మనషి మేధస్సుతో చేయగలిగే పనులను ఒక యంత్రం కూడా స్వతంత్రంగా చేసే నూతన సాంకేతికత పేరే 'కృత్రిమ మేధస్సు'(Artificial Intelligence-AI). ఇందులో భాగంగానే మర మనుషులకు సాంకేతికతల ద్వారా మేధాశక్తిని ప్రసాదించి విజ్ఞానశాస్త్ర చరిత్రలోనే ఒక నూతన విప్లవానికి శాస్త్రవేత్తలు నాంది పలుకుతున్నారు.  

కృత్రిమ మేధస్సు(Artificial Intelligence-AI) పితామహుడిగా గుర్తింపు పొందిన జాన్ మెక్ కార్తీ 1956లో తొలిసారిగా 'కృత్రిమ మేధస్సు'(Artificial Intelligence) అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. విజ్ఞానశాస్త్రం, సాంకేతికతల కలయికతో రూపొందించబడిన తెలివైన యంత్రాల సాంకేతికత, కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు 'కృత్రిమ మేధస్సు'(Artificial Intelligence-AI) అని జాన్ మెక్ కార్తీ నిర్వచనం ఇచ్చాడు. 

కంప్యూటర్ తనకు తానుగా సొంతంగా ఆలోచించి ఏ పనీ చేయలేదు. ప్రోగ్రామ్ ల రూపంలో ముందుగా నిర్దేశించిన పనిని మాత్రమే అది పూర్తిచేస్తుంది. ఇప్పటి వరకూ మనిషి ద్వారా రూపొందించబడిన ప్రోగ్రామ్ ల ఆధారంగా మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. పూర్తిగా మనిషి ఆధీనంలో ఉన్నాయి. వాటికి స్వంత ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం చూపగల సామర్థ్యం లేదు. దీనికి భిన్నంగా కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధితో అనేక సమస్యలకు స్వతహాగా స్పందించి సమాధానాలు ఇవ్వగలిగే స్థాయికి కంప్యూటర్లు చేరుతున్నాయి. కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా మనిషిలాగే సొంతంగా ఆలోచించి తగు సందర్భాన్ననుసరించి నిర్ణయాలు తీసుకునేలా ఒక యంత్రానికి సూచనలు ఇవవ్వచ్చు. 

ఒక పనిని నేర్చుకొని ఆలోచించగలిగే అల్గారిథమ్ ఉపయోగించే కంప్యూటరు, కృత్రిమ మేధ సాంకేతికతను జోడిస్తే అది ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు, అదే పనిని ప్రతిసారి ఇంకా ఎంత మెరుగ్గా చేయవచ్చో ఆలోచించి ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటుంది. ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్లలో ఒక పదాన్ని టైప్ చేసినప్పుడు కొన్ని అక్షరాలు టైప్ చేయగానే పూర్తి పదాన్ని చూపించడం కృత్రిమ మేధ సాంకేతికతకు నిదర్శనం. దీని ద్వారా మనం కోరుకున్నట్లు మన కంప్యూటరే ఆలోచించి మన శ్రమను తగ్గిస్తుంది. 

కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే రోబోలు, కంప్యూటర్లు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆలోచన, తార్కిక విశ్లేషణ వంటి విషయాల్లో మనిషి మెదడు పనితీరును అధ్యయనం చేసి అచ్చం అదేవిధంగా పనిచేసేలా సాఫ్ట్ వేరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, మనోవైజ్ఞానిక, న్యూరాన్ సైన్స్, జీవశాస్త్రం, గణితం, సామాజిక, తత్త్వశాస్త్రాల వంటి మేలు కలయికలతో రూపుదిద్దుకుంటున్న కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రంగాల్లో విజయవంతంగా వినియోగిస్తున్నారు. 

