ఢిల్లీ సుల్తానుల - చరిత్ర ఆధారాలు-1

తాజులు అమీర్ : 

దీని గ్రంథకర్త హసన్ నిజామి. ఇతను కుతుబుద్దీన్ ఐబక్ ఆజ్ఞను అనుసరించి క్రీ.శ. 1205లో ఈ గ్రంథ రచన ప్రారంభించాడు. నిజామి అరబిక్, పర్షియన్ భాషల్లో అసమాన ప్రతిభ ఉన్నవాడు కావడంతో ఎప్పుడు ఏ భాషలో రాయాలనిపిస్తే ఆ భాషలో రాసేవాడు. మొత్తం 12 వేల పంక్తులలో 7 వేల పంక్తులు అరబిక్, పర్షియన్ పద్యాలలోని చరణాలు. ఈ గ్రంథపు ప్రత్యేకత ఏమంటే చరిత్రతో పాటు కల్పనా సాహిత్యాన్ని మేళవించాడు. భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపనకు సంబంధించిన విషయాలను తెలియ పరిచే అత్యుత్తమ గ్రంథం ఇది. మహమ్మద్ ఘోరీ, జరిగిన అవమానాన్ని తుడిచి వేసుకొనే నిమిత్తం, క్రోధంతో పృథ్వీరాజ్ పై రెండోసారి దండెత్తి రావడం దగ్గర కథ మొదలై పెట్టి (1192 - 1206 వరకు) ఐబక్ సాధించిన ఘన విజయాలన్నీ విశదంగా పేర్కొని, ఐబక్ సుల్తాన్ అయిన తరువాత 1210 వరకు సాధించిన విజయాలన్నింటినీ క్లుప్తంగా ఒకే ఒక అధ్యాయంలో పేర్కొన్నాడు. ఆరంషా ప్రసక్తి లేకుండానే ఇల్తుత్ మిష్ పరిపాలనా కాలంలో 1217 వరకు జరిగిన సంఘటనలన్నీ వివరించాడు. ముస్లీం పరిపాలన భారతదేశంలో స్థాపించడంతో ఈ గ్రంథం ఆరంభమవుతుంది. ఇలా తుత్ మిష్ కు నిజామీ అంకితమిచ్చిన మరో పుస్తంక "అదబుల్ హవస్ ఘజాత్”. ఈ గ్రంథంలో ఢిల్లీ రాజ్యపు ప్రభుత్వ యంత్రాంగం, సైనిక పద్ధతి మొదలైన విషయాల ప్రస్తావన ఎక్కువగా ఉన్నది.

తబకత్-ఇ-నసిరీ : 

ఈ గ్రంథ రచయిత మిన్షజ్-ఉస్-సిరాజ్. ఈ గ్రంథంలో 11, 17, 18, 19, 20, 21, 22 భాగాలు మాత్రమే హిందూస్తాన్ చరిత్రకు సంబంధించిన బిబ్లియోథికా ఇండికాలో, ప్రత్యేకంగా ఈ భాగాలన్నీ కలిపి 450 పుటల పుస్తకంగా వెలువరించబడింది. తబకత్-ఇ-నసిరీ ఇస్లాం ప్రపంచ చరిత్ర. ఇందులో షన్స్ ఒసాల విజయాల దగ్గర నుంచి 1260 వరకు ఢిల్లీ సుల్తానుల చరిత్ర ఉండడమే ఈ గ్రంథపు విలువ పెరగడానికి కారణం. ఈ గ్రంథం చివరి భాగంలో మంగోలు దుండగుల గురించి, మధ్య ఆసియాలో వారు గావించిన దురాగతాలన్నింటినీ తెలపడం వల్ల మొగల్ చక్రవర్తులు గ్రంథానికి ప్రోత్సాహమీయలేదు. 

