కుషాణ వంశీయులు ప్రఖ్యాతమైన యుహిచీ తెగలో ఒక శాఖకు చెందినవారు. భారతదేశంలో మొట్టమొదట కుషాణ రాజ్యము విస్తరించిన వాడు వేమ(విమ) లేక రెండవ కడఫిసెస్ అని చైనా దేశపు రచనల వలన తెలుస్తున్నది. సింధూ నదీ పరీవాహక ప్రాంతమగు పంజాబ్ ప్రాంతమే భారతవనిలో కుషాణులు జయించిన భూభాగమని చరిత్రకారుల అభిప్రాయము.

కనిష్కుడు 

కుషాణు వంశీయులలో కనిష్కుడు అత్యంత సమర్ధుడు. ప్రతిభావంతుడు కూడా. విశాల సామ్రాజ్య నిర్మాత. రెండవ కడఫిసెస్ తరువాత కనిష్కుడు రాజ్యాధికారం చేపట్టినాడని చరిత్రకారులు భావించారు. కనిష్కుని తొలి పాలనా కాలపు శాసనాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లభించటం వలన, భారతోత్తర ప్రాగ్భాగములను ఇతను పాలించినట్లు ఊహించడానికి అవకాశం కలదు. చైనా, టిబెట్ గ్రంథకర్తలు కనిష్కుడు సోకెడ్ లేక సాకేత, పాటలీపుత్రలపై విజయవంతంగా దండయాత్రలు చేసినట్లు తెలుపుతున్నవి. బీహార్ రాష్ట్రం పై కూడా ఇతను దంయాత్రలు జరిపాడు. వంగ, ఉత్కళ, ఓడ్ర దేశాలలో కనిష్కునికి సంబంధించిన నాణెములు లభించాయి. కాశ్మీరు దేశంలో కనిష్క చక్రవర్తి పాలన ఉన్నట్లు కల్హణుని రాజతరంగిణి గ్రంధం ద్వారా తెలుస్తున్నది. కనిష్కుని రాజధాని పురుషపురము లేదా పెషావర్. గాంధార దేశం కూడా అతని ఆధీనంలో ఉండేది. కనిష్కుని ఆస్థానమునకు వచ్చిన ఒక చైనా రాజకుమారుడిని అతడు బంధించినట్లు హ్యుయాత్సాంగ్ రచనల ద్వారా తెలుస్తున్నది. కనిష్క చక్రవర్తికి చైనా దేశంతోనూ మధ్య ఆసియాతోనూ సంబంధము ఉన్నట్లు హ్యూయాన్‌త్సాంగ్ గ్రంథం తెలుపుతున్నది. కనిష్కుడు క్రీ.శ. 78లో రాజ్య సింహాసనం అధిష్టించి తన పేర ఒక శకమును ఏర్పాటు చేశాడు. కనిష్కుని రాజ్యారంభము క్రీ.శ. 78 కాబట్టి అది శక సంవత్సరారంభం అవుతున్నది. 

కనిష్కుడు క్రీ.శ. 78 నుండి 101 వరకు పాలించాడు. శాసనాల ఆధారంగా, నాణెముల ఆధారంగా, పలు గ్రంధ రచనల ఆధారంగా కనిష్కుడు బౌద్ధ మతానుయాయి అని తెలుస్తున్నది. బౌద్ధమత చరిత్రలో కనిష్కుడు ప్రముఖ స్థానం ఆక్రమించాడు. భారతదేశంలో ప్రకటించబడిన శాసనాల ఆధారంగా కనిష్కుని రాజధాని పెషావర్ ఒక బౌద్ధమత విజ్ఞాన కేంద్రంగానూ, పుణ్యక్షేత్రం గానూ, విద్యా వైదుష్యములకు ఆలవాలమైన ప్రదేశంగా ఉండేదని తెలుస్తున్నది. పెషావర్ లో కనిష్కుడు దివ్యమైన సంఘారామాన్ని నిర్మించినట్లు హ్యుయాన్‌త్సాంగ్, అల్బెరూని తమ గ్రంథాలలో పేర్కొన్నారు. బౌద్ధ గ్రంథాలను అనుసరించి కాశ్మీరము, గాంధారము లేక జలంధర్ లందు మహాయాన బౌద్ధ మత సమావేశమును పార్శ్వ లేక పార్శవికుని సలహాను అనుసరించి, కనిష్క చక్రవర్తి ఏర్పరిచినట్లు తెలుస్తున్నది. 

కుంతల వనంలో కనిష్కుని కాలంలో జరిగిన బౌద్ధ సమావేశాలకు వసుమిత్రుడు అధ్యక్షత వహించాడు. పాటలీపుత్రం నుండి కనిష్కుని ఆహ్వానము మన్నించి అశ్వఘోషుడు హాజరై, సమావేశానికి ఉపాధ్యక్షత వహించాడు. కనిష్కునికి బౌద్ధ మత సిద్ధాంతాలను బోధించిన బౌద్ధ మత గురువు సంఘ రక్షకుడు. మహాయాన బౌద్ధమత స్థాపకుడైన ఆచార్య నాగార్జునుడు కనిష్కుని ఆస్థానమందుండెను. చరక సంహితను రచించిన చరకుడు కూడా కనిష్కుని ఆస్థానంలోని వాడే. ఇతడు వైద్య శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశాడు. అపర చాణుక్యుడని పేరుగాంచిన మాఠరుడు కనిష్క చక్రవర్తి అమాత్యునిగా ఉండేవాడు. బుద్ధ చరిత రచించిన అశ్వఘోషుడు కూడా కనిష్కుని ఆస్థానంలోని వాడే. కనిష్కుడు ముద్రించిన నాణెముల వెనుకవైపు బుద్ధుడు, వాయుదేవుడు, అగ్ని, చంద్రుడు, మియురో, సూర్యుడు మొదలైన దేవతలకు సంబంధించిన గ్రీకు చిహ్నాలు గలవు. గ్రీకుల యుద్ధ దేవుడు ఓ గ్నో కనిష్కుని నాణెములపై ముద్రించాడు. కుషాణు రాజుల నాణెములపై ఖరోష్టి లిపి కనిపించదు. ఈ వంశీయులు ముద్రించిన నాణెములపై భ్రష్టమైన గ్రీకు, పర్షియా భాషలున్నవి. హువిష్క జుష్క, దజ్ హిష్క అను ముగ్గురు తురుష్క తెగకు చెందిన రాజుల పరిపాలన గురించి కల్హణుని రాజతరంగిణి తెలుపు తున్నది.

