తెలంగాణ - ఉనికి - నైసర్గిక స్వరూపం

దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా 1,14,840 చ.కి.మీ. వైశాల్యంతో 12వ స్థానాన్ని కలిగి, దేశ విస్తీర్ణంలో తెలంగాణ భూభాగం 3.49 శాతం ఆక్రమించింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో దక్షిణ ద్వీపకల్ప భూభాగంలో 15°50' నుంచి 19°50' ఉత్తర అక్షాంశాల మధ్య, 77°15 నుంచి 810501 తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. రాష్ట్రానికి ఉత్తరాన ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలు, దక్షిణ, తూర్పు దిక్కుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నాయి. 

గోండ్వానా శిలలు

తెలంగాణ విభిన్నమైన భౌమ స్వరూపాలకు నిలయం. అనేక కోట్ల సంవత్సరాల కిందట భూకంపాల వలన, లావా వెలుపలికి వచ్చి కాలానుగుణంగా చల్లబడి ఘనీభవించింది. తద్వారా కొండలు, గుట్టలు, పీఠభూమి మొదలైన లక్షణాలతో తెంగాణణ ప్రాంత భూ ఉపరితలం ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల గ్రానైట్ శిలా శైథిల్య ప్రభావంవల్ల టార్స్, బోల్డర్స్ ఆకారాలతో కొండలు కనిపిస్తాయి. బసాల్ట్ లావాతో ఏర్పడిన పెనిప్లేన్ రంగారెడ్డి-మహబూబ్ నగర్ మధ్యన 600-900 మీటర్ల ఎత్తున కనిపిస్తాయి. గ్రానైట్, నీస్ శిలా మిశ్రమాలతో దక్కను పీఠభూమిలో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి నది వెంట అనేక గోండ్వానా శిలలు బొగ్గు నిల్వలతో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా గోధుమ రంగు కొండలతో, రుతుపవన ఆధారిత నదులతో, చెరువులతో కూడి ఉంది. క్రమానుగుణంగా విపరీత శీతోష్ణస్థితులతో అడవులు తగ్గిపోయి, శుష్క పరిస్థితి ఏర్పడి ఎర్రని, ఇసుక రాళ్లతో కూడిన శిలల ఆవిర్భావం జరిగింది.

దక్కను నాపలు

భూమిలోని మాగ్మా వలన దక్కను నాపలు ఏర్పడి ఉంటాయని చెప్పవచ్చు. భూమిలోని తీవ్ర వేడికి అక్కడి రాళ్లు, ఖనిజాలు కరిగి మాగ్మా అనే శిలాద్రవంగా మారి బీటల ద్వారా పైకి వచ్చి 15-18 వందట మీటర్ల మందపు పొరలుగా ఏర్పడి ఘనీభవించింది. వీటినే దక్కను నాపలు అంటారు. ఇవి హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 500-600 మీటర్ల ఎత్తులోనూ, కృష్ణా, తుంగభద్ర లోయ భాగంలో 350-400 మీటర్ల మధ్య, గోదావరి-భీమా నదుల మధ్యభాగంలో 700 మీటర్ల ఎత్తులో, మెదక్ -మహబూబ్ నగర్ మధ్యన 600-900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పుట్టి ప్రవహించే నదులన్నీ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో కూడా కొంత ప్రాంతాన్ని తెలంగాణ భూభాగం కలిగి ఉంది. వీటిని వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో ఎత్తయిన ప్రాంతం నిర్మల్ గుట్టల్లోని 'మహబూబాఘాట్'.


 RELATED TOPICS