భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులలో అంతర్గతంగా స్త్రీలకు సంబంధించి కొన్ని ప్రత్యేక హక్కులను పొందుపరచడం జరిగింది. వీటి ద్వారా స్త్రీలు తమకు లభించాల్సిన హక్కుల్ని వ్యక్తిగతంగా అనుభవించేందుకు వీలు కల్పించారు. వీటికి సంబంధించి ఏదైనా సమస్యలుత్పన్నమయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా స్త్రీలకు కలదు.
15 (3) ననుసరించి స్త్రీలు, శిశువుల సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలను చట్టరీత్యా కల్పించవచ్చు. కొన్నింటిని నిషేధించవచ్చు కూడా.
15(3) మరియు (4) నిబంధనలు స్త్రీలకు ప్రత్యేక చట్టాలను రూపొందించటానికి తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి:
1. స్త్రీలకు విద్యా సంస్థలలో కల్పించిన 30% ప్రత్యేక కేటాయింపు. స్త్రీ పురుషుల మధ్య సమాజంలో సమానత్వం కావాలంటే స్త్రీ పురుషులతో సమానంగా విద్యా వంతురాలై ఉండాలి. స్త్రీలు విద్యలో పురుషులకన్నా వెనుకబడి ఉండడంచేత వారి విద్యావకాశాలను మెరుగు పరచడానికి రాజ్యాంగం ద్వారా స్త్రీలకు ఏర్పరచిన ప్రత్యేక హక్కు ఇది. 2. కేవలం విద్యా సంస్థలలో మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా స్త్రీ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలు ఏర్పరచబడ్డాయి. ఉదా: ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, తోటల చట్టం మొదలైన కార్మిక సంక్షేమ చట్టాల కింద స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పరచబడ్డాయి. ఈ విధంగా ప్రత్యేక రక్షణతో బాటు ఉద్యోగాలలో సమాన ఆర్హతను ఇవ్వడానికి కూడా ఈ నిబంధన దోహదం చేసింది.
Must Read : మహిళల రక్షణ (Women Protection)
15వ నిబంధన ద్వారా స్త్రీలు, శిశువులు, వెనుకబడిన షెడ్యూల్డు కులాలు, తెగలు వెనుకబడ్డ తనాన్ని నిర్మూలించి వారిని పైకి తెచ్చే వారికి రిజర్వేషన్లు కల్పించే పద్ధతిని రాజ్యాంగం ఆమోదించినట్లయింది.
స్త్రీల విషయంలో స్త్రీలు మాత్రమే పని చేసే ఉద్యోగాలు ఉదా : మహిళా పోలీసు, ఎయిర్ హోస్టెస్, లేడి డాక్టర్ల వంటి ఉద్యోగాలను కల్పించవచ్చు.
స్వేచ్ఛ హక్కు (నిబంధన 19 నుంచి 22 వరకు)
నాలుగు నిబంధనలలో నాలుగు హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. అవి.
1.ఆరు స్వాతంత్ర్యాలు - (నిబంధన 19)
ఎ) వాక్ స్వాతంత్ర్యం - భావప్రకటనా స్వేచ్చ
బి) సమావేశమవడానికి స్వాతంత్ర్యం
సి) సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
డి) సంచార స్వేచ్ఛ
ఇ) స్థిర నివాసమేర్పరచుకోవడానికి స్వేచ్ఛ
ఎఫ్) ఇష్టమైన వృత్తి, వాణిజ్య వ్యాపారాలను అనుసరించడానికి స్వేచ్ఛ
2. నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు (నిబంధన 20)
3. వ్యక్తిగత ప్రాణానికి, స్వేచ్ఛకు రక్షణ (నిబంధన 21)
4. నిగ్రహణ, నిర్బంధం నుంచి రక్షణ (నిబంధన 22)
భావ ప్రకటనా స్వేచ్ఛ పౌరులందరికీ ఉన్నప్పటికీ, కొన్ని హేతుబద్ధమైన నిర్బంధాలను కూడా ప్రభుత్వం విధించవచ్చు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉండే అశ్లీల, అసభ్య చిత్రాలు, సినిమా పోస్టర్లు, సాహిత్యంపై నిర్బంధం విధించవచ్చు. స్వేచ్ఛ హక్కు ఆధారంగా భారత మహిళ అన్ని రకాల స్వేచ్ఛను పొందగలుగుతున్నది. స్త్రీలు భావ ప్రకటనా స్వాతంత్ర్యంతో బాటు, ఇష్టమైన, సంఘాలలో సభ్యత్వం పొందడానికి, సమావేశాలు నిర్వహించడానికి, ఇష్టమైన ప్రదేశాలలో సంచరించడానికి హక్కులను పొందారు.