హువిష్క-హవిష్క నామధేయుడు. ఇతడు తన పేర హుష్కపురమును నిర్మించెను. నేడిది ఉష్కూర్ అనబడు చున్నది. జుష్క జుష్కపుర నిర్మాత. ఈ పురము నేడు కాశ్మీర్ లోని జుకుర్ పట్టణముగా భావింపబడింది. కనిష్కుడు కనిష్కపురంను నిర్మించాడు. నేడు ఇది కని పూర్ గా వ్యవహరింపబడుచున్నది. కాశ్మీర్ నండు గల జయస్వామి పున నిర్మాత జుష్క. కుషాణ వంశం వారు తురుష్క లేక టర్కీ దేశ సంతతికి చెందిన వారని కాశ్మీర్ కైఫియతులో పేర్కొనబడినది. మొదటి కనిష్కుని అనంతరం హవిష్కుడు కుషాణు రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతని 24, 28 రాజ్య సంవత్సరాలలో అనగా క్రీ.శ. 102, 106 సంవత్సరాలలో వేయించిన శాసనములు ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోను, భోపాల్ ప్రాంతంలో లభించాయి. ఆరా శాసనము రెండవ కనిష్కుని తండ్రి వయిష్కునిగా, కాశ్మీర దేశపు కైఫియతులో జుష్టపుర స్థాపకుడు జుష్టగా పేర్కొనబడిన వాడితడే. కాబుల్ కు చేరువలోనున్న వర్ధక్ శాసనమును అనుసరించి ఆఫ్ఘనిస్థాన్ పై హవిష్కుని అధికారము వర్ధిల్లుతుండేది. హవిష్కుడు బౌద్ధమత పోషకుడు. మధురలో లభించిన ఒక శాసనములో మహారాజాధిరాజ హవిష్క విహార ప్రస్తావన కలదు. బ్రాహ్మీలిపిని పఠించుచున్న గణపతి, బాణధారి శివుడు హవిష్కుని కొన్ని నాణెములపై చిత్రింపబడినారు. ఒక సీలుపై విష్ణు భక్తుడైన చక్రవర్తి చిత్రమున్నది.

రోమన్ చక్రవర్తులకు ఉండిన సీజర్ బిరుదు వంటి కైసర్ బిరుదును రెండవ కనిష్కుడు ధరించాడు. కనిష్కుడు, హవిష్కుడు ముద్రించిన నాణెములపై గల వివిధ మత చిహ్నములలో కొన్ని వాసుదేవుడు ముద్రించిన నాణెములపై కనిపస్తున్నవి. వాసుదేవుడు ప్రకటించిన అనేక నాణెములపై నందితో కూడిన శివుని చిత్రములున్నవి. వాసుదేవుడు క్రీ.శ.145-176 వరకు కుషాణ రాజ్యమేలెను. అతని తరువాత భారతదేశంలో జరిగిన అంతః కలహాల వలన కుషాణుల రాజ్యము క్షీణించింది. సస్సనియా చక్రవర్తి రెండవ హారమణ్ పాలన క్రీ.శ.301-310 వరకు సాగింది. ఇతడు కుషాణు రాజ కుమార్తెను వివాహమాడినాడు. ఇతని నాణెములలో కొన్నింటి పైన 'కుషాణ్ మల్ల, కుషాణ్ మల్కాన్ మల్కా' అని లిఖించి ఉన్నది. 

చివరి కుషాణ రాజుల నాణెములపై నంది, శివుడు ముద్రించబడినవి. బలిపీఠము కూడా ముద్రించబడింది. కుషాణుల కాలంలో మతము, శిల్పము, సాహిత్యము అభివృద్ధి చెందినవి. మహాయాన బౌద్ధహతము, గాంధార శిల్పకళలు అభివృద్ధి చెందినవి. బుద్ధుని విగ్రహములు అసంఖ్యాకంగా నిర్మింపబడి ప్రతిష్ఠింపబడినవి. కవి పండిత పోషకునిగా, బౌద్ధమత సమావేశములందు సభాపతిగా రాజశేఖరునిగా కావ్య మీమాంస గ్రంథమున వర్ణింపబడిన వాడు కుషాణ వంశ చక్రవర్తి వాసుదేవుడని తెలుస్తున్నది. కుషాణుల పాలనలో బౌద్ధమతమునకు స్వర్ణయుగము వంటిది. మౌర్య వంశ రాజుల తరువాత ఉత్తరాపథమున గొప్ప సామ్రాజ్యము నిర్మించి ప్రజానురంజకంగా పాలించి చిరకీర్తినార్జించిన కుషాణ వంశపు రాజులు, అందులో ముఖ్యంగా కనిష్క చక్రవర్తి అజారమరుడు.


 RELATED TOPICS 

మౌర్యానంతర యుగం - కాణ్వ వంశము  

మౌర్యానంతర యుగం - శుంగ వంశము