ప్రయోజనాలు
పలు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతనుపుయోగించుకుని వినియోగదారుల సేవలను త్వరంగా అందించగలుగుతున్నాయి. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా కంప్యూటర్లే సమాధానాలు ఇవ్వగలిగేలా అభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా మాటల ద్వారానే కాకుండా చాట్ బోట్ ద్వారా కూడా సేవలందించడం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలు మానవ వనరులను ఉపయోగించి చేసే పనులకు వేతనాలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. అదే కృత్రిమ మేధస్సును వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే పనులు జరిగిపోతున్నాయి. ఉద్యోగ నియామకాల కోసం కూడా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకుంటూ సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకుంటున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా కూడా కృత్రిమ మేధ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికతతో అభివృద్ధి పరచబడిన చాట్ బోట్ ద్వారా ప్రజలు తమకు అవసరమైన సేవలను పొందడానికి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం కలిగి తద్వారా పౌరులు తమకు కావాల్సిన సేవలు త్వరితంగా పొందడానికి అవకాశం కలుగుతుంది.
ఇప్పటివరకు పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు అవి గ్రహించిన సమాచారం ఆధారంగా కొన్ని స్వరాలను మాత్రమే గుర్తించగలిగే సాంకేతికత అభివృద్ధి చేశారు. అటువంటి పరికరాలకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను జోడించడం ద్వారా మాండలికాలలో, భాషలో, యాసలో, స్వరంలో ఎటువంటి చిన్న మార్పు కలిగినా దానిని పూర్తి ఖచ్చితత్వంతో కూడిన స్వరాలను గుర్తించేలా కృత్రిమ మేధ ద్వారా వీలవుతుంది.
కృత్రిమ మేధ సాంకేతికతతో ఎటువంటి చేతిరాతనైనా గుర్తించి, తద్వారా అక్షరాల ఆకృతిని అర్థంచేసుకునే అవకాశం కలదు. ఏ విధమైన రాతనైనా చదవగలగడం, లిపిని సరిచేయడం వంటి సామర్థ్యం ఈ సాంకేతికతకు కలదు. మేధోపరమైన క్రీడల్లో కూడ కృత్రిమ మేధను శాస్త్రవేత్తలు విజయవంతంగా వినియోగించారు. ఉదాహరణకు ఛెస్ వంటి క్రీడల్లో ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థిని ఓడించగలగడం కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా సాధ్యమని ఇప్పటికే నిరూపితమైంది.
నష్టాలు
కృత్రిమ మేధ సాంకేతికతతో యావత్ ప్రపంచంలోనే అనేక విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నూతన సాంకేతికత కారణంగా పలు రంగాల్లో తక్కువ నైపుణ్యం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానాలతో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి ప్రమాదంలో పడుతుందనేది కొందరి వాదన. అయితే వారంతా తమ నైపుణ్యాలను అభివృద్ధి పరచుకొంటే ఈ సమస్యను అధిగమించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. కృతిమ మేధతో నడిచే మానవ రహిత కార్లు అందుబాటులోకి రావడం వాహన రంగంలో ఒక సంచలనాత్మక విజయమే, కానీ వాటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత వహించేదెవరు అనేది ప్రశ్నార్ధకం. వైద్య, ఆర్థిక, వాణిజ్య రంగాలలో ఈ సాంకేతికత విరివిగా వాడవచ్చు. దీని ద్వారా తక్కువ సమయంలో పౌరులకు ఉత్తమ సేవలు అందించేందుకు పూర్తి అవకాశం ఉంటుంది. కానీ భద్రతకు సంబంధించిన రంగాల్లో మాత్రం ఈ సాంకేతికతను వినియోగించడం అంత శ్రేయస్కరం కాదని నిపుణుల అభిప్రాయం.
ఏది ఏమైనా ఈ సరికొత్త సాంకేతికతతో నష్టాల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉండడం వలన అన్ని రకాల రంగాలవారు దీనివైపు మొగ్గుచూపుతున్నారు. మొత్తం మీద కృత్రిమ మేధ సాంకేతికత మానవ జీవితంలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొని వస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు.
సంబంధిత అంశాలు : కృత్రిమ మేధస్సు(Artificial Intelligence-AI)
Pages