భారతదేశములో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. భారత దేశంలో న్యాయ నిర్వహణనే కాకుండా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా సుప్రీంకోర్టుదే. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా మొదటిసారిగా భారతదేశంలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. 1950లో భారత రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఫెడరల్ కోర్టును భారత సుప్రీంకోర్టుగా మార్చడం జరిగింది. 32వ రాజ్యాంగ ప్రకరణ ప్రకారము సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ద్వారా ఏర్పరచబడినటువంటి ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. భారత సుప్రీంకోర్టులో ప్రస్తుతము ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించే అధికారం భారత పార్లమెంటుకు కలదు. మొదటి సారి 1956లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 8 నుండి 11కు పెంచారు. ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నియామకము భారత ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ నియామకము ముందు రాష్ట్రపతి సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించవచ్చును. ఇతర న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది. 

అర్హతలు:

భారత రాజ్యాంగంలో 124(3) ప్రకరణను అనుసరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ క్రింది అర్హతలు ఉండవలెను. 1. భారత పౌరుడై ఉండవలెను. 2. కనీసం 5 సంవత్సరములు హైకోర్టు న్యాయమూర్తిగాను లేదా 10 సంవత్సరములు హైకోర్టు నాయ్యవాదిగాను పనిచేసి ఉండవలెను. 3. రాష్ట్రపతి దృష్టిలో ఒక గొప్ప న్యాయవాదిగా పేరుపొంది ఉండవలెను. 

పదవీ కాలము:

సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమింపబడు వ్యక్తి కనీస వయస్సును రాజ్యాంగం పేర్కొనలేదు. అంటే పేర్కొన్న అర్హతలను బట్టి వయస్సు ఎంతైనప్పటికి అతనిని న్యాయమూర్తిగా నియమించవచ్చును. అయితే న్యాయమూర్తిగా నియమింపబడిన తరువాత అతడు పలు విధములుగా పదవీ విరమణ చేయగలడు. 1. వయస్సు 65 సంవత్సరములు నిండగానే పదవీ విరమణ చేయవచ్చు. 2. రాజీనామా చేయుట ద్వారా వైదొలగవచ్చు. తన రాజీనామాను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. 3. పార్లమెంటులో అభిశంసన తీర్మానం ద్వారా రాష్ట్రపతి న్యాయమూర్తిని తొలగించవచ్చును. 

జీతభత్యాలు 

ప్రధాన న్యాయమూర్తి జీతము 2,80,000, న్యాయమూర్తి జీతము రూ. 2,50,000. ఇవిగాక ఇతర అలవెన్స్ లు ఉంటాయి. ఈ న్యాయమూర్తుల జీతభత్యాలను ఒక్క ఆర్థిక అత్యవసర పరిస్థితులలో తప్ప తగ్గించుటకు వీలులేదు.

అధికార పరిధి :

సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి మూడు విధాలుగా ఉంటుంది. 1. నిజ అధికార పరిధి 2. ఆప్పీళ్ళ విచారణాధికార పరిధి, 3. సలహారూపక అధికార పరిధి. ఇవిగాక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్లు జారీచేయు అధికారము కూడా సుప్రీంకోర్టుకు కలదు. 

నిజ అధికార పరిధి:

నిజ అధిర పరిధి అనగా ఒక వివాదాన్ని నేరుగా వినుట మరియు దానిపై తీర్పు ఇచ్చుట అనే అధికారము కలిగి ఉండటం. రాజ్యాంగంలోని 131 ప్రకరణను అనుసరించి పలు విషయాలలో సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికార పరిధిని కలిగి ఉంటుంది. అవి - భారత ప్రభుత్వానికి, ఒకటి అంతకన్న ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలు. భారత ప్రభుత్వము, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు - మరికొన్ని రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు.రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు. ఒక ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వముపై చేసే ఆరోపణలు ఈ అధికార పరిధిలోకి రావు. అంతేగాక అంతర్జాతీయ ఒడంబడికలు కూడా ఈ అధికార పరిధిలోకి రావు. రాజ్యాంగము రాష్ట్రాల మధ్య ఏర్పడే కొన్ని వివాదాలను నిజ అధికార పరిధిలో చేర్చలేదు. 

