నేటి బాలలే రేపటి పౌరులనే విషయాన్ని మరిచి అపురూపమైన బాల్యాన్ని అనుభవించాల్సిన చిన్న వయస్సులోనే బాలలను విద్యకు, ఆటపాటలకు దూరంచేసి శ్రామికులగా మార్చడమే బాలకార్మిక వ్యవస్థ (Child Labour). మన సమాజంలో గల కొన్ని సాంఘిక, ఆర్థిక కారణాల వలన నేటికీ ఎంతోమంది బాలలు తమ భవిష్యత్తును అంధకారంలో వెళ్ళదీస్తూ బాలకార్మికులుగా మగ్గుతున్నారు. వీరికి సంబంధించి స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కూడా ఎన్నో చట్టాలు చేసినప్పటికీ ఇంకా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం సాధ్యమవకపోవడం శోచనీయం.

1919లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation) ప్రథమ సమావేశంలో 14 సంవత్సరాల వయస్సులోపు బాలబాలికలను పనిలో నియమించరాదని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన విశ్వజనీన మానవ హక్కుల డిక్లరేషన్లో (Human Rights Declaration)  బాలబాలికల విద్యాభివృద్ధి, వారి మానసిక, శారీరక వికాసానికి సంబంధించిన హక్కులుగా పేర్కొనబడినవి. ఐక్యరాజ్యసమితి బాలల హక్కులకు సంబంధించి 1959లో ఒక ప్రత్యేక ప్రకటనను వెలువరించింది. 1979వ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా(International Child Year) కూడా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1989లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UN General Assembly) బాలల హక్కుల కోసం ఒక ఒడంబడికను ఆమోదించింది. దీన్ని అప్పట్లో భారతదేశంతో సహా 107 దేశాలు ఆమోదించాయి. బాలకార్మికుల గురించి 1999లో అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ 182 కన్వెన్షన్‌ను ఆమోదించింది. ఈ విధంగా బాలకార్మికుల గురించి అంతర్జాతీయ స్థాయిలో అనేక చర్యలు తీసుకొన్నప్పటికీ అన్ని దేశాలలోను, ముఖ్యంగా భారతదేశం వంటి వెనకబడ్డ దేశాల్లో బాలకార్మికుల పరిస్థితిలో పెద్ద మార్పులేదు. బాలకార్మికులు అధిక సంఖ్యలో వివిధ వృత్తుల్లో పనిచేయడమే కాక దోపిడీకి గురవుతున్నారు.

Must Read : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు (Abolition of Child Labour)

భారతదేశంలో ఫాక్టరీ చట్టంప్రకారం ధనార్జనకై పనిచేసే 14 సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లలను బాలకార్మికులు అంటారు. అయితే దీనికి సంబంధించి పలు సంస్థలు నిర్వచనాలు వెలువరించాయి. వాటి ప్రకారం... బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన సదస్సు (యూఎన్‌సీఆర్‌సీ)18 ఏళ్ల లోపు పనిచేసే వారంతా బాలకార్మికులే అని నిర్వచించగా, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ వో) 15 ఏళ్ల లోపు పనిచేసే వారంతా బాలకార్మికులని నిర్వచించింది. 

భారతరాజ్యాంగంలోని ఆరిక్కల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు ఫాక్టరీలలోగాని, మరేవృత్తులలో గాని పనిచేయరాదు. భారత రాజ్యాంగంలో చట్టాలు చేసినప్పటికీ భారతదేశంలో బాలకార్మికుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రపంచ బాలకార్మికుల్లో సుమారు 33 శాతం భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. మనదేశంలో గల బాలకార్మికుల్లో అత్యధిక శాతం 10 సంవత్సరాలలోపు వారే. వారిలో అధిక శాతం వ్యవసాయ రంగంలోను, ఆ తరువాత అధికశాతం వ్యాపార రంగాల్లోను మరియు ఆధునిక పారిశ్రామిక రంగంలోను పనిచేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరంతా అధిక సంఖ్యలో గృహసంబంధమైన పనుల్లోను, జీతాలు లేని పనుల్లోను పనిచేస్తున్నారు.

