జంషీద్ కులీ

కారాగారంలో ఉన్న జంషీద్ కులీ తండ్రిని హత్య చేయించిన అనంతరం కారాగారం నుండి బయటికి వచ్చి, అంతఃపురాన్ని ఆక్రమించి, అన్నకుతుబ్ - ఉద్దీన్ కండ్లు పొడిపించి బందీచేసి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతడు ఎక్కువ కాలం బందీగా వుండడం వలన క్రమశిక్షణా రాహితంగా వ్యవహరించేవాడు. కొంత మేరకు రాజ్యపాలనలో సమర్ధత కనబరిచినాడు గాని పరమ క్రూరుడు. ఆస్థాన ప్రజల్లో ఇతనంటే సదభిప్రాయం లేదు. నేరాలకు అత్యంత క్రూరమైన శిక్షలను అమలు పరిచేవాడు. చదువుకున్నవాడు, కవిత్వ మంటే అభిరుచి గలావడు. ఇతని కాలంలో గోల్కొండ రాజ్యం అంతగా అభివృద్ధి చెందలేదు. 

ఇతని పరిపాలనా కాలం ఏడు సంవత్సరాలు. ఈ కాలంలో దక్కను సుల్తానులతో సహాయ సహకారాలతో గోల్కొండ ప్రతిష్టను ఇనుమడింపజేసినాడు. మొదటి నాలుగైదు సంవత్సరాలు యుద్ధాలతోనే గడిపాడు. మిగిలిన రెండు సంవత్సరాలు విశ్రాంతిగా గడిపినాడు. చివరికి అనారోగ్య కారణంగా మరణించాడు. సుభాన్ కులీ జంషీద్ మరణానంతరం ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పూడ్చడానికి రాణీ జిల్ కిస్ జమాన్ తన కుమారుడైన సుభాన్ కులీని సింహాసనం ఎక్కించింది. ఇతను ఏడేండ్ల బాలుడు. రాణీ జిల్ కిస్ జమానకు విదేశీ ముస్లిం నాయకులైన ముస్తఫా ఖాన్, సలాబత్ ఖాన్ సహాయం అందినది. సైఫ్ ఖాన్ అయినుల్ ముల్క్ రాజ్య వ్యవహారాలు చూసేవాడు. సైఫ్ పరిపాలన రాజ్యంలో ఎవరికి గిట్టలేదు. ఈ పరిస్థితులలో జగదేవరావు, అతని సహాయకులు భువనగిరిలో ఉన్న దౌలత్ కులీని సుల్తాన్ గా ప్రకటించడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడి అంతర్యుద్ధం మొదలైనది. సైఫ్ ఖాన్ తిరుగుబాటును అణిచి, దౌలత్ కులీని తిరిగి భువనగిరిలో బందీ చేసినాడు. తిరుగుబాటును అణిచిన గర్వంతో సైఫ్ ఖాన్ సర్దారుల పట్ల అహంకారంతో ప్రవర్తించుట వల్ల, సర్దారులందరూ ఏకమై విజయ నగరంలో తల దాచుకుని ఉన్న ఇబ్రహీం కులీని సుల్తాన్ గా ప్రకటించడానికి సిద్ధమైనారు. ఇదే సమయంలో గోల్కొండ కోటలో తిరుగుబాటు ప్రబలి, కోటలో బందీగా వున్న జగదేవరావు విముక్తుడవడం, సుభాన్ కులీని ఖైదుచేయడం జరిగింది. పరిస్థితులను గ్రహించిన సైఫ్ ఖాన్ బీరార్ పారిపోయాడు. తుదకు ఇబ్రహీం కులీ గోల్కొండనాక్రమించి క్రీ.శ.1550లో పట్టాభిషేకం జరుపుకున్నాడు.

ఇబ్రహీం కుతుబ్ షా

గోల్కొండను పాలించిన సుల్తానులందరిలోకి ఇబ్రహీం కులీ విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అతి సమర్ధుడు. ఆపత్కాలంలో విజయనగరం రాజైన అళియ రామరాయల ఆస్థానంలో తలదాచుకోవడం వలన అక్కడి రాజ్యాంగ తంత్ర నైపుణ్యాన్ని అలవరచు కున్నాడు. సంక్షోభిత పాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేసినాడు. తెలంగాణా ప్రాంతాల్లో కల్లోలానికి కారణమైన దోపిడీ దొంగలను దారుణంగా శిక్షించి దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పినాడు. గూఢచారి దళాన్ని ఏర్పరచి స్థానిక సమాచారం సేకరించి అవసరమైన చర్యలు తీసుకొనేవాడు. న్యాయశాఖ ఇతని కాలంలోనే పునరుద్ధరించ బడినది.

ఎన్నో చెరువులు తవ్వించాడు. నగరాలు నిర్మించాడు. హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీం పట్టణం, ఇతని కాలంలోనే నిర్మించారు. తెలుగు కవులను, పండితులను పోషించాడు. 'తపతీ సంవరణో పాఖ్యానం' రాసిన అద్దంకి గంగాధర కవి ఇబ్రహీంకు అంకిత మిచ్చాడు. తెలుగు కవులు పద్యాలలో ఇతనిని 'మల్కిభరాముడుగా' కీర్తించారు. ప్రభువు మహమ్మదీయుడైనా, అతన్ని 'హైందవ దేవతలు' రక్షింతురు గాక అని కవులు దీవించారు. 'యయాతి' చరిత్ర రచించిన పొన్నికంటి తెలగనాచార్యుడు, వైజయంతీ విలాసం వ్రాసిన సారంగు తమ్మయ్య, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం వ్రాసిన కందుకూరి రుద్రకవి, నిరోష్ఠ్య రామాయణం అనే పేరుతో దశరధరాజనందన చరిత్ర రచించిన మరింగంటి సింగనాచార్యుడు, రాజనీతి రత్నాకరం అనే పేరుతో వైష్ణవ ప్రబంధంగా పంచతంత్రాన్ని రూపొందించిన కృష్ణ యామార్యుడు -మొదలైన కవులుండేవారు. కవులకు మణులూ, మాన్యాలిచ్చి సుల్తాన్ పోషించాడు. ఇబ్రహీం కుతుబ్ షాకు భాగీరథీ అనే ఆమె ప్రియురాలు. గోల్కొండ నగరానికి ఈమె పేరు పెట్టి భాగీరథి పట్టణమని పిలువ సాగాడు.