భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 1885 నుంచి 1905 వరకు గల కాలాన్ని మితవాద యుగం అంటారు. మితవాదులు విదేశీ పరిపాలనా విధానంపై నమ్మకం ఉంచుతూనే, వలసవాదుల ఆర్థిక దోపిడీ విధానాన్ని బహిర్గత పరిచారు. రాజకీయ సంస్కరణలకు పాటుపడి, మేధావులకే పరిమితమైన, ప్రజాస్వామ్య భావనలను పెంపొందించి, తదనంతర రాజకీయ పోరాటానికి పునాదులు వేశారు. మితవాద యుగంలో కాంగ్రెస్ పార్టీ విద్యాధికులైన మేధావివర్గం, భూస్వామ్య వర్గం, స్వదేశీ పెట్టుబడుదారుల అధీనంలో ఉండేది. దాదాభాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైనవారు మితవాద నాయకులలో ప్రముఖులు. 

మితవాదులు కొన్ని లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని వాటికి అనుగుణంగా తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో ముఖ్యమైనవి - న్యాయ, కార్యనిర్వాహక శాఖలను వేరుచేయడం మనదేశం నుంచి ఇంగ్లండ్ కు సంపద తరలింపును ఆపడం; భారతీయులకు ఉద్యోగ అవకాశాలు పెంచి, జాతి వచక్షణ లేకుండా ఆంగ్లేయులతో సమానంగా చూడటం; కేంద్ర, ప్రాంతీయ శాసనసభల్లో ఎక్కువమంది భారతీయులకు ప్రాతినధ్యం కల్పించి, అధికారాలు ఇప్పించడం; సివిల్ సర్వీస్ పోటీ పరీక్షల్లో వయో పరిమితిని పెంచడం; దేశంలో ఉద్యోగ కల్పనల కోసం ఆధునిక పరిశ్రమలను నెలకొల్పి, కుటీర పరిశ్రమలను పునరుద్ధరించడం; కరువు కాటకాలు సంభవించినప్పుడు రుణ సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వంటి నిర్దేశిత లక్ష్యాలతో మితవాదులు పనిచేసేవారు. 

సంబంధిత అంశాలు :  అతివాదయుగం (1905-1919) 

మితవాదులు తమ లక్ష్య సాధన దిశగా ప్రయాణంలో భాగంగా కొన్ని నిర్దిష్టమైన నియమాలను అనుసరించేవారు. రాజ్యాంగబద్దమైన ఆందోళన చేయడం, సమావేశాలు; ప్రసంగాలు, తీర్మానాలు, విజ్ఞప్తులు చేయడం; శాంతియుత, రక్తరహిత పోరాటం చేయడం; విద్యావంతులైన వారినే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం; ఆకస్మికంగా కాకుండా సుదీర్ఘంగా, దశలవారీ క్రమంలో స్వపరిపాలన సాధించుకోవడం మొదలైనవి. 

జాతీయోద్యమంపై మితవాదుల ప్రభావం అమితంగా గలదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు: బ్రిటిష్ ఆర్దిక దోపిడీని ప్రపంచానికి విశదపరిచారు; సివిల్ సర్వీసెస్ పరీక్షలు రసేవారి వయో పరిమితిని పెంచగలిగారు; 1892 భారత శాసనసభల చట్టాన్ని ఆమోదింపజేసి, భారతీయులకు అందులో అవకాశం పెంచారు; 1904 కలకత్తా యూనివర్సిటీ చట్టం, 1904 కలకత్తా కార్పొరేషన్ చట్టం రద్దు చేయించారు; భారతీయులందరికీ ఒక జాతీయ రాజకీయ పార్టీని అందించారు; ప్రజాస్వామ్యం, జాతీయవాద భావనలను ప్రచారం చేశారు; రాబోయే స్వాతంత్రోద్యమానికి పునాదులు వేశారు. 

మితవాదులు ఎంత ప్రయత్నించిని కొన్ని విషయాలలో వైఫల్యాలను కూడా చవిచూశారు. వీరు ఉద్యమాన్ని కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే పరిమితం చేయడంతో ఉన్నత వర్గాలు జాతీయోద్యమానికి దూరమవడం జరిగింది. బ్రిటిషర్ల వాస్తవ స్వభావాన్ని గ్రహించడంలో మితవాదులు విఫలమయ్యారని చెప్పవచ్చును. జాతీయ భావాలు బలంగా విస్తరిస్తున్న కాలంలో సామాన్య ప్రజానీకానికి దూరమైనా, వలస పాలకుల వాస్తవ స్వభావాన్ని గ్రహించడంలో విఫలమైనా వీరి అనంతర కాలంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి మితవాదులు ఒక చక్కటి మార్గనిర్దేశంగా నిలిచారు.