భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 1905 నుంచి 1919 వరకు గల కాలాన్ని అతివాదయుగం అంటారు. ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలు వంటి మితవాద పద్ధతుల ద్వారా ఆశించిన విజయాలు సాధించకపోవడంతో విసుగుచెందిన నాయకుల నుండి అతివాదులు ఉద్భవించారు. విదేశీ బహిష్కరణకు నిశ్చయించి, స్వదేశీ ఉద్యమాన్ని సమరోత్సాహంతో నడిపినవారు అతివాదులు. అరబింద ఘోష్, లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ అతివాద నాయకుల్లో ముఖ్యులు. 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం జాతీయవాదులను పూర్తిగా నిరుత్సాహ పరిచింది. కౌన్సిల్ లో ఉద్దండులైన గోపాలకృష్ణ గోఖలే, రాశ్ బిహార్ ఘోష్ మొదలైన వారు ఉన్నా, బ్రిటీష్ ప్రభుత్వ చర్యలను నిలువరించలేకపోయారు.

భారతదేశం నుంచి ఇంగ్లండ్ కు ఎగుమతి అవుతున్న వస్త్రాలపై సుంకాలను అధికం చేసి, మన దేశానికి ఇంగ్లండ్ నుంచి దిగుమతయ్యే వస్త్రాలపై సుంకాన్ని తొలగించడం వల్ల దేశ వస్త్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. 1896 నుంచి 1900 వరకు దేశంలో క్షామం సంభవించినా, లార్డ్ కర్జన్ క్షామ నివారణ చేపట్టకుండా రాజదర్బారు నిర్వహించారు. కర్జన్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అధికార రహస్యాల చట్టం, కలకత్తా కార్పొరేషన్ చట్టం, భారత విశ్వవిద్యాలయాల చట్టం అతడి నియంతృత్వానికి నిదర్శనం. పరిపాలనా సౌలభ్యం కోసం లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను చేపట్టినట్లు చెప్పినా, అంతర్లీనంగా, ఉద్ధృతమౌతున్న జాతీయోద్యమాన్ని అణచివేసేందుకే బెంగాల్ విభజన చేశారని ప్రజలు తెలుసుకున్నారు. అరవింద్ ఘోష్ 'ఇందూ ప్రకాశ్'కు 'న్యూల్యాంప్స్ ఫర్ ఓల్డ్' అనే శీర్షికతో రాసిన వ్యసాల్లో ప్రార్ధనలు, వినతి పత్రాలతో భారత జాతీయ కాంగ్రెస్ ఇంతవరకూ ఏమీ సాధించలేదని, రక్త ధారలతోనే మాతృభూమికి విముక్తి కలుగుతుందని, దానికోసం ప్రజలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత అంశాలు :  మితవాద యుగం (1885-1905) 

అతివాద వర్గంలో ప్రముఖులైన లాలాలజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర తిలక్ జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా జాతీయోద్యమ చరిత్రలో చెరగని ముద్రవేశారు. భారతీయులకు కావాల్సింది స్వరాజ్యమే గానీ, సాలనా సంస్కరణలు కాదని బాలగంగాధర తిలక్ స్పష్టంగా ప్రకటించాడు. బిపిన్ చంద్ర పాల్, విద్యార్ధులను, యువకులను అయస్కాంతంలా ఆకర్షించి, స్వదేశం పట్ల ప్రగాఢ విశ్వాసం, స్వాతంత్ర్య సముపార్జనకోసం తీవ్రమైన ఆకాంక్ష పెంపొందించాడు. ఇటాలియన్లపై 1896లో అబిసీనియన్లు సాధించిన విజయం ఈజిప్ట్, పర్షియా మొదలైన దేశాల్లో సాగుతున్న జాతీయ పోరాటాలు, 1905లో జపాన్ చేతిలో రష్యా ఓటమి వంటి అంశాలు భారతీయులకు స్పూర్తినిచ్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1896లో జాతీయవాదం ప్రబోధించడాన్ని నేరంగా ప్రకటించింది. జాతీయవాదాన్ని ప్రబోధించినందుకు తిలతో పాటు మరికొందరు సంపాదకులకు జైలు శిక్ష విధించింది. ఆంగ్లేయ విద్యావిధానం ద్వారా భారతీయులు పాశ్చాత్య భావాలైన ప్రజాస్వామ్యం, జాతీయ వాదాలను తెలుసుకున్నారు. విద్యావంతులైన నిరుద్యోగులు, నిరుద్యోగ సమస్య ఆంగ్లేయుల ద్వారా పరిష్కారం కాదని గ్రహించారు. ప్రాథమిక, సాంకేతిక విద్యలో ప్రగతి లేకపోవడం బ్రిటిష్ ప్రభుత్వంపై అసంతృప్తిని రగిల్చింది. 

