మౌర్య రాజ్య పతనానంతరం శుంగ వంశీయులు మగధ సామ్రాజ్యమును 112 సంవత్సరాలు పాలించారు. వీరి పాలన క్రీ.పూ. 185లో ప్రారంభమై క్రీ.పూ. 73లో అంతమైనది. పురాణాలు, బాణుడి హర్షచరిత్ర, పతంజలి మహాభాష్యము, మేరుతుంగుని థేరవలి, కాళిదాసుని మాళవికాగ్నిమిత్ర నాటకం మొదలైన రచనల వలన శుంగ వంశ రాజుల గూర్చి తెలుస్తున్నది. ధనదేవుని అయోధ్య శాసనము, టిబెట్ దేశపు చరిత్రకారుడు తారానాధుని రచనలు, దివ్యావదానము మొదలైన రచనల వలన కూడా శుంగవంశ రాజుల గూర్చి తెలుసుకొనవచ్చును. శుంగవంశ రాజులు బ్రాహ్మణులు. భారద్వాజ గోత్రోద్భవులు. మౌర్యవంశీయుల కుల బ్రాహ్మణులగా ఉన్న శుంగ వంశం వారు వైదిక మతవ్యాప్తికి అధికార, పదవులను ఆశించారు. కాలక్రమంలో ఆయుధాలు ధరించి, అమాత్య పదవులను అధిష్టించి రాజకీయాల్లో తలదూర్చే స్థితికి చేరారు. మగధ సార్య భౌములచేత ఆదరింపబడుతున్న బౌద్ధ, జైన మతాలు శుంగ వంశజులను వైదిక మతోద్ధరణకు పూనుకునేలా చేశాయి. శుంగ వంశీయులలో ప్రసిద్ధుడు పుష్యమిత్రుడు. వైదిక మతాన్ని అవలంభించి ఆ మతం వ్యాప్తి చేయాలని సంకల్పించాడు. తన పూర్వీకులు ఆచరిస్తున్న పౌరోహిత్యమునకు, రాజ గురువు పదవికి స్వస్తి పలికి, తన మేధాసంపత్తితో మౌర్య చక్రవర్తి బృహద్రథుని మంత్రిగా నియమితుడైనాడు. 

పుష్యమిత్రుడు 

మగధ చక్రవర్తి రాజ్యంలో పరిపాలనా వ్యవహారాలు చక్కబరచలేక, విదేశ దండయాత్రలనెదర్కొన లేక, ప్రజాక్షేమం పట్టించుకొనక రాజ్యం కోల్పోయే స్థితిలో ఉన్న సమయంలో బృహద్రథుని వధించి పుష్యమిత్రుడు క్రీ.పూ. 184-185లో మగధ రాజ్యాధికారం చేపట్టి, శుంగ వంశమును స్థాపించాడు. పుష్యమిత్రుడు మగధ రాజ్యాన్ని 36 సంవత్సరాలు వైభవోపేతంగా పాలించాడు. వైదిక మతాన్ని అభిమానించే పాటలీపుత్ర ప్రజలు, సైనికాధికారులు, ప్రభుత్వాధికారులు పుష్యమిత్రుడు సింహాసనం అధింష్టించడంలో సహాయ పడినారు. కాళిదసు మహా కవి రచించిన మాళవికాగ్నిమిత్ర నాటకము వలన విదిశరాజ్య రాజప్రతినిధి అయిన అగ్నిమిత్రుని విజయం తెలుస్తున్నది. మగధాధిపతి అయిన పుష్యమిత్రుడు విదర్భ రాజ్యమును నూతనంగా జయించి ఉండెను. మగధ సామ్రాజ్యాంతర్గతమైన కొన్ని భాగములను చేర్చి విదర్భ రాజ్యమును అతడు క్రొత్తగా నిర్మించాడు. పుష్యమిత్రుడు మగధను పాలించే సమయంలో కళింగ దేశమును ఛేది వంశీయుడు, మహిషకుల వర్ధనుడు, మహా మేఘ వాహన బిరుదాంచితుడు అయిన ఖారవేలుడు పాలించేవాడు. ఖార వేలుడు క్రీ.పూ. 165లో మగధపై దండయాత్ర చేయ సంకల్పించాడు. ఖారవేలుని దండయాత్రకు అతని మతాభిమానము ఒక కారణం కూడా. ఖారవేలుడు జైనుడు. పుష్యమిత్రుడు వైదిక మతానుయాయి. ఖారవేలుడు పాటలీపుత్రంపై దండయాత్ర జరిపి, నగరాన్ని కొల్లగొట్టి దుర్గ ప్రవేశం చేసే సమయంలోనే పుష్యమిత్రుడు సంధి చేసుకొని అనేక ధనరాసులను సమర్పించాడు. అయోధ్య శాసనానుసారం పుష్యమిత్రుడు రెండు అశ్వమేధ యాగాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. యవన దండయాత్రలు ఎదుర్కొని విజయం సాధించిన తరువాత పుష్యమిత్రుడు తన మొదటి అశ్వమేథ యాగము నిర్వహించాడు.