స్వేచ్ఛ హక్కు ద్వారా భారత మహిళ తనకు నచ్చిన వృత్తిని స్వీకరించడానికి, ఇష్టమైన వ్యాపార వాణిజ్యాలను చేసుకోవ డానికి హక్కును కలిగి ఉంది. ఈ స్వేచ్ఛ ఆధారంగానే నేటి భారత మహిళ అంతకుముందు స్త్రీలు అనర్హులు అని భావించబడే అనేక ఉద్యోగాలూ, వ్యాపారాలలో ప్రవేశించగలుగు తున్నది. పరిపాలనారంగంలో అన్ని ముఖ్య విభాగాలలో స్త్రీలు ఉన్నత స్థానాలలో ఉన్నారు. ఎంతో మంది స్త్రీలు జిల్లా కలెక్టర్లుగా, కమిషనర్లుగా బాధ్యతాయుతమైన పదవులను చేపడుతున్నారు.
స్వేచ్ఛ హక్కు ద్వారా స్త్రీలతో సహా పౌరులందరికీ ప్రాణానికి రక్షణ కల్పించడం వల్ల స్త్రీ బయటి ప్రపంచం నుంచి రక్షణ పొందడమేకాక, కుటుంబంలో భర్తకాని, అత్తమామలుగాని తనను హింసకు గురిచేసిన, దౌర్జన్యం చేసినా సేచ్ఛగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయాన్ని పొందగలుగుతున్నది. వరకట్న సమస్య అధికమై అనేక మంది స్త్రీలు వరకట్న చావుకు గురి అవుతున్న నేటి సమాజంలో ఈ హక్కు స్త్రీకి ఎంతో రక్షణ కలిగిస్తున్నది.
Must Read : మహిళల రక్షణ (Women Protection)
పీడనాన్ని నిరోధించే హక్కు (నిబంధన 23-24)
ఈ నిబంధనల ప్రకారం స్త్రీలు, శిశువుల అమ్మకం, నిర్బంధంగా అవమానకరమైన పనులను ప్రోత్సాహించడం, వెట్టి చాకిరి, వ్యభిచారం, దేవదాసీ లేక జోగినీ పద్ధతులు నేరాలు. మన దేశంలో అమెరికాలో వలె బానిసత్వం లేకపోయినా తరతరాలుగా భూస్వాముల కింద వెట్టి చాకిరి పద్ధతి అమలులో ఉంది. అస్పృశ్యతవలె ఇవి కూడా సాంఘిక దురాచారాలే. ప్రస్తావనలో పేర్కొన్న ఆదర్శాలకనుగుణంగా ఈ హక్కును రూపొందించడం జరిగింది.
1956 లో స్త్రీలు బాలికల అవనీతి వ్యాపార నిరోధక చట్టం, 1975 పెట్టి చాకిరీ నిరోధక చట్టాల ద్వారా ఈ దురాచారాలను రూపుమాపే యత్నం జరుగుతున్నది. ఈ హక్కు కింద ఒక వ్యక్తి లేదా ఇంకొక వ్యక్తి లేదా వ్యక్తులను అవమాన కరమైన పనులకు ప్రోత్సాహించడం కూడా నేరమే.
24వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలను కర్మాగారాలు, గనులు మొదలైన శారీరక శ్రమతో కూడిన పనులలో ఉంచరాదు. ఇది నిర్దేశ నియమాలలో 45వ నిబంధన-14 సంవత్సరాల బాలబాలికలకు నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్యా సౌకర్యం కల్పించాలి అనుదానికి అనుగుణంగా ఉంది. ఈ నిబంధన రాజ్యాంగం అమలుకు రాక పూర్వం కూడా అమలులో ఉన్నది. ఉదా : ఆనాటి చట్టాలు - బాలబాలికల చట్టం 1938, కర్మాగారాల చట్టం 1948 మొదలయినవి.
