• ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 సెక్షను, పది షెడ్యూళ్లు ఉన్నాయి. 
  • ఈ చట్టం ద్వారా బర్మా భారతదేశం నుంచి విడిపోయింది. 
  • సింధు, ఒరిస్సా రాష్ట్రాలు కొత్తగా ఏర్పరచడం జరిగి అవి, వాయువ్య సరిహద్దు రాష్ట్రం. మిగతా రాష్ట్రాలతో సమానం చేయబడినాయి.

సమాఖ్య రాజ్యంగం : 

1935 చట్టం సమాఖ్య రాజ్యాంగాన్ని రూపొందించింది. సమాఖ్య రాజ్యాంగానికి సాధారణంగా మూడు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. 

1. లిఖిత పూర్వక రాజ్యాంగము 

2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి, వాటి అధికారాలు ఖచ్చితంగా నిర్ణయం జరగడము. 

3. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలు తీర్చడం కోసం ఒక ఉన్నత న్యాయస్థానం.

1935 రాజ్యాంగ చట్టం లిఖిత పూర్వక రాజ్యాంగం గాను, ఫెడరల్ న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం గాను ఏర్పరచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేరు వేరు విషయాలు కేటాయించటం వల్ల సమాఖ్య రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. భారతదేశమందలి బ్రిటిష్ రాష్ట్రాలు మొత్తం 16. ఈ నూతన సమాఖ్యలో సభ్య రాష్ట్రాలు. ఇవి గాక ఏయే సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరవలెనని ఇష్టపడతాయో అవి ప్రత్యక్షంగా ప్రభుత్వంతో ఒక డంబడిక చేసుకోవలెను. 1935 చట్టం భారత రాజ్యాంగ మంత్రి అధికారాలలో ఎక్కువ మార్పులు తీసుకొని రాలేదు. ఇండియా కౌన్సిల్ రద్దు అయింది. దానికి బదులు ముగ్గురికి తగ్గకుండా ఆరుగురికి హెచ్చకుండా ఒక సలహా సంఘం ఏర్పాటైంది. కాని మంత్రి ఆ సంఘ సలహాలకు బద్ధుడు కాడు. ఇంగ్లండ్లోని భారత కార్యాలయానికి సంబంధించిన ఖర్చులన్నీ బ్రిటిష్ ప్రభుత్వమే భరించవలెను.

కేంద్ర ద్వంద్వ ప్రభుత్వం : 

భారతదేశ కేంద్రంలో ఈ నూతన చట్టం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రానికి కేటాయించిన విషయాలు కొన్ని ప్రభుత్వాదీనశాఖకు, మిగతావి శాసన సభ శాఖకు కేటాయించడమైంది. ప్రభుత్వాధీనశాఖకు అప్పగించిన విషయాలలో ముఖ్యమైనవి దేశ రక్షణ, మత సంబంధ విషయాలు విదేశీ వ్యవహారాలు మొదలైనవి. గవర్నర్ జనరల్ ముగ్గురికి మించని ఒక సలహాసంఘం సహాయంతో పై విషయాలకు సంబంధించినంత వరకు పరిపాలిస్తాడు. ప్రభుత్వాధీన శాఖ విషయాలను పరిపాలించడానికి 10 మందికి మించకుండా శాసన సభకు బాధ్యులైన మంత్రులతో కూడిన సభ ఏర్పాటైంది. దీనిని బట్టి కేంద్రంలో అతి ముఖ్యమైన అధికారి గవర్నర్ జనరల్ అని తెలుసుకొవలెను. అతడు భారతదేశంలో ఉండే ఇంగ్లాండ్ దేశ ప్రతినిధి. బ్రిటిష్ ప్రధాని సలహాతో చక్రవర్తి అతనిని నియమిస్తాడు.