వీరి పని పరిస్థితులను పరిశీలిస్తే, వారు అపాయకరమైన ఫాక్టరీల్లోను, పొగ, దుమ్ము, ధూళి, మసి లాంటి వాతావరణం లోను పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. కొందరు పొటాషియం మరియు ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు తయారయ్యే ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. కొందరు గాజుబుగ్గలను తయారు చేసే యూనిట్లలో పనిచేయడం వల్ల వారి ఊపిరితిత్తులు చెడిపోయి క్షయవాధికి గురవుతున్నారు. మరికొన్ని పరిశ్రమల్లో చిన్నారులు విరామం లేకుండా రోజుకు 12 నుండి 18 గంటలకు పైగా కూడా పనిచేస్తున్నారు. 

బాల కార్మికులు ప్రధానంగా పనిచేస్తున్న రంగాలు  

అగ్గిపెట్టెలు మరియు టపాసుల పరిశ్రమ : 

అగ్గిపెట్టెల తయారీ, టపాసుల పరిశ్రమలో తమిళనాడులోని శివకాశి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు రోజులో 12 గంటలు చీకటి కొట్లల్లో పనిచేస్తారు. వారు పొటాషియం క్లోరేడు, ఫాస్పరస్ మరియు జింక్ ఆక్సైడు లాంటి విషపూరిత, రసాయనాలతో కూడిన పనులను నిర్వర్తిస్తుంటారు.

గనులు, క్వారీలు : 

బాలకార్మికులు కేరళలోని క్వారీలలోను, మరెంతో మంది ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం పలకల పరిశ్రమలలోను, మధ్యప్రదేశ్ లోని మాందసార్ లోను పనిచేస్తున్నారు. మేఘాలయ గనుల్లో పనిచేస్తున్నారు. చేపల పరిశ్రమ : కేరళలోని క్విలాన్, కొచ్చి మరియు తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాల్లో బాలకార్మికులు చేపల పరిశ్రమ యూనిట్లలో పనిచేస్తున్నారు. సాధారణంగా బాలురు చేపల లోడింగ్ అన్ లోడింగులను, బాలికలు చేపలను శుభ్రపరచడంలోను పనిచేస్తారు. 

చేనేత పరిశ్రమ : 

కాంచీపురంలో మూడోవంతు, ఇపలం పట్టిలో పదోవంతు బాలకార్మికులు చేనేత పరిశ్రమలో ఉన్నారు. తిరువనంతపురంలో , తిరువూరులో బాలకార్మికులు చేనేత పరిశ్రమలో పనిచేస్తున్నారు. వారు వెలుతురు, గాలి చొరని స్థలాల్లో పనిచేయడంవల్ల వారు కంటి వ్యాధులకు గురవుతున్నారు. 

బీడీ పరిశ్రమ : 

తిరుచునాపల్లి మరియు త్రిచూరులో చాలా మంది పిల్లలు అధికంగా బాలికలు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాళం బుర్రల పరిశ్రమ : ఆలఘర్ లోని తాళం బుర్రల పరిశ్రమలో బాలకార్మికులు అనేకమంది పనిచేస్తున్నారు. 

తివాసీ పరిశ్రమ : 

జమ్మూ, కాశ్మీరులో బాలకార్మికులు తివాసి నేతపని చేస్తున్నారు. ఈ పరిశ్రమ వారణాసి, బదోయి, మీర్జాపూర్ ప్రాంతాలలో విస్తరించి ఉన్నది. భారతదేశపు తివాసి ఎగుమతుల్లో అధిక శాతం ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నందువల్ల బాలకార్మికులు పెద్దమొత్తం తివాసి పరిశ్రమ రంగం పనిచేస్తున్నారు. రాజస్థాన్ తివాసి పరిశ్రమలో కూడా బాలకార్మికులు అనేకమంది పనిచేస్తున్నారు.