ఉపరితల కారణాలు
భూఉపరితలంపైనున్న పెద్ద పెద్ద కొండ రాళ్ళు జారడం వల్ల గాని, హిమానినదాలు ప్రవహించే చోట హిమపాతాలు సంభవించడం వల్ల గాని, గనులు ఉన్న ప్రదేశాలలో సొరంగాలపై కప్పు కూలడం వల్ల గానీ, పర్వత ప్రాంతాల్లో భూపాతాల సంభవం వల్ల గాని భూకంపాలు ఏర్పడతాయి.
భూమి లోపలి నీటి ప్రభావాల కారణంగా గృహాలపై కప్పులు కూలిపోవడం వల్ల కూడా భూకంపాలు సంభవించే ఆస్కారం కలదు.
భూగర్భంలో నిర్వహించే అణ్వస్త్ర పరీక్షల వలన, పెద్ద పెద్ద కృత్రిమ జలాశయాల వలన, భూఅంతర్భాగంలో ఖనిజాన్వేషణ కొరకు తవ్విన సొరంగాల పైభాగాలు కూలడం వల్ల భూకంపాలు సంభవించవచ్చు. అయితే ఇటువంటి కారణాలరీత్యా ఏర్పడిన భూకంపాల వలన ఎక్కువ తీవ్రత ఉండదు. వీటివలన విధంగా ఏర్పడిన భూకంపాలు అతి తక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ తరహా భూకంపాలు ఏర్పడటానికి సాధారణంగా మానవ ప్రమేయం ముఖ్య కారణంగా ఉంటుంది.
అగ్నిపర్వత సంబంధిత కారణాలు
అగ్నిపర్వతాలుండే ప్రదేశాల్లో భూమి అంతర్భాగంలో ఉండే శిలాద్రవంలో కదిలిక ఏర్పడి, ఆ శిలా ద్రవం అగ్నిపర్వతాల గుండా ఉబికి పైకి వచ్చినప్పుడు భూగర్భంలోపల ఏర్పడే ఖాళీ ప్రదేశాల పైనుండే శిలల బరువుకు భూమి క్రిందకు కృంగడం వలన కూడా భూకంపాలు సంభవిస్తాయి.
స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం
హెచ్.ఎఫ్.రీడ్ ప్రతిపాదించిన స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం ప్రకారం భూమిలోపల ఉండే పలకలు సాపేక్ష చలనాలు కలిగి ఉన్నప్పుడు ఉపరితలంలోని శిలలు తట్టుకోలేనంతగా పెరిగిన వికృతి బలం, శిలల ప్రతిఘటన శక్తికంటే ఎక్కువైనపుడు శిలలు విచ్ఛేదనం చెంది అల్ప వికృతి బలం స్థానానికి చేరుకుంటాయి.
పాతాళ సంబంధమైన కారణాలు
ఈ కారణాల వలన చాలా అరుదుగా భూకంపాలు సంభవిస్తాయి. భూ అంతర్భాగంలో కలిగే రేడియో ధార్మిక విచ్ఛిత్తి, రసాయనిక చర్యల వల్ల కలిగే మార్పులు దీనికి ముఖ్య కారణంగా ఉంటాయి. ఇవి భూ ఉపరితలానికి 24 కిలోమీటర్ల నుంచి 640 కిలోమీటర్ల వరకు సంభవిస్తాయి.
పలక విరూపకారకాల సిద్ధాంతం
ప్రపంచం మొత్తంలో సంభవించే శక్తివంతమైన భూకంపాలలో అధికభాగం విరూపకారక బలాల కారణంగానే సంభవిస్తున్నట్లు తెలుస్తున్నది. విరూపకారక బలాల్లో తన్యత సంపీడన బలాలు భూపటలంపై ప్రభావం చూపుతాయి. భూపటలంలోని రాతి పొరలలో చాలా కాలంగా ఉన్న బలాల వ్యత్యాసాల కారణంగా కొన్ని ప్రదేశాలలో భ్రంశాలు ఏర్పడి శిలా పొరలలోని శక్తులలోగల తేడాలు సర్దుకుని ప్రతిబలం సడలి భూకంపాలు సంభవిస్తాయి.
స్థితిస్థాపకత సిద్ధాంతం
ఈ సిద్ధాంతం ప్రకారం విరూపకారక పలకాల చలనం నిరంతరం భూపటలంపై కలుగజేసే ఒత్తిడి యాదృచ్ఛికంగా గరిష్ఠ అవలంబన వికృతి బిందువునకు చేరినపుడు, భ్రంశం వెంబడి పగులు ఏర్పడి, వికృత బలం నుంచి విడుదలయ్యే వరకు శిల తన సొంత స్థితిస్థాపక బలాల క్రింద ఎగిసిపడుతుంది.
Pages