పుష్యభూతి వంశము 

గుప్తరాజ్య పతనానంతరం స్థానేశ్వరంను రాజధానిగా భారతదేశంను పాలించిన రాజ వంశములలో పుష్యభూతి వంశము చెప్పుకోదగినది.

పుష్యభూతి ఉత్తర హిందూదేశమున చిన్న రాజ్య పాలకునిగా ఉండి, స్వశక్తిచే గొప్ప రాజ్యమున స్థాపించాడు. బాణభట్టుని కాదంబరి కావ్యంలో పుష్యభూతిని ప్రశంసించాడు. పుష్యభూతి తరువాత అతని వంశీయులలో ప్రభాకర వర్ధనుడి వరకు గల వారి చరిత్రలు, కాదంబరి కావ్యంలో పెద్దగా చర్చించలేదు. హర్ష చరిత్రలో కూడా ఈ రాజవంశీయులను గూర్చి పెద్దగా తెలపలేదు. స్థానేశ్వర రాజ్యస్థాపకుడైన పుష్యభూతి మహావీరునిగాను, విజేతగాను సమర్ధుడుగాను పాలకుడుగాను కీర్తి చెందాడు. పుష్యభూతి వంశీయులు సూర్యారాధకులు. వీరి ఇలవేల్పు ప్రభాకరుడు.

నరవర్ధనుడు 

ఇతడు స్థానేశ్వర రాజ్య పీఠాన్ని అధిరోహించిన తరువాత సామంతుల తిరుగుబాటును అణిచాడు. ఇతని పరిపాలనా విషయాలు పెద్దగా తెలియలేదు. 

మొదటి రాజ్యవర్ధనుడు 

నరవర్ధనుడి కొడుకు మొదటి రాజ్యవర్ధనుడు. తండ్రి తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఇతడు యువరాజుగా రాజ్య వ్యవహారాలు పర్యవేక్షించాడు. రాజ్యవర్ధనుడు స్థానేశ్వర రాజ్యమును పాలించడంతో బాటూ, గుప్తరాజులతో కూడా సంబంధ బాంధవ్యాలు పెంచుకొన్నాడు. 

ఆదిత్యవర్ధనుడు 

రాజ్యవర్ధనుడి అనంతరం ఆదిత్య వర్ధనుడు రాజ్యాన్నేలాడు. ఇతడు కడు సమర్ధుడు. ఇతని రాణి మహాసేన గుప్త వంశానికి చెందిన వనిత. ఇతడు తన తాత తండ్రులు ఆర్జించిన రాజ్యాన్ని ప్రశాంతంగా పాలించాడు. 

ప్రభాకర వర్ధనుడు 

ఆదిత్యవర్ధనుడి కుమారుడైన ప్రభాకర వర్ధనుడు ప్రతాపశీల ప్రభాకర వర్ధనుడిగా ప్రఖ్యాతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలదు. వారిలో పెద్దవాడు రాజ్యవర్ధనుడు, చిన్నవాడు హర్షవర్ధనుడు. కుమార్తె రాజ్యశ్రీ. ప్రభాకర వర్ధనుడు హూణ, సింధు, ఘార్జర, గాంధార, లాట, మాళవ దేశములపై దండెత్తి విజయాలు సాధించాడు. ఇతనికి హూణ హరికేసరి అనే బిరుదుండేది. ప్రభాకర వర్ధనుడు తన కుమార్తె రాజ్యశ్రీని మౌఖరి వంశ ప్రభువైన అవంతీవర్మ కుమారుడు గృహవర్మకిచ్చి వివాహం చేశాడు. ప్రభాకర వర్ధనుడు యువరాజుగా రాజ్య వర్ధనుడిని నియమించాడు. రాజ్యవర్ధనుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం స్థానేశ్వర సైన్యమునకు నాయకత్వం వహించి క్రీ.శ. 604లో హూణులపై దండయాత్ర జరిపాడు. హర్షవర్ధనుడు తన అన్న వెంట దండయాత్రలో పాల్గొన్నాడు. అప్పటికి హర్షుడి వయస్సు 15 సం|| మాత్రమే. 

