ప్రభుత్వ అధికారాలు

1935 చట్టం ప్రభుత్వాధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా కేటాయించింది. కేంద్రానికి 59 విషయాలు, రాష్ట్రాలకు 54 విషయాలు, కేటాయించడమేగాక ఉభయ ప్రభుత్వ ఉమ్మడి విషయాలు కూడా కొన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించిన విషయాలలో ముఖ్యమైనవి దేశ రక్షణ, విదేశీ వ్యవహరాలు, నాణేలు, మత విషయాలు, తంతి తపాలా, టెలిఫోన్, రైలుమార్గాలు, నౌకాయానం, తులామానం, ఆదాయపు పన్ను మొదలైనవి. రాష్ట్ర ప్రభుత్వ విషయాలలో ముఖ్యమైనవి. ఆరోగ్యం, విద్య, నీటి వసతులు, వ్యవసాయం, అడవులు, వ్యవసాయపు పనులు, మరికొన్ని రకాల పనులు, రాష్ట్ర ప్రభుత్యోద్యోగులు మొదలయినవి ఏవైనా కొత్త విషయాలు, పై మూడు విభాగాలతో పేర్కొన్నవి తటస్థించినప్పుడు వాటిని గవర్నర్ జనరల్ తన విచక్షణ ద్వారా కేంద్రానికో, రాష్ట్రానికో లేక ఉమ్మడిగానో కేటాయించవచ్చు.

కేంద్రము : 

1935 రాజ్యంగ చట్టం ద్వారా కేంద్రంలో పూర్వం వలెనే రెండు శాసన సభలు ఏర్పడినాయి. ఎగువ సభ, లేక రాజ్యసభ 260 మంది సభ్యులు. దిగువ సభ, లేక సమాఖ్యసభలో 375 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభలోని 260 మందితో 104 మందిని సంస్థానాలకు మిగతా 156 మందిని బ్రిటిష్ రాష్ట్రాలకు కేటాయించడం అయింది. ఆ సంస్థానాల హోదాను అనుసరించి అవి ఏంత మంది ప్రతినిధులను ఎన్నుకోవలెనో చట్టమే సూచించింది. 

సంస్థానాలలో ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టె వరకూ సంస్థానాదీశులే సభ్యులను నామనిర్దేశం చేయవలె. రాష్ట్రాలకు కేటాయించిన 156 సభ్యులలో గవర్నర్ జనరల్ 6 గురిని నామ నిర్ధేశం చేయవలెను. 75 మంది హిందూ సాధారణ నియోజక వర్గం నుంచి ఎన్నిక అవుతారు. 49 మందిని మహ్మదీయులు, 48 మందిని సిక్కులు, 7 గురిని తెల్లవారు, ఇద్దరిని దేశీయ క్రైస్తవులు, ఒకరిని ఆంగ్లో ఇండియన్లు 6 గురిని స్త్రీలు, 6గురిని నిమ్నజాతుల వారు ఎన్నుకొంటారు. సంస్థానాల వలెనే రాష్ట్రాలకు కూడా ప్రతినిధుల సంఖ్య వేరు వేరుగా నియమించడమైనది. ఆ రాష్ట్రాల ప్రాముఖ్యం జనసంఖ్య ఇంకా ఇతర విషయాల దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు జరిగినాయి.

సమాఖ్యసభలోని సభ్యుల సంఖ్య 375. ఇందులో మూడవ వంతు అనగా 125 మంది సంస్థానముల నుంచి మిగతా 250 మంది రాష్ట్రాల నుంచి ఎన్నికయినవారు. ఎగువసభలో వలెనే ఈ సభలో కూడా ఆయా స్థానాలు, రాష్ట్రాల ప్రాముఖ్యాన్ని బట్టి సభ్యుల సంఖ్య నిర్ణయించడమైంది. ఈ సభలోని సభ్యులను పరోక్షంగా రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకొంటారు. ఈ సభ్యుల కాల పరిమితి 5 సంవత్సరాలు, రాజ్యసభకు కాలపరిమితి లేదు. అది శాశ్వత సభ. ప్రతి మూడు సంవత్సరాలకు మూడోవంతు మంది సభ్యులు తమ పదవులను విరమించుకొంటారు. సభ్యుల కాలపరిమితి మూడు సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వరకు ఉంటుంది. సమాఖ్య సభలో ఉన్న బ్రిటిష్ రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలు తిరిగి కుల మతాలను అనుసరించి విభజన అయినాయి. ఉదాహరణకు హిందూ, ముస్లిం సిక్కు స్థానాల ప్రతినిధులను రాష్ట్ర శాసన సభలో గల ఆయా మతాల వారు ఎన్నుకొంటారు. కేంద్ర మంత్రులు శాసన సభకు బాధ్యులై శాసన సభ విశ్వాసము వారిపై ఉన్నంత వరకు అధికారంలో ఉంటారు.

