ఆంగ్లేయులు మన దేశంలోని ప్రభుత్వంలో మార్పులు తేవడం కోసం అనేక చట్టాలు చేసినారు. ఈ చట్టాలన్నింటిలోను 1935 లో అమలులో పెట్టిన చట్టం చాలా ముఖ్యమైనది. దీనిని తయారు చేయడానికి బ్రిటీష్ వారికి అనేక  సంవత్సరాలు పట్టింది. వారు ఈసారి ప్రత్యేకంగా భారతదేశ ప్రతినిధులతో సమాలోచనలు చేసి తుదకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించినారు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందుమూలంగా దేశంలో ఒక నూతన రాజ్యాంగమే ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పవచ్చు. కెనడా, ఆస్ట్రేలియాల వలె సమాఖ్య రాజ్యాంగం రూపొందించడం ఈ నూతన చట్టం ప్రధాన లక్షణం అని అనేకుల అభిప్రాయం. కాని ఈ చట్టం మిగతా చట్టాలవలె పూర్తిగా అమలుకాలేదు. ప్రజలు దానిని అతి త్వరలో వ్యతిరేకించి ఆంగ్లేయులపై దాడి చేసినారు. 

1935 చట్టం ప్రవేశపెట్టటానికి కారణాలు

1919 చట్టం లోపభూయిష్టమైనదనీ, తమను ఏ విధంగానూ తృప్తిపరచలేదనీ, తమకు ఏమీ లాభదాయకం కాదనీ, భారతీయులు త్వరగా తెలుసుకొన్నారు. వారి ఏకైక నాయకుడైన మహాత్మాగాంధీ నాయకత్వంలో మొదటి సహాయ నిరాకరణోద్యమం, తరువాత శాసనోల్లంఘనోద్యమం లేవదీసినారు. దేశం అంతా ఏకమై ఆంగ్ల ప్రభుత్వంపై దాడి చేసింది. ఈ ఉద్యమాలను అణచడానికి పూర్వం వలెనే ప్రభుత్వం రెండు విధానాలను అనుసరించింది. దారుణమైన ఆర్డినెన్సులను అమలు పరచి, సాయుధ పోలీసులను, సైనికులను వినియోగించి, వందలాది ప్రజలను చంపించి, వేలాది ప్రజలను నిర్బందంతో కూడిన నరకం వంటి జైళ్ళపాలు చేసి, కటినంగా శిక్షించడం వారు అనుసరించిన మొదటి విధానం. దాని వల్ల జాతీయ భావం కలిగిన అనేక మంది ప్రజలు కష్టాల పాలైనారు. 'విభజించు పాలించు' అనే సిద్ధాంతాన్ని అమలుపరచి, ముస్లింలను, అల్ప సంఖ్యకులను వారి నుంచి వేరు చేసి, వారిని తృప్తి పరచటానికి ముఖ్యంగా ఈ 1935 చట్టం ప్రవేశ పెట్టినారు. కాని దేశం మొత్తం ప్రజలను తృప్తి పరచడానికే ఈ శాసనం చేసినట్లు పైకి కనిపించడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. ఆంగ్లేయుల రాజనీతికి ఇది ఒక గీటురాయి. 1927లో ఈ ఉద్దేశ్యంలో సైమను కమీషన్ దేశంలో పర్యటించి ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చింది. దానిని అనేక కారణాల వల్ల భారతీయులు బహిష్కరించినా, అది దానికి వీలైన పరిధిలో అన్ని విషయాలు తెలుసుకొంది. ఇంగ్లండ్ లో  భారతీయ ప్రతినిధులతో కూడిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. కాని ఈ ప్రజా ప్రతినిధులందరూ అల్ప సంఖ్యక వర్గాల వారూ మహ్మదీయులు కావటం వల్ల అందులో కాంగ్రెసు వారికి స్థానం లేదు. రెండో సమావేశంలో మాత్రం గాంధీజీ పాల్గొన్నా తగిన ప్రయోజనం చేకూరలేదు. చివరకు భారతీయుల ప్రమేయం ఎక్కువ అవసరం లేదని సైమన్ కమీషన్ సలహను అనుసరించి కొత్త చట్టం చేయవచ్చునని పార్లమెంటు తీర్మానం చేసినా, నెహ్రూ కమిటి రిపోర్టు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్ణయాలు, వైట్ పేపరు, జాయింటు సెలెక్షన్ రిపోర్టు, లోధియన్ రిపోర్టులలోని అంశాలకు కూడా కొంచెం ప్రాముఖ్యం ఇవ్వటం జరిగింది. అందుకే భారతీయులు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి మహ్మదీయులకు, హిందువులకు మధ్య శాశ్వతమైన చీలికలు ఏర్పరచటం అల్ప సంఖ్యకులైన మహ్మదీయులు, అస్పృశ్యులు, బలహీనవర్గాలు సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, భారతీయ క్రైస్తవులు, యూరోపియనులు, కార్మికులు మొదలైన వారిని తృప్తి పరచడానికి 1935 చట్టం ప్రవేశపెట్టడం జరిగింది.

మరింత సమాచారం  : 1935 చట్టంలోని ప్రధాన అంశాలు