రెండవ రాజ్యవర్ధనుడు 

రాజ్యవర్ధనుడు క్రీ.శ.605లో స్థానేశ్వర రాజ్య పీఠం అలంకరించాడు. ఇతనికి పరమ భట్టారక, మహారాజాధిరాజ బిరుదులు గలవు. మాళవరాజు రాజ్యవర్ధనుడి బావ అయిన గృహవర్మపై దండెత్తి అతనిని వధించి చెల్లెలు రాజ్యశ్రీని చెరసాలలో బంధించాడు. ఈ విషయం తెలిసిన రాజ్యవర్ధనుడు మాళవ రాజు పై దండెత్తి యుద్ధంలో అతన్ని ఓడించాడు. కానీ మాళవ రాజు మిత్రుడు కనక సువర్ణాధిపతి, గౌడరాజు శశాంకుడు రాజ్యవర్ధనుడితో స్నేహ ప్రస్తావన తెచ్చి మోసంతో అతన్ని వధించాడు. రాజ్య వర్ధనుడి మరణానంతరం స్థానేశ్వర రాజ్యం అల్లకల్లోలమైనది. సామంతులు, మాండలికులు తిరుగుబాటు చేసి స్వతంత్రులైనారు. 

హర్షవర్ధనుడు 

రాజ్య వర్ధనుడి హత్యానంతరం స్థానేశ్వరంలో సింహనాధుడు అనే సేనాని అనుచరులతో సంప్రదించి, హర్షవర్ధనుడిని రాజుగా ప్రకటించాడు. హర్షుడు మొదట సింహాసనాన్ని అధిష్టించుడకు ఇష్టపడక పోయినప్పటికీ బలవంతంగా రాజ్యపాలనా బాధ్యతలు స్వీకరించాలని మంత్రులు, సామంతులు ఒత్తిడి చేయగా విధిలేని పరిస్థితిలో అతడు రాజ్య పాలనా భారాన్ని తీసుకోవడం జరిగింది. హర్షుడు బౌద్ధ మతావలంబి. బౌద్ధాచార్యుల ప్రోద్బలంతో రాజ్యభారం వహించినా కూడా రాజ శబ్దమును ఉపయోగించకనే రాజ్యమును పాలించాడు. హ్యుయాన్‌త్సాంగ్ పరిచయము వలన, అతని బోధనల వలన హర్షుడు బౌద్ధమతమందు ఉత్సాహం కలిగి మత వ్యాప్తికి పాటుపడినాడు.

అందువలననే అతడు తాను రాజుగా సింహాసనం అధిష్టించడానికి ఇష్టపడలేదు. హర్షుడు క్రీ.శ. 606-607లో స్థానేశ్వర రాజ్య సింహాసనమధిష్టించాడు. ఆ నాటి నుండి హర్ష శకం ప్రారంభమైనది. హర్షుడు రాజైన తరువాత గొప్ప సైన్యమును సమకూర్చుకొని తన బావ గృహవర్మ మరణానికి, తన సోదరి రాజ్యశ్రీ కష్టముల పాలవడానికి కారణభూతుడైన శశాంకుని సంహరింపదలిచాడు. కన్యాకుబ్జమును జయించి, రాజ్యశ్రీని రక్షించి శశాంకుని రాజ్యముపై దండెత్తాడు. రాజ్యశ్రీని రక్షించుటకు కర్ణసువర్ణదేశ ప్రగ్జామందున్న కామరూప ప్రభువు స్నేహాన్ని సంపాదించి అతని సహాయ సహకారాలతో శశాంకుడిని హర్షుడు జయించాడు. రాజ్యశ్రీ గుప్తరాజు నరేంద్రగుప్తుని వలన భయపడి చెరసాల నుండి తప్పించుకొని వింధ్య పర్వతారణ్యములకు వెళ్ళినదని హర్షుడికి అతని స్నేహితుడు భండి తెలియజేశాడు. శశాంకుడి పై దండెత్తాల్సిందిగా హర్షుడు భండిని ఆజ్ఞాపించి, తాను సోదరిని వెదుకుటకు వింధశ్య పర్వతారణ్యమునకు బయల్దేరాడు. అక్కడ అతడికి ఆటవిక నాయకుల సహాయంతో అగ్ని ప్రవేశానికి సిద్ధపడిన సోదరి రాజ్యశ్రీ కనిపింగా ఆమె ప్రాణాలను కాపాడి తిరిగి స్థానేశ్వరానికి తీసుకుని వచ్చాడు. కొంత కాలం స్థానేశ్వరంలో సకల భోగాలను అనుభవించిన పిదప రాజ్యశ్రీ బౌద్ధ సన్యాసినిగా మారింది. భండి శశాంకునిపై దండెత్తి యుద్ధంలో ఓడించి అతడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి, దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఈ శిక్ష అమలుకు పూర్వమే శశాంకుడు పారిపోయాడు.హర్షుని రాజ్యంలో ఉత్తర భారతమంతా చేరింది. కన్యాకుబ్జ నగరం హర్ష సామ్రాజ్యంలో విలీనమైనది. మాళవం కూడా హర్షుని ఆధీనంలో ఉండినది. నేపాల దేశాధీశుడైన అంశువర్మ హర్ష శకము 34లో ఒక శాసనమును ప్రకటించాడు. ఖాట్మండు నగరానికి 6 కి.మీ. దూరంలో ఈ శాసనం వేయింపబడింది. "శబ్దవిద్య” అనే గ్రంధాన్ని అంశువర్మ రచించాడని హ్యుయా తాంగ్ తెలిపాడు. అంశువర్మ నేపాల రాజ్య సింహాసనం అధిష్టించక ముందు, విక్రమాదిత్యుడా రాజ్యమును జయించి తన పేర విక్రమ శకం నెలకొల్పినట్లు నేపాల రాజవంశ చరిత్ర తెలుపుతున్నది. హర్షుడికి కూడా విక్రమాదిత్య అనే బిరుదు కలదు.