ఫెడరల్ న్యాయస్థానం : 

1935 చట్టం ప్రకారం ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు అయినది. ఈ న్యాయస్థానానికి మూడు విధాలైన అధికారం లభించాయి. సహజమైన అధికారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంస్థాన ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య లేక అన్నింటి మధ్య రాజ్యంగ శాసనానికి సంబంధించిన తగవులు పరిష్కరించటమే ఈ సహజ అధికారం. బ్రిటిష్ ఇండియా హైకోర్టుల తీర్పులపైన, సమాఖ్యలో చేరిన సంస్థానాల హైకోర్టుల తీర్పులపైన అపీల్ ను ఈ న్యాయస్థానం పరిష్కరిస్తుంది. ఈ న్యాయస్థానం సామాన్యముగా ఢిల్లీలోనే సమావేశం అవుతుంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి 6 గురికి మించకుండా ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయవాదిగా కనీసం 15 సంవత్సరాల అనుభవం కల వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి పదవికి అర్హుడు.

రిజర్వు బ్యాంక్ : 

దేశంలో చెలామణిలో ఉండే నాణేలను అదుపులో పెట్టడానికి ఆర్థిక పరిస్థితిని పరిశీలించి చక్కబెట్టడానికి గవర్నర్ తో  కూడిన 15 మంది డైరెక్టర్లతో రిజర్వు బ్యాంకును ఈ చట్టం నెలకొల్పింది.

రాష్ట్రాలు : 

1935 చట్టం రాష్ట్రాలలో అనేక మార్పులను తీసుకొని వచ్చింది. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైనది. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం రద్దయి పూర్తిగా బాధ్యతాయిత ప్రభుత్వం ఏర్పాటు కావటం. పరిపాలనా శాఖలన్నీ మంత్రులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు పూర్వం వలే అధికారి గవర్నర్. ఇతనిని చక్రవర్తి నియమిస్తాడు. రాష్ట్రాలకు కేటాయించిన విషయాలలో ఇతనికి సలహా ఇచ్చి సహయ పడటం కోసం మంత్రి వర్గం ఏర్పడింది. అసాధారణ పరిస్థితులలో తప్ప గవర్నర్ మంత్రుల సలహలను పాటించాలి. ఈ మంత్రులు తప్పనిసరిగా శాసన సభ్యులై ఉండవలెను. లేక పదవిలోకి వచ్చిన 6 నెలలలో ఎన్నిక ద్వారా శాసన సభ సభ్యత్వం పొందవలెను. గవర్నర్ మంత్రి వర్గము ఏర్పాటు చేసేటప్పుడు శాసన సభలో ఏ పక్షం అధిక సంఖ్యాకులతో ఉంటుందో ఆ పక్ష నాయకుని ముఖ్య మంత్రిగాను అతనితో సంప్రదించి ఇతర మంత్రులను ఏర్పాటు చేయవలెను. పెద్ద రాష్ట్రాలైన మద్రాస్, బొంబాయి, బెంగాల్ సంయుక్త రాష్ట్ర బీహర్, అస్సాం మొదలగు వాటిలో కేంద్రములో వలె రెండు సభలు ఏర్పడినాయి. అవి శాసన సభ, శాసన మండలి, కేంద్రములో వలె మత, కుల, బేధాలను అనుసరించి సభలలో సభ్యత్వ సంఖ్య నిర్ణయించటమైయింది. గవర్నర్ జనరల్ వలె గవర్నర్ కు కూడా ప్రత్యేక అధికారాలు కేటాయించడం జరిగింది. అవసరమైతే ఆర్డినెన్సులు ప్రవేశపెట్టడానికి శాసనాలు చేయడానికి అధికారం కూడా కల్పించారు.

మరింత సమాచారం  : 1935 చట్టంలోని సుగుణాలు, లోపాలు