పుష్యమిత్రుని మనుమడు వసుమిత్రుడు మీనాండర్‌ను సింధునదీ తీరంలో జరిగిన యుద్ధంలో ఓడించిన తరువాత, అదే విధంగా పుష్యమిత్రుని పుత్రుడు అగ్నిమిత్రుడు విదర్భ రాజ్యంను జయించిన తరువాత పుష్యమిత్రుడు రెండవ అశ్వమేథయాగం జరిపాడు. మౌర్యుల కాలంలో వ్యాపించి, గ్రీకు ప్రభువైన మీనాండర్ ప్రోత్సాహంతో అభివృద్ధి చెందిన బౌద్ధమత పతనానికి పుష్యమిత్రుడు సహకరించాడు. పాటలీపుత్ర నగరంలో గల కుక్కుటారామమును ఇతడు విధ్వంసం చేశాడు. మగధ రాజ్యమందున్న బౌద్ధ స్తూపాలను, ఆరమా విహారాలను, చైత్యాలయాలను నేలమట్టం చేశాడు. అంతే కాకుండా పుష్యమిత్రుడు బౌద్ధ సన్యాసులను వధించి, శాకలమున బౌద్ధమతాభిమానులకు, బౌద్ధులకు నిలువ నీడ లేకుండా చేశాడు. బౌద్ధ సన్యాసి తల నరికి తనకప్పగించిన వారికి 100 దీనారములు బహూకరించెదనని శాకలమున పుష్యమిత్రుడు ప్రకటించాడు. జైనమతమునకు చెందిన అనేక బసదులను కూడా పుష్యమిత్రుడు నాశనం చేశాడు. అందుచేతనే ఖారవేలుడు మగధపై దండెత్తి పుష్యమిత్రుడిని ఓడించాడు.

అగ్నిమిత్రుడు 

పుష్యమిత్రుని మరణం తరువాత అతని తనయుడు అగ్నిమిత్రుడు క్రీ.పూ. 149లో మగధ సింహాసనం అధిష్టించాడు. పుష్యమిత్రుని రాజ్యకాలంలో అగ్నిమిత్రుడు దక్షిణాపథ రాజప్రతినిధిగా ఉండేవాడు. విదర్భ దేశంపై దండయాత్ర చేసి విజయం సాధించిన వీరుడితడు. ఇతని కాలంలో మగధ ప్రశాంతంగా ఉండేది. ఇతడు 8 సంవత్సరాలు క్రీ.పూ. 149–141 మాత్రమే పాలించాడు. 

సుజ్యేష్ట 

అగ్నిమిత్రుని తరువాత క్రీ.పూ. 141లో సుజ్యేష్ట మగధ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు 7 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. కౌశాంబిలో లభించిన నాణెములపై జేతమిత అను లేఖనం తప్ప ఇతని పరిపాలనా విశేషాలు పెద్దగా తెలియలేదు. ఇతని పాలన క్రీ.పూ. 141-133 వరకు సాగింది.

వసుమిత్రుడు 

సుజ్యేష్టుని తరువాత వసుమిత్రుడు క్రీ.పూ. 133లో మగధ సింహాసనం అధిష్టించాడు. వసుమిత్రుడు తన తండ్రి తాతల కాలంలో గ్రీకులతో జరిగిన యుద్ధాల్లో మగధ సైన్యాధ్యక్షునిగా పనిచేసి విజయాలు చేకూర్చాడు. వసుమిత్రునికి సంగీత నాట్యములందు ఎక్కువ అభిరుచి ఉండేది. ఇతని కాలంనుండే మగధ సామ్రాజ్య క్షీణదశ ప్రారంభమైనది. వసుమిత్రుడు నాట్యమును తిలకిస్తూ పారవశ్యుడై ఉన్న తరుణంలో మూలదేవునిచే వధించబడినాడు. ఇతని పాలనా కాలం క్రీ.పూ. 133-123. 

వజ్రమిత్రుడు 

వసుమిత్రుని అనంతరం క్రీ.పూ. 123లో మగధరాజ్య పాలకునిగా వజ్రమిత్రుడు సింహాసనం అధిష్టించాడు. వజ్రమిత్రుని గూర్చి వివరాలేవీ చరిత్రకారాలకు తెలియలేదు. ఇతని పాలనా కాలం క్రీ.పూ. 123-114 అని మాత్రం తెలిసినది.

భగవతుడు

పుష్యమిత్రుని తరువాత మగధను ఎక్కువ కాలం అంటే 32 సంవత్సరాలు అవిచ్చిన్నంగా పాలించిన వాడు భగవతుడు. క్రీ.పూ. 114 నుండి 82 వరకు పాలించాడు. 

దేవభూతి 

భగవతుని తరువాత మగధను పాలించిన వాడు దేవభూతి. ఇతని పాలనా కాలం క్రీ.పూ. 82-73. ఇతడు విలాస పురుషుడు, స్త్రీలోలుడు. రాజ్య పాలనా విషయాలు పట్టించుకోకుండా అంతఃపురంలోనే ఎక్కువ కాలం గడిపేవాడు. అంతఃపుర పరిచారిక కుమార్తె వలన వధింపబడినాడు. దేవభూతిని సంహరించుటలో ప్రధానపాత్ర వహించినవాడు అతని అమాత్యుడైన వాసుదేవుడు.దేవభూతి మరణంతో శుంగవంశం అంతరించిది. దేవభూతి శుంగవంశ పాలకులలో చివరివాడు. 

క్రీ.పూ. 73లో దేవభూతి సంహరింపబడిన తరువాత అతని సచివుడు వాసుదేవుడు మగధ సింహాసనం అధిష్టించి కాణ్వ వంశాన్ని స్థాపించాడు.


 RELATED TOPICS 

మౌర్యానంతర యుగం - కాణ్వ వంశము  

కుషాణులు