మతస్వేచ్చ హక్కు - (నిబంధన 25 నుంచి 28)
ఈ హక్కు కింద ప్రతీ భారత పౌరునికి తన ఇష్టమైన మతాన్ని అవలంబించడానికి, మతాచారాలను పాటించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. అయితే ఈ స్వేచ్ఛ శాంతి భద్రతలు, నైతిక విలువలు ప్రజారోగ్య రక్షణకు హాని కలిగించని విధంగా అనుభవించవచ్చు. ప్రత్యేక వివాహ చట్టం 1872 ప్రకారం ఒక స్త్రీ మరొక మతానికి చెందిన వ్యక్తిని వివాహ మాడినా తన మతాన్ని మార్చుకోనక్కరలేదు.
రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32)
ఇది ప్రాథమిక హక్కులను కాపాడడానికై హక్కు డా.బి.ఆర్. అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత గల హక్కుగా పేర్కొన్నాడు. ఈ నిబంధన రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ హృదయం వంటిదని భావించాడు. ప్రాథమిక హక్కుల రూపంలో తనకు ఇవ్వబడిన అవకాశా లకూ, హక్కులకూ ఎటువంటి ఆటంకం కలిగినా భారత స్త్రీ తన హక్కుల పరిరక్షణ కోసం కోర్టుకు వెళ్ళవచ్చు.
నిబంధన 39:
ఎ) స్త్రీ పురుషులందరికీ వ్యత్యాసం లేకుండా సమానంగా జీవనోపాధిని కల్పించడం
బి) బాలబాలికలు, యువకులు వారి ఆరోగ్యానికి సరిపడని పనులు చేయడాన్ని నివారించడం. నిబంధన41 నిరుద్యోగులకూ, వృద్ధులకూ, వికలాంగులకూ జీవన భృతిని కల్పించడం మొదలైన ఈ నిబంధన కింద నిరుద్యోగి, నిస్సహాయురాలైన స్త్రీ తనకు జీవనాధారం చూపించమని అడిగే హక్కు ఉన్నది. అంతే కాకుండా స్త్రీకి నియమబద్ధమైన, న్యాయబద్ధమైన పనిని అడిగే హక్కు కూడా ఉన్నది.
Must Read : మహిళల రక్షణ (Women Protection)
నిబంధన 42
కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రసూతి సదుపాయాల చట్టం 1961 ఈ నిబంధన కింద రూపొందించబడింది.
నిబంధన 45
జ్యాంగం అమలులోకి వచ్చింది మొదలు కొని 10 సంవత్సరములలోగా 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయడం.
నిబంధన 51 స్త్రీ గౌరవానికి భంగకరమయిన ఏ చర్యలకు పాల్పడకుండా చూడడం కోసం భారత శిక్షాస్మృతి సెక్షను 354 లో స్త్రీల గౌరవానికి భంగం కలిగించే చర్యలను నేరంగా పరిగణించారు. అంతే కాకుండా స్త్రీ అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం 1986 వ్యభిచార నిరోధక చట్టం మొదలైన చట్టాలను కూడా రూపొందించి సమాజంలో స్త్రీ గౌరవాన్ని పెంపొందించు టకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది.
నిర్దేశక నియమాలను ఆధారంగా చేసుకొని పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా సమాన వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం 1976 లో సమాన వేతన చట్టాన్ని, 1961లో మాతృత్వ సదుపాయాల చట్టాన్ని రూపొందించింది. భారతదేశ జనాభాలో ఇంచుమించుగా సగం వున్న మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పించింది.
రాజ్యాంగంలోని 15వ నిబంధన ప్రకారం పౌరుల మధ్య జాతి, కుల, మత, లింగ, జన్మసంబంధమైన విచక్షణాలు చూపరాదు. అయితే అదే నిబంధన (3) ప్రకారం స్త్రీలు, శిశువులు సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలు కలుగజేస్తున్నది. తనకు కేటాయించిన ప్రత్యేక సదుపాయాలను ఎవరయినా ఆటంకపరిస్తే స్త్రీ 32 వ నిబంధనను అనుసరించి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
Pages