లార్డ్ కర్జన్ బెంగాల్ ను విభజించడం, దాన్ని ఆపడంలో మితవాదులు ఓడిపోవడంతో మితవాదుల వలన స్వాతంత్ర్యం సిద్ధించదనే భావన నాయకులలో తీవ్రంగా నాటుకుని అతివాద ఆవిర్భావానికి కారణమైనది. అతివాదుల ఉద్దేశ్యంలో స్వరాజ్య సంపాదన అంటే తమ దేశ పాలనలో భాగస్వామ్యం కాదు. సంపూర్ణ స్వయం ప్రతిపత్తి. దీన్ని దశలవారీగా కాకుండా, వీలైనంత త్వరగా సాధించాలని సంకల్పించారు. గ్రామాలను సాంఘికంగా, ఆర్థికంగా పునరుద్ధరించడం; జాతీయ విద్యను ప్రోత్సహించి, అభివృద్ధి చేయడం స్వదేశీ పరిశ్రమల స్థాపన ద్వారా జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం; సామాన్య ప్రజలను రాజకీయాల్లో భాగస్వాములుగా చేయడం వంటి విధాన పరమైన అంశాలను తమ ఉద్యమానికి జోడించారు. అంతేకాకుండా అతివాదులు విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను మాత్రమే వాడటం. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాలను బహిష్కరించి, జాతీయ విద్యాలయాలను స్థాపించడం; ఆంగ్లేయులు స్థాపించిన న్యాయస్థానాలను బహిష్కరించి, పంచాయితీలను స్థాపించడం; సహాయనిరాకరణలో భాగంగా పన్నుల చెల్లింపు మానివేయడం; ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం; సంవత్సరం పొడవునా సమావేశాలు, ఊరేగింపులు జరిపి పరిపాలనా విధానాన్ని ఖండిస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం; సామాన్య ప్రజల సహకారం కోసం మేధావులు, సంఘ సంస్కర్తలు గ్రామాలకు వెళ్లి, ప్రజలతో సంబంధాలు పెట్టుకొని, కష్టాలు నిర్మూలించడం; జాతీయోద్యమ శిక్షణ కోసం స్వచ్ఛంద సమితులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజల మనసులను చూరగొన్నారు.

అతివాదుల కాలంలో ప్రధాన సంఘటనలు 

అతివాదులు 1905లో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం(వందేమాతర ఉద్యమం) నడిపారు. 1907లో సూరత్ లో జరిగిన భారత్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ ఉద్యమాన్ని నడిపే విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడి కాంగ్రెస్ లో చీలికలు ఏర్పడటం. 1916 లక్నో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు, అతివాదుల కలయిక, కాంగ్రెస్, ముస్లింలీగ్ కలిసి జాతీయోద్యమం నడపడం. 1916లో హోంరూల్ ఉద్యమం నడపడం. స్వరాజ్యం లేదా స్వాతంత్ర్యం ప్రతి భారతీయుడి జన్మహక్కుగా అతివాదులు ప్రప్రథమంగా డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో సాధారణ ప్రజల ప్రమేయం ఉండాలని వాదించి, జాతీయోద్యమానికి సామాజిక ప్రాతిపదికను విస్త్రుతపరిచిన ఘనత అతివాదులదే. జాతీయ పోరాట స్వరూపంలో పలు చెప్పుకోదగిన మార్పులు తెచ్చారు. ప్రభుత్వాన్ని ధిక్కరించడం, జైళ్లకు వెళ్లడమే కాకుండా జనసమీకరణకు వినూత్న పద్ధతులను ఉపయోగించి తరువాత కాలంలే జరిగిన స్వాతంత్రోద్యమానికి పటిష్టమైన పునాదులు వేసిన ఘనత అతివాదులదే.