ఈ నూతన చట్టం గవర్నరు జనరల్ కు పరిపాలనాధికారాలు, శాసనాధికారాలు, ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. అతడు భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడువలె. అల్ప సంఖ్యాకుల హక్కులు రక్షించవలె, స్వదేశీ సంస్థానాల హక్కులు, సంస్థానాధీశుల అధికార గౌరవాన్ని కాపాడవలెను. పబ్లిక్ సర్వీస్లోని ఉద్యోగుల హక్కులు, వారి వారసుల హక్కులు సంరక్షించవలె. చక్రవర్తి ఇతని సలహాపై మద్రాసు, బొంబాయి, బెంగాలు మినహా ఇతర రాష్ట్ర గవర్నర్లను నియమిస్తాడు. కౌన్సిలు సభ్యులను, మంత్రులను, ఆర్థిక, సలహాదారుని, ఛీప్ కమీషనర్లను, శాశ్వత కార్యదర్శులను, పబ్లిక్ సర్వీసు చైర్మన్, ఇతర సభ్యులను అతడే తమకు ఇష్టమైన వారిని నియమించవచ్చు. శాసన సభలపై కూడా అతనికి పూర్తి అజమాయిషి ఉంది. శాసన సభలను సమావేశపరచడానికి వాయిదా వేయడానికి, రద్దు చేయడానికి అతనికి అధికారం ఉంది. శాసనసభలలో తనకు ఇష్టం వచ్చినప్పుడు ఉపన్యసించవచ్చు. అతనికి కేటాయింపు అయిన సంరక్షణ, మత విషయశాఖ, విదేశీ వ్యవహరాల విషయాలపై ప్రశ్నలు వేయడానికి, వాటిని శాసన సభలలో చర్చించడానికి సభ్యులు ముందుగా గవర్నరు జనరల్ అంగీకారం పొందవలె. ఏ సందర్భంలోనైనా, శాసన సభలు రెండూ కలిపి ఏ బిల్లునైనా పరిష్కరించవలెనని గవర్నరు జనరల్ ప్రకటిస్తే ఏ శాసన సభా ప్రత్యేకంగా ఆ బిల్లును చర్చించడానికి వీలులేదు. శాసన సభలు ఆమోదించిన బిల్లును గవర్నరు జనరల్ ఆమోదించడానికి నిరాకరించవచ్చు. లేదా ఆ బిల్లును మళ్ళీ విచారించమని శాసన సభకు తిరిగి పంపవచ్చు. లేదా దానిని ఏ విధంగా పరిష్కరించవలెనో సూచనలు చేయవచ్చు. అట్లే ఆదాయ వ్యయాలకు సంబందించిన బిల్లును గవర్నర్ జనరల్ ఆమోదం పొందందే ఆమల్లోకి రావటానికి వీలులేదు. శాసన సభలు గవర్నర్ జనరల్ కోరికలను వ్యతిరేకంగా ఏ మొత్తమైనా నిరాకరిస్తే, లేదా కోరిన దానికన్నా తక్కువ వస్తే గవర్నర్ జనరల్ తన ప్రత్యేకాధికారంతో తనకు కావలసిన విధంగా ఆ వ్యయ మొత్తాన్ని పునరిద్ధరించవచ్చు. శాసన సభ సమావేశాలు లేని కాలంలో మంత్రుల ఆమోదంతో గవర్నర్ జనరల్ ఆర్డినెన్సు మూలంగా కొత్త శాసనాలు చేయవచ్చు. కాని వాటి కాల పరిమితి ఆరు మాసాలు మాత్రమే. ఏ కారణం వల్లనైనా రాజ్యాంగం భగ్నమై పరిపాలన స్తంభించినపుడు గవర్నర్ జనరల్ కే రాజ్యాంగం నిర్వహించే అధికారం ఉంటుంది. గవర్నర్ జనరలు రాష్ట్రాల పైన కూడా అధికారం ఇవ్వటం జరిగింది. ఇతని అనుమతి పొందనిదే కొన్ని ముఖ్య విషయాలకు సంబంధించిన బిల్లులు ఉదాహరణకు బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన పార్లమెంటు చేసిన శాసనాలను రద్దు చేయడం లేక సవరించడం, ఆంగ్లేయ పౌరులను నేర విచారణ చేసే విధానాన్ని మార్చడం, అతడుగాని గవర్నర్ గాని స్వేచ్ఛతో చేసిన ఆర్డినెన్సులు రద్దు చేయడం, సవరించడం రాష్ట్ర శాసన సభలో ప్రవేశపెట్టరాదు. ఈ విధంగా రాష్ట్రాలకు కల్పించిన స్వాతంత్ర్య ప్రతిపత్తికి భంగం కలిగించడానికి వీలయింది. అవసరం అయితే రాష్ట్రాలను చిన్నవిగా, పెద్దవిగా చేసే అధికారం కూడా అతనికి ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులను నియమించడానికి కూడా అతనికి హక్కు కల్పించడం జరిగింది. సైన్యం బాధ్యత అతనిదే. దేశ రక్షణ, విదేశీ వ్యవహరాలు అతని బాధ్యతలే. 

మరింత సమాచారం  : 1935 చట్టం - ప్రభుత్వ అధికారాలు