తారీఖ్ - ఇ- ఫిరోజ్ షాహి 

మిన్షజన్ సిరాజ్ 1259లో వదిలి పెట్టిన ఢిల్లీ సుల్తానత్ చరిత్రను, అక్కడి నుంచే ఆరంభించి 1359 వరకు అంటే దాదాపు ఒక శతాబ్దం పూర్తి చరిత్రను తెలిపి గ్రంథం ఇది. దీనిని రచించిన వాడు జియావుద్దీన్ బరనీ. ఈ గ్రంథంలో బాల్బన్ నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ ఆరో సంవత్సర పరిపాలనా కాలం వరకు జరిగిన చరిత్రను తెలుపుతుంది. ఇతను మహమ్మద్ బీన్ తుగ్లక్ కొలువులో పని చేసాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంతో ఆరంభమైన రాజకీయ కుట్రలకు బలైన వాడు ఇతడు. ఇతనికి గిట్టని వాళ్ళు ఇతనిపై అభియోగాలు మోపి మరణ శిక్ష వేయించాలని ప్రయత్నించినా, ఫిరోజ్ షా తుగ్లక్ దయ వలన ప్రాణాలతో బయట పడ్డాడు. చివరకు షేక్ నిజాముద్దీన్ మఠలో మరణించాడు. ప్రభుత్వోద్యోగిగా, రెవెన్యూ శాఖ విషయాలు బాగా తెలిసిన వాడు కావడం వల్ల ఇతడు రైతులు- వ్యవసాయం గూర్చి ఎక్కువ వివరాలు ఇవ్వడంలో సఫలీకృతుడైనాడు. క్వాజా సదర్ నిజామీ రచన తాజల్ మాసిర్ సదర్ - అల్- దీన్ ఊ ఫే రచన జామ్ - అల్-హికాయత్ కబీర్ అల్ దిన్ రచన అలా-అల్-దీన్ విజయాల చరిత్ర. 

పుతూహత్-ఇ-ఫిరోజ్ షాహి 

ఇది ఫిరోజ్ షా తుగ్లక్ ఆత్మ కథ. ఈ భాగంలో ఫిరోజ్ షా తాను చేసిన యుద్దాలను గురించి తెలిపాడు. ఇది 32 పుటలతో కూడిన అతి చిన్న పుస్తకం. మత పరంగా, మానవ దృక్పథంతో, నైతిక బాధ్యతలను నెరవేర్చడమే తన పని అన్నట్లు ఈ గ్రంథ రచన ద్వారా తెలిపాడు.

తైమూర్ ఆత్మకథ

ఢిల్లీని దోచుకొని అత్యాచారాలు చేసిన తైమూర్ తన ఘన కార్యాలను తెలియచేయడానికి గాను అతనే చేసిన రచన “తుజుకీ-ఇ-తైమూరీ”. ఈ గ్రంథం తుర్కీ భాషలో రచింపబడినది. ఇదే కథను “జఫర్ నామా” అనే పేరుతో మరింత నాజూకైన భాషలో “మౌలానా యజ్జీ” రచించాడు. 

పాయహ్యబీన్ అమ్మద్ సర్ హిందీ

ఇతడు సయ్యద్ వంశ చరిత్రను రచించిన సమకాలీన చరిత్రకారుడు. సుల్తాన్ ముబారక్ షా, అతనికి ముందున్న సుల్తానుల ఘన కార్యాలను గురించి రాయడానికి పూనుకొన్నాడు. తారీక్ - ఇ - ముబారక్ షాహిలో ఎక్కువభాగం సయ్యద్ పరిపాలకుల సైనిక, రాజకీయ చర్యల వర్ణనలతో నిండి ఉన్నది. ఇతడు నిజాయితీపరుడైన చరిత్రకారుడు. ఇతడు ప్రతి సుల్తాన్ పరిపాలన చివర “నిజం దేవునికే తెలుసు” అని రాసేవాడు.


 RELATED TOPICS 

ఢిల్లీ సుల్తానుల - చరిత్ర ఆధారాలు-2