హర్షుడు రాజ్యపాలనాభారం వహించే నాటికి 15, 16 సంవత్సరాల వయస్సు వాడిగా ఉండెను. హర్షుడు వర్షాకాలంలో తప్ప మిగతా కాలంలో సామ్రాజ్యమందు సంచరించి ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని, వారి సమస్యలను పరిష్కరించేవాడు. హర్షుడు ప్రయాణమై బయల్దేరునపుడు మృదంగ వాద్యములు మ్రోగింపబడేవి. సంగీతం ఆలకించబడేది. హర్షునికి లలితకళలనిన మక్కువ. రాజు 10 మంది అమాత్యులతో మంత్రిమండలినేర్పరేవాడు. రాష్ట్రములను పాలించుటకు రాష్ట్ర పాలకులు రాజుచేత నియమించబడేవారు. హర్షుని కాలంలో స్థానేశ్వర రాజ్య గజ సైన్యాధ్యక్షుడు స్కందగుప్తుడు. 

హర్షుని రాజ్యంలో వివిధ అధికారులు : 

1) మహాసంధి విగ్రహాధికారి - సంధి సమర కార్యనిర్వహణలో ప్రతిభావంతుడు 

2) మహాబలాధికృత - సర్వ సైన్యాధ్యక్షునిగా వ్యవహరించుచుండెవాడు 

3) మహాక్షపాతిలకుడు - రాజ పత్రములను, ఇతరములైన పరిపాలనా సంబంధమైన పత్రాలను భద్రపరిచేవాడు రాజశాసనాలను రాష్ట్రాధిపతులకు, ప్రభుత్వాధికారులకు అందజేయుచు, వారి నుండి వచ్చిన సమాచారమును భద్రపరిచి, అమాత్యులకు, రాజుకు విన్నవించేవాడు. 

4) ప్రతీహారులు, రక్షకులు, ద్వారపాలకులు - వీరు రాజును దర్శించుటకు వచ్చే వారిని రాజ సమక్షంలోకి తీసుకుని వెళ్ళేవారు. నగరంలో ద్రాంఘికుడు అనే ప్రధానాధికారి ఒకడు ఉండేవాడు. ప్రభుత్వాధికారులలో కొందరు మహత్తరులనబడే వారు కూడా ఉండేవారు. 

రైతుల నుండి పంటలో 1/6 వంతు పన్ను రూపంలో వసూలు చేసేవారు. హర్షుని కాలంలో పన్నులు ఎక్కువగా ఉండేవి కావు.

న్యాయవ్యవస్థ 

హర్షుని కాలంలో సామ్రాజ్యంలో కఠిన శిక్షలు అమల్లో ఉండేవి. నేరస్థులను, బందీలను సామాన్య మనుషుల వలే చూసేవారు కాదు. నిజనిర్ధారణకు విష త్రాగించడం, జలనిమజ్జనం చేయడం, అగ్ని ప్రవేశం, భారవాహం మొదలైన శిక్షలుండేవి. నిర్దోషి ఎటువంటి పరీక్షల్లో నైనా గెలవగలడని ఆ నాడు ప్రజల విశ్వాసం. 

సైనికశక్తి 

హర్షుని సైన్యంలో 5000 గజ దళము, 20000 అశ్విక దళము, 50వేల కాల్బలముండేదని హ్యుయాన్‌త్సాంగ్ వ్రాతల ద్వారా తెలుస్తున్నది. చైనా చక్రవర్తితో స్నేహ సంబంధాలు పెంపొందించుకొని, అతని కోరిక మేరకు బ్రాహ్మణుని ఒకనిని రాయబారిగా హర్షుడు పంపాడు. క్రీ.శ. 643లో తన రాయబారిని పంపించి చైనా రాజు రెండు దేశాల మధ్య మైత్రి నెలకొల్పాడు. హర్షుడు బౌద్ధమతానురక్తుడైనా కూడా, శివుడిని, సూర్యుడిని ఆరాధించాడు.

ప్రజాహిత కార్యములు, మతము 

హర్షచక్రవర్తి రాజమార్గములందు దీనులకు, బాటసారులకు, సాధువులకు అన్న సత్రములు నిర్మించాడు. పల్లెల్లో, పట్టణాల్లో ధర్మ శాలలు నిర్మించి అందులో ఉచిత అన్న సౌకర్యాలు కల్పించాడు. అనేక ప్రదేశాల్లో వైద్య శాలలు నిర్మించి, అందులో ఉచిత చికిత్సలు పొందుటకు సౌకర్యములు కల్పించాడు. గంగానదీ తీర ప్రాంతంలో అనేక స్తూపములను, ఆరామ విహారాలను, చైత్యాలయాలను నిర్మించెను. హర్షుడు నిర్మించిన బౌద్ధ విహారాలలో సుమారు రెండు లక్షల మంది బౌద్ధ భిక్షువులుండేవారని హ్యుయాన్‌త్సాంగ్ తెలిపాడు. గౌడదేశాధీశుడైన శశాంకుడు పరమ శివభక్తుడు. ఇతడు పరమతద్వేషి. బౌద్ధమతం భారతదేశంలో లేకుండా చేయాలనే సంకల్పంతో ఉండేవాడు. బుద్ధగయలోని బోధి వృక్షమును ఇతడే నరికించి కాల్చివేయించాడు. పాటలీపుత్ర నగరం వద్ద గల బుద్ధపాద శిల్పమునున విధ్వంసం చేయించాడు. హర్షుడు పండిత సభలను, న్యాయ సభలను నిర్వహిస్తూ కవి సమ్మేళనాలను ఏర్పాటు చేసేవాడు. హర్షుడు కన్యాకుబ్జంలో సమస్త బౌద్ధ సన్యాసులను, ఆచార్యులను, భిక్షుగణాలను, సామంత మాండలిక రాజులను, స్నేహితులను, బంధువులను ఆహ్వానించి ఒక సభను నిర్వహించాడు. ఈ సమావేశంలోనే మహాయాన బౌద్ధ మత సిద్ధాంతాలు రూపొందించబడినవి.

హర్షుడు ప్రయాగలో ఒక అపురూపమైన యజ్ఞమును నిర్వహించాడు. ప్రయాగ గంగా, యమున, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమ ప్రాంతంలో ఈ యజ్ఞమును నిర్వహించాడు. ఈ ఉత్సవాల్లో హుయాన్‌త్సాంగ్ కూడా పాల్గొన్నాడు. హర్షుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి యాగము నిర్వహించి యాగంలో తన సర్వస్వాన్ని దానమిచ్చే వాడు. అందుకే దీనికి సర్వస్వదాన మహాయాగమని పేరు. ఇటువంటి యాగములను హర్షుడు 5 సార్లు నిర్వహించాడు. 


 RELATED TOPICS 

పుష్యభూతి వంశము

హర్షుని కాలంలో విద్యా, వైదుష్యములు