌త్సాంగ్ గయ క్షేత్రమును దర్శించి అక్కడ గల బోధివృక్ష వృత్తాంతమును బౌద్ధభిక్షుల ద్వారి విన్నాడు. బోధి వృక్షమును శశాంకుడనే గౌడరాజు నరికించి, కాల్పించగా దానిని పూర్ణవర్మాభిదానుడను రాజు ఉద్ధరించాడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్న శీల భద్రాచార్యుడు హ్యుయాన్‌త్సాంగ్ ను ఆహ్వానించి, గౌరవ మర్యాదలు చేశాడు. హ్యుయాన్‌త్సాంగ్ నలందా విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాలు నివసించి, వ్యాకరణము, పాణినీయము, బౌద్ధ త్రిపీటకాలు, యోగశాస్త్రము శీలభద్రాచార్యుని వద్ద అభ్యసించాడు. కామరూప రాజ్యాన్ని దర్శించగా అక్కడి రాజగు భాస్కరవర్మ హ్యుయాన్‌త్సాంగ్ ను ఆదరించాడు. కృష్ణానది దక్షిణ తటమందున్న అమరావతిని కూడా దర్శించాడు.