మానవుడు మాత్రమే సాధ్యమైన కొన్ని ముఖ్య సామర్థ్యాలైన ఆలోచన చేయడం, అర్థం చేసుకోవడం, తగురీతిలో సమస్యలను విశ్లేషణ చేయడం, సందర్భానుసారంగా ప్రవర్తించడం మొదలైన వాటిని యంత్రాలకు అనువర్తించడం ద్వారా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులోకి వస్తే మనిషి చేయలేని క్లిష్టమైన పనులు కూడా యంత్రాలు సునాయాసంగా చేయగలవు. 

కృత్రిమ మేధ విస్తరిస్తున్న రంగాలు

ఇప్పటివరకూ రూపొందించబడిన కంప్యూటర్లు కేవలం కోడ్ భాషలను మాత్రమే అర్థంచేసుకునే స్థితిలో ఉన్నాయి. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో అవి అనేక రకాల భాషలను అర్థంచేసుకుని స్వతహాగా సంభాషించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. వైద్యరంగంలో ఇప్పటివరకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించలేని పలు రకాల వ్యాధులను కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించి సునాయాసంగా గుర్తించగలుగుతున్నారు. 

ప్రాథమికంగా రోగాలను నిర్ధారించడానికి, ఆటోమేటెడ్ ఇమేజ్ డయాగ్నసిస్ వంటి రంగాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. క్యాన్సర్ కణుతులను గుర్తించడానికి, మర మనుషుల సహాయంతో శస్త్రచికిత్సలు చేయడానికి, వర్చువల్ నర్సింగ్ అసిస్టెంట్ల ఉపయోగం వంటి విషయాల్లో కూడా కృత్రిమమేధ పాత్ర విస్తృతమైనది. 

రక్షణరంగంలో కూడా కృత్రిమ మేధ సాంకేతికతనుపయోగిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఈ సాంకేతిక అత్యంత కీలకంగా మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు రక్షణరంగంలో ఇప్పటికే రోబోలకు కృత్రిమ మేధస్సును అనుసంధానించి నూతన సాంకేతికతల ద్వారా సైనికుల అవసరం లేకుండానే యుద్ధం చేయడానికి అవసరమైన విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. స్వంతంగా ఛాయాచిత్రాలు తీసే రక్షణ రంగ నిఘా విమానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సైబర్ దాడులు నియంత్రిచడానికి, సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలలో సైతం కృత్రిమ మేధను వాడుతున్నారు. 

పోలీసు వ్యవస్థలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి ఆధునిక యంత్రాలకు దృష్టి జ్ఞానం అందించడం ద్వారా గత రికార్డులలో ఉన్న నేరస్తుల ఛాయాచిత్రాలను పోల్చి వారు పోలీసుల సీసీ కెమెరాలకు చిక్కిన వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 

వాహనరంగంలో కూడా ఈ సాంకేతికత ప్రవేశపెట్టడం ద్వారా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సాంకేతికతనుపయోగించి స్వయంచోదిత వాహనాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు అధునాతన సాంకేతికతతో స్వయం చోదిత వాహనాలను తయారుచేయడంలో నిమగ్నమైనాయి. 

బ్యాంకింగ్, బీమా రంగాలు కూడా కృత్రిమ మేధ సాంకేతికతనుపయోగించి లావాదేవీలు త్వరితంగా పూర్తిచేసి వినియోగదారాలకు ఉత్తమ సేవలు అందించగులుగుతన్నాయి. ఈ-కామర్స్ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల గురించి వినియోగదారులు ఇచ్చే సలహాలను, సూచనలను వడబోసే ప్రక్రియలో ఈ సాంకేతికతనే ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా తమ కంపెనీలో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యత గురించి మరియు వినియోగదారులకు అవసరమైన వస్తువుల గురించిన అంశాలను తెలుసుకోగలుగుతున్నాయి. 


సంబంధిత అంశాలు : కృత్రిమ మేధస్సు - ప్రయోజనాలు, నష్టాలు