హర్ష చరిత్ర వలన హర్షుడు హిమాలయ పర్వత ప్రాంతము వరకు దండయాత్ర నిర్వహించినట్లు తెలుస్తున్నది. హర్షుడు తన రాజధానిని స్థానేశ్వరం నుండి గంగా నదీ తీరంలో ఉన్న కన్యాకుబ్జ నగరానికి మార్చాడు. హూణుల దాడులను ఎదుర్కొనడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్రీ.శ. 6వ శతాబ్దాంతము నాటికే ప్రసిద్ధిగాంచిన కన్యాకుబ్జ నగరాన్ని హర్షుడు జయించి రాజధానిగా చేసుకొని అభివృద్ధి పరిచాడు. హీనయాన బౌద్ధ మతానికి సంబంధించిన రెండు సంఘారామాలు ఈ నగరంలో ఉండేవి. బుద్ధుడు ఇక్కడ తన శిష్యులకు ఉపదేశం చేశాడు. హుయాన్‌త్సాంగ్ కన్యాకుబ్జ నగరంలో వందల కొద్ది సంఘారామాలున్నట్లు తెలిపాడు.

రెండు వందల హిందూ దేవాలయాలీ నగరంలో ఉండేవి. - హర్షుడు దక్షిణాపథంలో బలవంతుడైన చక్రవర్తిగా కీర్తించబడుతున్న చాళుక్య వంశ చక్రవర్తి రెండవ పులకేశిపై దండెత్తి యుద్ధంలో ఓటమి పాలై సంధి చేసుకున్నాడు. నర్మదానది ఇరు రాజ్యములకు సరిహద్దుగా నిర్ణయించుకొనెను. రెండవ పులకేశి హర్షుడిని ఉత్తర భారత ప్రభువుగాను, హర్షుడు పులకేశిని దక్షిణాపథపతిగాను గుర్తించినారు. ధృవసేనుడు హర్ష సామ్రాజ్య రక్షణ భారము వహించి ఉండెను. పులకేశితో సంభవించిన యుద్ధానంతరం హర్షుడు రాజ్య విస్తీర్ణ కాంక్షను వీడి, శాంతి కాముకుడయ్యెను. హర్ష సామ్రాజ్యమున కన్యాకుబ్జము, స్థానేశ్వరము, శ్రావస్తి ప్రయాగ నగరాలుండేవి. హర్షుని రాజ్యంలో మగధ, ఉత్కళ చేరి ఉండెనని క్రీ.శ.641 నాటి హ్యుయాత్సాంగ్ వ్రాతల వలన తెలుస్తున్నది. జలంధర్ పాలకుడు ఉదితుడు, మాళవ పాలకుడు మాధవగుప్తుడు హర్షుని సామంతులుగా ఉండేవారు. హర్షుని రాజ్యమునకు వల్లభీ రాజ్యము, గంజాం దక్షిణ సరిహద్దులుగా ఉండేవి. హర్షుడు తన స్నేహితుడగు భాస్కరవర్మను కామరూప రాజుగా చేసినట్లు హర్ష చరిత్ర వలన తెలుస్తున్నది. నర్మదా నదీ తీరంలో రెండవ పులకేశితో జరిగిన యుద్ధానంతరం హర్షుడు మళ్ళీ తన జీవితలో యుద్ధం అనే మాటను తలపెట్టక, ప్రజా శ్రేయస్సుకు, బౌద్ధమత ప్రచారానికి తన జీవితంను అంకితం చేశాడు.

 RELATED TOPICS 

హర్షుని పరిపాలన

హర్షుని కాలంలో విద్యా, వైదుష్యములు