ఢిల్లీ సుల్తానుల - చరిత్ర ఆధారాలు-2

ఖ్వాజా - అబ్దుల్లా - మాలిక్ ఇసామీ

ఇతడు "పుతూ-హుస్ సలాతిన్” అనే పేరుతో చరిత్రను కావ్య రూపంలో రచించాడు. ఇతను 16 ఏళ్ళ వయస్సులోనే ఢిల్లీ నుండి దౌలతాబాద్ చేరుకొని బహమనీ రాజ్య స్థాపకుడైన అల్లావుద్దీన్ హసన్ ప్రాపకం సంపాదించాడు. బహమనీ రాజ్యస్థాపన ఏ పరిస్థితులలో జరిగిందో తెలిపే గ్రంధం ఇది. మిన్షజ్ సిరాజ్ వదలి పెట్టిన (1259-66) సంవత్సరాల చరిత్రను తెలపడం పుతూ-హుస్ సలాతిన్ గ్రంధం యొక్క ప్రత్యేకత. తారీఖ్-ఇ-నాసిరీ, తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి రచనల మధ్య ఖాళీగా ఉన్న చరిత్ర కాలాన్ని ఈ గ్రంధంతో రచయిత పూర్తి చేశాడు. ఇతని ఉద్దేశ్యంలో చరిత్ర దైవ నిర్ణయానికి అనుకూలంగా నడిచే మానవ గాథ.

అమీర్ ఖుస్రూ

సమకాలీన సాహిత్యంలో, చరిత్రలు కాని వాటిల్లో సకృతంగా రాజకీయ సాంఘిక విషయాలు ప్రస్తావన లోనికి రావడం గమనించవలసిన విషయం . ఈ రకమైన సాహిత్యంలో బరనీకి సమకాలికుడైన అమీర్ ఖుస్రూ రచించిన మస్నవీ (పద్యకావ్యం )లలో సమకాలీన సంఘటనలలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల ప్రస్తావన కలదు. ఇతను బాల్బన్ కుమారుడు మహమ్మద్ దర్బారులో ప్రవేశించి, కైకుబాద్ దర్బార్ లో కూడా ఉన్నాడు. ఇతను రచించిన "కిరానస్-సానే”కు రాసిన “అషికా”లో ఢిల్లీ సుల్తానుల పరిపాలనను, అల్లాఉద్దీన్ పరిపాలన వరకు సమీక్షించాడు. ఇతని “ఇజాజ్-ఇ-ఒఖుస్రావే”లో కొన్ని ఫర్మానాల సారంశం కలదు. ఇతని రచన “మత్ కాల్-అన్వర్”లో సమకాలీన సాంఘిక మర్యాదలు, ప్రవర్తన, విషయాలు కలవు. హిందూ-ముస్లిం సంస్కృతుల మేళవింపునకు ఇతడే తొలి ప్రతినిధి. బాల్బన్ కాలం నుండి ఘియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు రాజ దర్బారులలో ఉండ నేర్చిన కుశాగ్ర బుద్ధి గల వాడితడు. ఇతడు "తుతి-ఎ-హింద్' (భారతదేశపు చిలక)గా ప్రఖ్యాతి గాంచాడు. పర్షియన్, హిందీ భాషల్లో నాలుగు లక్షల ద్విపదలు చెప్పాడు. హిందీ భాషా పదాలను భారతీయ కథలను, కవి సమయాలను వాడిన తొలి మహమ్మదీయ కవి ఇతడు. ఇతడు రచించిన "తుగ్లక్ నామా” చారిత్రక కావ్యం ఘియాజుద్దీన్ పరిపాలన వ్రాయడానికి, విలువైన ఆధారం. నాలుగు దశాబ్దాల కాలంలో ఢిల్లీ సామ్రాజ్య ప్రజల ఆచార వ్యవహారాలు, వారు ఎదుర్కొన్న పరిస్థితులు తెలుసుకోవాలంటే ఖుస్రో రచనలే చదవాలి. 

