క్రీ.శ. 1500 ప్రాంతంలో బహమనీ రాజ్యము చీలిపోయి, ఐదు స్వతంత్ర ముస్లిం రాజ్యాలు స్థాపించబడ్డాయి. వాటిలో తెలంగాణాను పాలించిన రాజ వంశాలలో ముఖ్యమైనది కుతుబ్ షాహీ వంశం.

గోల్కొండ పట్టణము రాజధానిగా క్రీ.శ 1518-1687 వరకు అవిచ్ఛన్నంగా ఆంధ్ర భూభాగాన్ని ముఖ్యంగా తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలను కుతుబాహీ వంశీయులు పాలించారు. వీరు తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొని, ఆంధ్ర సంస్కృతిని పరిరక్షించి, తెలుగు సాహిత్యాన్ని ఆదరించారు. కవులను పోషించి, చక్కని పరిపాలన చేస్తూ కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. వీరు ముస్లిం పాలకులైనా హిందువులకు ఉన్నత పదవులను ఇచ్చి తమ పరమత సహనాన్ని ప్రజలకు కనబరిచారు. 

పూర్వ చరిత్ర - ఖరాకునీల్ వంశము

గోల్కొండ సామ్రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబుల్ ఉల్ ముల్క్ టర్కిస్థాన్ నివాసి. ఖరాకునీల్ వంశీయుడు. ఈ వంశీయులు టర్కిస్థాన్ భాగాన్ని ఏలుతూ, ఇరాన్ పశ్చిమ భూభాగాలను ఆక్రమించి, విశాల సామ్రాజ్య నిర్మాణము గావించారు. రాయూసిఫ్, రెండవ సికిందర్, జహాన్ షా వంటి యోధులీ వంశంలో జన్మించి, రాజ్యపాలన చేస్తూ అశేషమైన కీర్తిని గడించారు.

బహమనీ సుల్తాన్ మహమూద్ షా, సుల్తాన్ కులీని అతని పినతండ్రి పీర్ కులీని ఆహ్వానించి గౌరవించాడు. సుల్తాన్ కులీ, మహమ్మద్ షా - 2 కాలంలో దక్కనుకు తుర్కు గులాముగా చేరాడని ఫెరిష్టా తెలిపాడు. కానీ రెండవ మహమ్మద్ షా మరణానంతరము మహమూద్ షా బహమనీ రాజ్యపీఠాన్ని అలంకరించాడు. సుల్తాన్ కులీ క్రీ.శ. 1486లో బహమ్మనీ రాజ్యానికి వచ్చేనాటికి మహమూద్ షా రాజ్యపాలన చేస్తుండేవాడు. ఖరాయూసిఫ్, రెండవ సికిందర్, జహాన్ షాల వంశములో జన్మించిన సుల్తాన్ కులీ తుర్కు గులాముగా చేరెనని భావించడం హాస్యాస్పదము. సుల్తాన్ కులీ, అల్లాకులీలు ఖరాకునీల్ రాజవంశీయులని తెలుసుకొని మహమూద్ షా వారిని గౌరవించాడు. వారు సమర్పించిన కానుకలను స్వీకరించి వారికి దర్బారులో స్థానము కల్పించి సకల సదుపాయాలు ఏర్పరచాడు.

అల్లాకులీ టర్కీ వెళ్ళడానికి మహమూద్ షాను అనుమతి కోరగా మహహమూద్ షా అల్లాకులీకి మాత్రం టర్కీవెళ్ళడానికి అనుమతినిచ్చి సుల్తాన్ కులీని దక్కనులోనే నివసించమని ఖచ్చితంగా ఆదేశించాడు. సుల్తాన్ కులీ కూడా దక్కనులో నివసించడానికి ఇష్టపడి తన ఇష్టాన్ని తన పినతండ్రికి తెలపడంతో అల్లాకులీ తానొక్కడినే ఇరాన్ వెళుతున్నానని మహమూద్ షాకు తెలిపాడు. మహమూద్ షా సంతోషించి సుల్తాన్ కులీకి తన ఆస్థానములో ఉన్నత పదవిని కట్టబెట్టాడు.

సుల్తాన్ కులీ వీరుడు. గణిత శాస్త్ర పారంగతుడు. మహమూద్ షా బహమనీ ఇతనిని రాజ ప్రాసాద గణాంకాధికారిగా నియమించగా, అతడు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలందుకున్నాడు. మహమూద్ షా కాలంలో తెలంగాణ దోపిడీదారులకు, దొంగలకు నిలయంగా మారింది. ప్రజాజీవనంలో ప్రశాంతత కరువైంది. రైతుల నుండి ప్రభుత్వానికి పన్నులు వసూలయ్యేవి కావు. తెలంగాణ పరిస్థితులను అదుపు చేయడానికి మూడువేల సైన్యమును మహమూద్ షా పంపాలని భావించాడు. ఆ విషయం తెలిసి సుల్తాన్ కులీ సైన్య సహాయము లేకుండా తాను తెలంగాణాలో దోపిడీలను, దొంగతనాలను అరికట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పి ప్రభుత్వానికి రావలసిన పన్నులు వసూలు చేస్తానని రాజ బంధువుల ద్వారా మహమూద్ కు తెలిపాడు.

సుల్తాన్ కులీకి తెలంగాణ పరిస్థితులను చక్కదిద్దడానికి మహమూద్ షా అనుమతినిచ్చాడు. అతడు తన అనుచరులతో తెలంగాణాలో చేరి, పరిస్థితులను అర్థం చేసుకొని, జమీందారులను కూడగట్టుకొని వారి ద్వారా దొంగలను, దోపిడీదారులను అదుపులోకి తెచ్చుకొని శాంతిభద్రతలను కల్పించాడు. కుట్రదారులు, అవిధేయులైన జమీందారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు విధిగా చెల్లించసాగారు. సుల్తాను కులీ తన రాజనీతిని, సామర్థ్యాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. సుల్తాన్ కులీ కొడంగల్ ప్రాంత జాగీరులను, ఖవ్సా రు బిరుదును పొంది సుల్తాన్ మహమూద్ ప్రేమకు పాత్రుడయ్యాడు.

కుతుబ్ షాహీలు-2