ఆంధ్రప్రదేశ్ లోని అడవులన ఐదు రకాలుగా విభజించడం జరిగింది. అవి : 1. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, 2. అనార్ధ్ర ఆకురాల్చు అడవులు, 3. చిట్టడవులు, 4. తీరప్రాంత అడవులు, 5. మడ అడవులు.

1. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

ఈ అడవులు 125 సెం.మీ నుంచి 200 సెం.మీ వరకు వర్షం పడే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. టేకు, వెదురు, మద్ది, వేగిస, బండారు, జిట్టెగి, చిరుమాను మొదలైనవి వీటిలోని ప్రధాన వృక్ష జాతులు.

2. అనార్ధ్ర ఆకురాల్చు అడవులు:

ఈ అడవులు సహజంగా 65-100 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరెక్కడా లేని ఎర్రచెందనం చెట్లు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే కలవు. అత్యధిక విలువ కలిగిన మంచి గంధం చెట్లు చిత్తూరు అనంతపురం జిల్లాల్లోని అడవుల్లో లభిస్తాయి. పగిస, బంగారు, మద్ది, టేకు, దిరిసెన, పట్టు పత్తిచెట్లు, వెదురు, మోదుగ, ఎర్ర చందనం మొదలైన వృక్షాలు ఈ రకం అడవుల్లో లభిస్తాయి.

3. చిట్టడవులు/ముళ్ళపొదలు

ఈ అడవులు 70 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలుగా ఉన్న కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ జిల్లాలో కలవు. తుమ్మ, బలుసు, రేగు, కలబంద, బ్రహ్మజెముడు నాగజముడు మొదలైన ముళ్ళజాతి వృక్షాలు ఈ అడవులలో పెరిగే ప్రధాన వృక్షజాతులు.

4. తీరప్రాంత అడవులు

తీరప్రాంతాల్లో ఇసుక పెరగడం వలన వీటిని తీరప్రాంత అడవులని అంటారు. ఈ అడవులు నదులు, సముద్రం కలిసే బురద, ఒండ్రు, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. సరుగుడు, బంతిచెట్లు, ఒకదానికొకటి అల్లుకునే చెట్లు ఈ ప్రాంతంలో పెరిగే వృక్షజాతుల్లో ముఖ్యమైనవి.

5. మడ అడవులు

నదీ ముఖ ద్వారాలలో ఎకుక్కువగా ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నవి. పోటుపాటుల వల్ల అధికంగా ప్రభావితం అవుతాయి కాబట్టి వీటిని టైడల్ అడవులు అంటారు. ఉప్పుపొన్న, బొడ్డుపొన్న,ఊరడ, మడ, తెలమడ, గుండమడ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి.


 RELATED TOPICS