బాలకార్మికుల సమస్యలు ఆర్థిక, సాంఘిక అంశాలతో ముడిపడి ఉండడం వలన తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి గాను ప్రభుత్వ పలు పథకాలు ప్రవేశపెట్టి బాలకార్మిక వ్యవస్థను (Child Labour System) సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగానే బాలల సంరక్షణ, 14 సంవత్సరాల లోపు బాలలకు ఉచిత నిర్బంధ విద్య, బలహీన వర్గాలకు చెందిన బాలల విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించండం వంటి ముఖ్యాంశాలతో 1974లో బాలల హక్కులకు సంబంధించిన ఒక జాతీయస్థాయి సిద్ధాంతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 

గురుపాద స్వామి కమిటీ

బాలకార్మిక వ్యవస్థ (Child Labour System) సమగ్ర నిర్మూలనకుగాను అనుసరించాల్సిన వ్యూహాల సిఫార్సుకు సంబంధించి గురుపాద స్వామి కమిటీని 1979లో నియమించింది. దేశంలో పేదరికం రూపుమాపబడిన నాడే బాలకార్మిక వ్యవస్థ కూడా రూపుమాపబడుతుందని, అంతవరకూ ఎన్ని చట్టాలు చేసిన ఈ వ్యవస్థ కొనసాడుతుందని ఈ కమిటీ పేర్కొన్నది. బహు విధానాల రూపకల్పన ద్వారా మాత్రమే బాలకార్మిక వ్యవస్థ (Child Labour System) నిర్మూలన సాధ్యపడుతుందని కమిటీ సూచించింది. ఈ ఈ కమిటీ సూచనల ప్రకారమే ప్రభుత్వం 1986లో బాలకార్మిక వ్యవస్థ (నిషేధం, నియంత్రణ) చట్టం రూపొందించింది. ఈ చట్టం ప్రకారం గనుల తవ్వకం, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు పలకల తయారీ మొదలైన రంగాల్లో బాలకార్మికులను పనిలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరమని, ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఆ వ్యవక్తులు లేదా సంస్థలకు జరిమానా, జైలుశిక్ష విధించడానికి అవకాశం కల్పించింది. 

బాలకార్మికులకు దశల వారీగా పునరావాసం కల్పించి, బాల కార్మిక వ్యవస్థ నిధ చట్టాన్ని సక్రమంగా అమలు పరిచేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం 1987లో ఒక జాతీయ విధాన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది. ఇందులో భాగంగానే 1988లో జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టును తొమ్మిది జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ వ్యవస్థ నుంచి బయటపడిన బాలల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించడం, వారికి వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తూ ఉపకారవేతనాలందించటం, క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం మొదలైనవి ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించడం జరిగింది. 

Must Read :  బాలకార్మిక వ్యవస్థ (Child Labour System)

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం మార్చి, 2007లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్)ను ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల లోపు బాలల హక్కుల రక్షణ, వారికి సేవలందిస్తున్న సంస్థల పర్యవేక్షణ, బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు, సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం మొదలైనవి ఈ కమిషన్ విధులు. 

విద్యా హక్కు చట్టం (Right to Education Act)

ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ప్రాథమిక విద్యను కాస్తా ప్రాథమిక హక్కుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి అందుకుగాను 2009లో విద్యా హక్కు చట్టం (Right to Education Act) చేసింది. ఈ చట్టానికి సంబంధించి రాజ్యాంగంలో 21(ఎ) అధికరణను కూడా చేర్చడం జరిగింది. విద్యాహక్కు చట్టం (Right to Education Act) ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన కారణాల కారణంగా బాలలు తమ ప్రాథమిక విద్యకు దూరం కాకూడదని ఈ చట్టం స్పష్టం పరిచింది. 

బాలల కొరకు చేయబడిన రాజ్యాంగ రక్షణలు 

  • అధికరణ 15(3) ప్రకారం మహిళలు, బాలల సంక్షేమానికి తగు ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. 
  • అధికరణ  21(ఎ) ప్రకారం 6-14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
  • అధికరణ 23(1) ప్రకారం బాలలను విక్రయించడం లేదా కొనడం, వారిని భిక్షాటనకు ఉపయోగించడం చట్టరీత్యా నేరం.
  • అధికరణ 24 ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలను ప్రమాదకర పనిలో నియమించుకోవడం నిషిద్ధం. 
  • అధికరణ 39(ఇ) ప్రకారం బాలల ఆరోగ్యం, శ్రమ దుర్వినియోగం కాకుండా వారు శక్తికి మించిన పనుల్లో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 
  • అధికరణ 39(ఎఫ్) ప్రకారం బాలల ఆరోగ్య పరిరక్షణకు ఆటంకం కలిగించే పరిస్థితులు లేకుండా చూడాలి. వారు సాంఘిక నేరాలకు పాల్పడకుండా, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలి. 
  • అధికరణ 45 ప్రకారం (0-6 ఏళ్ల బాలలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యాభ్యాస వసతులు కల్పించాలి. 
  • అధికరణ 46 ప్రకారం షెడ్యూల్ కులాలు, తెగల బాలల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 
  • అధికరణ 47 ప్రకారం ప్రభుత్వం బాలలకు పౌష్టికాహారం అందించాలి. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలి. 
  • అధికరణ 243 (జి) ప్రకారం బాలల సంరక్షణను సంస్థాగతం చేయడం.