ఆంధ్రప్రదేశ్ ను మూడు సహజ మండలాలుగా విభజించ వచ్చును : తీర మైదానం, తూర్పుకనుమలు, దక్కన్ పీఠభూమి. 

తీర మైదానం

తూర్పు కనుమల నుండి బంగాళాఖాత తీర రేఖ, కృష్ణా-గోదావరి వరకు ఆంధ్రప్రదేశ్ తీర మైదానం విస్తరించి ఉన్నది. ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు 974 కి.మీ పొడవు ఈ తీరమైదానం విస్తరించి ఉన్నది. ఉత్తర, దక్షిణ భాగాలలో సన్నగా ఉన్న ఈ తీరమైదానం కృష్ణా - గోదావరి నదుల కారణంగా ఏర్పడిన డెల్టాలు గల ప్రాంతంలో సుమారుగా 160 కి.మీ వెడల్పుతో ఉంటుంది. ఒండ్రుమట్టితో ఏర్పడిన అత్యంత సారవంతమైన కృష్ణా-గోదావరి డెల్టాలు ఉండడం వలన ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీరమైదానం అధిక వెడల్పుతో ఉంటుంది.

గోదావరి ఉపనదులైన గౌతమి, వశిష్ట నదుల మధ్య గల ప్రాంతాన్ని కోనసీమగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అరటి, కోబ్బరి తోటలు విస్తారంగా వ్యాపించి ఉన్నవి. కృష్ణా-గోదావరి డెల్టాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం 245 చ.కి.మీ. వైశాల్యంతో మంచినీటి సరస్సు ఏర్పడినది. దీనిని కొల్లేరు సరస్సుగా పిలుస్తారు. అదేవిధంగా రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు తమిళనాడు రాష్ట్రానికి మధ్యగా సముద్రపు నీరు తీర మైదానం లోకి చొచ్చుకురావడం వలన 450 చ.కి.మీ. వైశాల్యంతో పులికాట్ సరస్సు ఏర్పడింది. విశాఖపట్టణం దక్షిణ భాగంలో సముద్రతీరం వెంట గల కొడలను యారాడ కొండలు అని పిలుస్తారు. విశాఖపట్టణం ఓడరేవును సముద్ర అలల తాకిడి నుండి కాపాడడం ఈ కొండల ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని డాల్ఫిన్‌ నోస్ అని కూడా పిలుస్తారు.

తూర్పు కనుమలు

తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమికి, తీర మైదానానికి మధ్య ఉత్తర దక్షిణ దిశలుగా వ్యాపించి ఉన్నాయి. ఇవి చార్నోకైట్, ఖోండోలైట్స్ శిలలతో ఏర్పడినవి. ఉత్తర భాగంలో ఇవి సుమారుగా 70 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నవి. ఉత్తరాన గల తూర్పు కనుమలకు తూర్పు శ్రేణులు అని పేరు. దక్షిణాన గల వాటికి కడప శ్రేణులని పేరు. వీటి సగటు ఎత్తు 915 మీ. గా ఉంటుంది. విశాఖపట్టణంలోని అరకు లోయ, ఉభయ గోదావరి జిల్లాలలోని పాపికొండలు తూర్పు కనుమలలో ముఖ్యమైనవిగా చెప్పవచ్చును. విశాఖపట్టణంలోని అరకులోయ వద్ద గల జిందగడ 1690 మీటర్ల ఎత్తుతో తూర్పు కనుమలలో అత్యంత ఎత్తయిన శిఖరంగా ఉన్నది. 1501 మీటర్ల ఎత్తుతో మహేంద్రగిరి రెండవ ఎత్తయిన శిఖరంగా ఉన్నది. ఇంది ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో కలదు. ఈ కనుమలలోనే ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం ఏనుగు ఎల్లమ్మ కొండ కలదు. దీనికి హార్స్ లీ

హిల్స్ అని కూడా పేరు. తూర్పు కనుమలలోనే కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు, నెల్లూరు జిల్లాలో వెలికొండలు, ఎర్రమల కొండలు, చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండలు(తిరుపతి కొండలు), కడప జిల్లాలో పాలకొండలు ముఖ్యమైనవి. వీటితో పాటు గుంటూరు జిల్లాలో నాగార్జున కొండలు, మంగళగిరి కొండలు, వినుకొండ, బెల్లంపల్లి కొండలు, అనంతపురం జిల్లాలో మల్లప్ప కొండలు, పెనుకొండలు; కడపలో శేషాచలం, పాలకొండల; కర్నూలులో నల్లమల కొండలు వంటి ముఖ్యమైన కొండలు కలవు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం శేషాచలం కొండలపైన కలదు.

దక్కన్ పీఠభూమి 

పురాతనమైన ఆర్కియన్ శిలలతో దక్కన్ పీఠభూమి ఏర్పడింది. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఈ పీఠభూమిలోనివే. పీఠభూమి ఉత్తరభాగంలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గోండ్వానా రకం శిలలు కలవు. రాయలసీమ పీఠభూమి విశాలమైన గ్రానైట్ శిలలతో ఏర్పడినది. గోండ్వానా శిలల్లో బొగ్గు నిక్షేపాలు కలవు. దార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, గోండ్వానా శిలలు, దక్కన్ శిలలు, రాజమండ్రి శిలలు దక్కన్ పీఠభూమిలో భాగంగా కలవు.

దార్వార్ శిలలు :

ఇవి భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన శిలలు. ఇవి భూ అంతరంలో లావా విస్పోటనం కలగడం వలన ఏర్పడినవి. వీటిని మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని దార్వార్ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. వీటిలో ముడి ఇనుము పుష్కళంగా లభిస్తుంది. రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ శిలలు కలవు.

కడప శిలలు :

దార్వార్ శిలల అవశేషాల వలన ఏర్పడినవే కడప శిలలు. ఇవి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో కలవు. బహిర్గత, భూస్వరూప ప్రక్రియల కారణంగా ఎత్తయిన భూములు కోత, అవక్షేపాలను ఏకకాలంలో నిక్షేపించడం ద్వారా మార్పు చెంది రూపాంతర శిలలు ఏర్పడినవి. ఈ శిలల్లో సిమెంట్ గ్రేడ్, సున్నపురాయి నిల్వలు, రాతినార లభిస్తాయి.

కర్నూలు శిలలు :

ఇవి కడప శిలలకు సమాంతరంగా ఉంటాయి. ఇవి కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే కనిపిస్తాయి. వీటిలో రాతినార, బైరటీస్, స్టియటైట్ వంటి ఖనిజాలు లభిస్తాయి.

గోండ్వానా శిలలు

గోదావరి, కృష్ణా నదుల లోయలలో ఈ శిలలు కనిపిస్తాయి. ఈ శిలలు ఎర్రని ఇసుకరాళ్ళను కలిగి ఉంటాయి. గోదావరి నది దిగువ భాగంలో గల బొగ్గు గనులు గోండ్వానా శిలా రకానివే. టెక్టానిక్ మరియు వాతావరణ మర్పుల వల్ల విలువైన వృక్ష, జంతు జాతులు, ఒండ్రుమట్టి భూ అంతర్భాగములో శైథిల్యం చెంది బొగ్గు గనులుగా ఆవిర్భవించడం జరిగింది.


 RELATED TOPICS