అప్పీళ్ళ విచారణాధికార పరిధి:

భారత దేశములో అప్పీళ్ళ పై తీర్పునిచ్చే అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఇది సివిల్ కేసులు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అప్పీళ్ళను స్వీకరిస్తుంది.. ఇవి రెండేగాక రాజ్యాంగపరమైన కేసుల తీర్పులపై కూడా సుప్రీంకోర్టు అప్పీళ్ళను స్వీకరిస్తుంది. సివిల్ కేసులలో హైకోర్టునుండి సుప్రీంకోర్టుకు అప్పీళ్ళు చేయటానికి ముందుగా ఆ కేసులను హైకోర్టుచే ధ్రువీకరణ చేయించాలి. హైకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించిన తరువాతనే ధృవీకరణ చేస్తుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులపై అప్పీళ్ళ విచారణాధికారము కూడా కొన్ని విషయములలోనే కలిగి ఉంటుంది. క్రిందస్థాయి కోర్టు నిందితుడిని నేరస్థుడు కాదని ఇచ్చిన తీర్పును హైకోర్టు వ్యతిరేకించి అతనికి మరణ శిక్ష విధించినప్పుడు, క్రిందిస్థాయి కోర్టులో విచారణలో ఉన్న కేసును హైకోర్టు తను బదలాయించుకొని నిందితుడికి మరణ విక్ష విధించినప్పుడు. హైకోర్టు ధృవీకరణ చేసినపుడు రాజ్యాంగములోని 132 వ ప్రకరణను అనుసరించి హైకోర్టులు ఇచ్చిన తీర్పులలో రాజ్యాంగపరమైన విషయములు ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు తనంత తానుగా ఆ కేసును తనకు బదలాయించు కొనవచ్చును. ఇంతేగాక హైకోర్టులు తమ వద్దకు వచ్చిన కేసులను రాజ్యాంగ విషయములను చర్చించేవిగా ఉన్నట్లు గుర్తించినప్పుడు, ఆ మేరకు ధృవీకరించినచో వాటిని సుప్రీంకోర్టు అప్పీళ్ళుగా స్వీకరిస్తుంది.

సలహారూపక అధికార పరిధి:

రాజ్యాంగంలోని 143 ప్రకరణను అనుసరించి రాష్ట్రపతి దేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుటలోగాని, శాసనాలను రూపొందించుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుగాని, న్యాయ సంబంధమైన అంశము ప్రాధాన్యతకలిగి ఉందని భావించినపుడు గాని, అతడు సుప్రీంకోర్టు యొక్క సలహాను కొరవచ్చును. సుప్రీంకోర్టు రాష్ట్రపతిచే ఇవ్వబడిన విషయమును పరిశీలించి తన నిర్ణయాన్ని తెలుపుతుంది. అయితే సుప్రీంకోర్టు వెల్లడించిన ఈ నిర్ణయం రాష్ట్రపతిపై నిర్బంధము కాదు. అనగా రాష్ట్రపతి ఆ సలహాను అనుసరించవచ్చు లేదా త్రోసిపుచ్చవచ్చు.

సంబంధిత అంశాలు : హైకోర్టు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించినప్పటికి, న్యాయమూర్తి రాష్ట్రపతియొక్క ఆమోదం ఉన్నంత వరకే పనిచేయవలెనని నిబంధన లేదు. అనగా ఇతర అధికారులవలె న్యాయమూర్తిని రాష్ట్రపతి తన అభీష్టానుసారము తొలగించలేడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి 65 సంవత్సరములు నిండేవరకు తన పదవిలోనే ఉంటాడు. ఈ లోపు న్యాయమూర్తిని తొలగించవలెనన్న కేవలం అభిశంసన తీర్మానం ఒక్కటే మార్గము. అభిశంసన తీర్మానము పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదింపబడాలి. న్యాయమూర్తి పదవిలో ఉన్నంతవరకు అతని జీత భత్యములను ఒక్క ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప తగ్గించుటకు వీలులేదు. న్యాయమూర్తుల జీతాలు మరియు పాలనాపరమైన వ్యయములు భారత సంఘటిత నిధి నుండి ఇవ్వబడతాయి. ఈ వ్యయము పార్లమెంటులో చర్చించబడదు మరియు ఓటు చేయబడదు. న్యాయాధిపతుల తీర్పులలోని మంచి, చెడులను శాసనసభలలో చర్చించుటకు వీలులేదు. అలాగే న్యాయమూర్తుల నడవడిని శాసనసభలలో అభిశంసన తీర్మానాన్ని పరిశీలిస్తున్నప్పుడు తప్ప చర్చించుటకు వీలులేదు. న్యాయమూర్తులకు కోర్టు ధిక్కరణ క్రింద ఎవరినైనా శిక్షించే అధికారముంది. పదవీ విరమణ చేసిన తరువాత ఏ ప్రభుత్వ ఉద్యోగము చేయకూడదు, సుప్రీంకోర్టులోగాని, రాష్ట్ర హైకోర్టులలోగాని, న్యాయవాదిగా కూడా పనిచేయకూడదు. అయితే వారిని విచారణ సంఘాల అధ్యక్షులుగా నియమించవచ్చును.