ఇతర రచనలు

అహమ్మద్ యాద్గర్ రచించిన “తారీఖ-ఇ-సలతిన్-ఇ-ఆఫ్ గనా లేదా తారీఖ్-ఇ-షాహి సూర్ వంశజుల వాస్తవ చరిత్రను తెలుపుతుంది. సూర్ వంశ చరిత్రను రాసిన మరో వ్యక్తి కోయిల్ కు చెందిన అబ్దుల్లా. ఇతడు రచించిన "తారీఖ్-ఇ-దాడొద్”లో సికిందర్ లోఢీకి సంబంధించిన కథలు చాలా ఉన్నవి. హిందువులు రచించిన గ్రంథాలు అతి తక్కువగా ఉన్నవి. వాటిలో చాంద్ బర్దాయ్ రచించిన "పృథ్వీరాజ్ రాసో” ముఖ్య గ్రంధంగా జేమ్స్ హెడ్ గుర్తించాడు. పృథ్వీరాజ్ రాసో రాజపుత్రుల నాగరికత- సంస్కృతి, ముఖ్యంగా తురుష్క రాజ్య స్థాపనకు ముందు ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం. రాజపుత్రుల రాజకీయాలు, సైనిక, సాంఘిక, ఆర్థిక వ్యవస్థ మరియు జీవన సరళిని తెలుసుకోవడానికి 'పృథ్వీరాజ్ రాసో” ఉపయోగపడుతుంది. జయాంకుడు రచించిన "పృథ్వీ విజయం” అనే గ్రంథం అజ్మీర్, సపాదలక్షను పాలించిన చౌహాన్ల చరిత్రకు నమ్మదగిన గ్రంధంగా కనబడుతున్నది. రాజపుత్ర రాజ్యంలో తురుష్కులు పడిన పాట్ల గురించి "హమ్మేరం” మహాకావ్యం తెలుపుతుంది. సుల్తానుల కాలంలో శాసనాలన్నీ"ఏ స్టడీ ఆఫ్ ముస్లిం” అనే గ్రంథంలో పొదుపరచబడినవి. పెర్సీ బ్రౌన్ బర్గస్, ఫెర్గూసన్ హావెల్, జాన్ మార్షల్ వాస్తు శిల్ప విషయాల్లో చేసిన కృషి అద్వితీయం. ఇబన్ బతూతా రాసిన “కితాబ్ ఉర్ రిఫ్ల”లో కొంతభాగం భారతదేశంలోని ఢిల్లీలోను, మధుర లోను అతడు గడించిన అనుభవాలను గురించి తెలుపుతుంది. ఈ పుస్తకం మహమ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనకు ఉన్న ఆధారాలలో అతి ముఖ్యమైనది. ఆ కాలంలోని సాంఘిక, ఆర్థిక విషయాలను అరబిక్ భూష ద్వారా తెలిపే గ్రంథం ఇది. ఇబన్ బతూతాకు భారతదేశంలో మౌలానా-బదర్-అల్ దిన్ అని పేరు. అబ్దుల్ రజాక్ "మళ్లోస్ సాదేన్ వ మజ్ మౌల్ బహెరేన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతను పర్షియన్ పండితుడు. “రెండు శుభగ్రహాల(గురు, శుక్ర) ఉచ్ఛ, “రెండు సముద్రాల సంగమం” అబ్దుల్ రజాక్ రచనలు.

అల్బరూనీ గజనీ మహ్మద్ సైన్యాలతో పాటు మన దేశానికి వచ్చి, ఇక్కడి విజ్ఞాన సంపదను అర్థం చేసుకోవడమే కాకుండా మన దేశస్తుల ఆచార, సంప్రదాయాలను గమనించి చరిత్ర రచనలు చేసిన వ్యక్తి అల్ బెరూనీ. పదకండవ శతాబ్దపు మేధావులలో ఇతడు అగ్రశ్రేణికి చెందినవాడు. ఇతడు “తారీఖ్-ఉల్-హింద్” అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో రచించాడు. తరువాత కాలంలో ఇది పర్షియాలోకి అనువదించబడింది. గజనీ మహ్మద్ కాలంలో భారతీయుల సాంఘిక, సాంస్కృతిక విషయాలను తెలుసుకోవడానికి మనకు ఉపయోగ పడే ప్రధాన ఆధార గ్రంధం “తారీఖ్-ఉల్-హింద్”. ఇతడు భారతీయుల శీలంలోని ప్రధాన లోపాలను ఎత్తి చూపాడు. తన వాక్కులకు సంస్కృత గ్రంథాల నుండి ప్రమాణాలను చూపాడు. తన 77వ సంవత్సరంలో గజనీ నగరంలో మరణించాడు.


 RELATED TOPICS 

ఢిల్లీ సుల్తానుల - చరిత్ర ఆధారాలు-1