సుల్తాన్ కులీ కుతుబుల్ ఉల్ ముల్క్

బహమనీ సుల్తాను మహమూద్ షా, సుల్తాన్ కులీ స్వామి భక్తికి, రాజనీతిజ్ఞతకు, పరిపాలనా దక్షతకు సంతోషించి ఖవాఖాన్ బిరుదుతో సత్కరించి కొడంగల్ ప్రాంతంలో ఉన్న జాగీరులను ఇచ్చాడు. సుల్తాన్ కులీ తన జాగీరు ప్రాంతంలో పాలనా వ్యవహారాలను అతి సమర్థవంతంగా నిర్వహిస్తూ మహమూద్ షాకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలను అందించాడు. బీదరు విప్లవము క్రీ.శ. 1487లో బీదరు పట్టణము సంఘ కలహాలకు నిలయంగా మారింది. విదేశీయులు స్థానికులను చులకన భావంతో చూస్తూ, బహమనీ సుల్తాను ముఖ్యమైన పదవులను విదేశీయులకు ఇవ్వడం, స్థానికుల స్థితిగతులను పట్టించుకోకపోవడం అలజడులకు కారణమయ్యాయి.

సుల్తాన్ కులీ గోల్కొండ దుర్గమును పటిష్టపరిచాడు. బీదరు, బీజాపూరు, అహ్మద్ నగర్ రాజ్యములకు ధీటైన రాజ్యముగా గోల్కొండ రాజ్యమును తీర్చిదిద్దాడు. పట్టణానికి మహమ్మద్ నగరమని పేరుతో ప్రాకార నిర్మాణము గావించాడు. ప్రాకారాంతర్గత కట్టడాలు, రాజ ప్రసాదాలు జామే మసీదు, స్నాన వాటికలు, ముసాఫిర్‌ఖానాలు నిర్మించి సకల సదుపాయాలు కల్పించాడు. పట్టణ జనాభా పెరగడం వల్ల నగరాభివృద్ధికి ప్రజా సౌకర్యాలకు అనేక చర్యలు చేపట్టవలసి వచ్చింది. వేల సంఖ్యలో ప్రజలు, విదేశీయులు, సామంత, మాండలిక, మంత్రి, దండ నాయకులు నివసించడం వల్ల గోల్కొండ పట్టణము దినదినాభివృద్ధి చెంది సకల సౌకర్యాలతో విరాజిల్లింది. 

సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ విజయాలు

సుల్తాను కులీ తెలంగాణ ప్రాంతానికి సుబేదారుగా ఉండి స్వతంత్రించి విశాల సామ్రాజ్య నిర్మాణానికి ఇతర భూ భాగాలను జయించాలని భావించాడు. గోల్కొండ నుండి ఓరుగల్లు వరకు ఇతని ఆధీనంలో ఉండేవి. గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని తూర్పు తీరప్రాంతంలో ఉన్న రాజ మహేంద్రవర్మ దుర్గముపై దండెత్తాడు. అక్కడి దుర్గమునకు అధ్యక్షుడు వేంకటనాయుడు. సుల్తాన్ కులీని ఎదురించి యుద్ధము చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత సుల్తాన్ కులీ గోల్కొండకు తిరిగి వస్తూ మార్గమధ్యలో ఉన్న దేవరకొండ కోటను జయించి స్వాధీనపరచుకున్నాడు.

సుల్తాన్ కులీ తన సుదీర్ఘ పాలనాకాలంలో ఎంతో మంది కాఫిరుల దుర్గములను ముట్టడించడం జరిగింది. వరంగల్ సరిహద్దు నుండి మచిలీపట్టణము వరకు, గోల్కొండ నుండి రాజ మహేంద్రవరం వరకు వ్యాపించి ఉన్న భూ భాగాలను, దుర్గములను జయించి సుస్థిర రాజ్యమును స్థాపించాడు. సుప్రసిద్ధమైన దేవరకొండ, పానగల్లు, ఖమ్మం వంటి దుర్గములను స్వాధీనపరచుకున్నాడు. తెలంగాణాలో అనేక దుర్గములు ఉండేవి. సుల్తాన్ కులీ ఈ దుర్గముల అధ్యక్షులను ఓడించి తెలుగు ప్రజల సమగ్రతకు కృషి చేసి, బృహజ్య నిర్మాణము గావించాడు.

సుల్తాన్ కులీ కొడంగల్ (ప్రస్తుతం ఈ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలో కలదు) సమీపంలో ఉన్న హస్నాబాదులో జాగీర్దారుగా ఉన్న కాలంలో శాసనము వేయించాడు. ఇది కుతుబా వంశీయుల తొలి శాసనము. సుల్తాన్ కులీ క్రీ.శ. 1518లో జామే మసీదు శాసనము వేయించాడు. ఇతని కాలములో ఎల్గందుల, గోల్కొండ, ఘన్ పూర్, కొండపల్లి దుర్గములలో శాసనాలు వేయించాడు. సుల్తాన్ కులీ కుమారులు పరస్పరము కలహించుకునేవారు. ఆ పరిస్థితులను గమనించి కలహించే కుమారులను అతడు చెరసాలలో ఉంచాడు. గోల్కొండ కోటలో బందీగా ఉన్న యాలకులీ, తన అన్న కుత్బుద్దీన్ ను, తండ్రి వారసునిగా ప్రకటించునని భావించి తన అంతరంగికుడైన మీర్ మహమూద్ హందానీని తండ్రిని చంపడానికి నియమించాడు.

సుల్తాన్ కులీ మన్జీద్ సఫాలో నమాజు చేసిన తరువాత కూలీలకు, మేస్త్రీలకు మసీదు నిర్మాణము గురించి సూచనలిచ్చేవాడు. ఆ సమయంలో మీర్ మహమూద్ హందాని అక్కడికి వచ్చి సుల్తాన్ కులీని వధించాడు. గొప్ప శూరుడు, రాజకీయ వేత్త, గణిత శాస్త్ర పారంగతుడు, విజేత, పరిపాలనాదక్షుడు, గోల్కొండ రాజ్య నిర్మాత, ప్రజలచే బడే మాలిక్ గా పిలువబడినాడు.

కుతుబ్ షాహీలు-3