ఆంధ్రరాష్ట్ర అవతరణతో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోరిక ఉధృతమైంది. ప్రజాభిప్రాయాన్ని మన్నించి 1953 డిసెంబర్ 22వ తేదీన లోకసభలో నెహ్రూ రాష్ట్ర పునిర్నిర్మాణ సంఘాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఫజల్ అలీ అధ్యక్షులుగా, కుంజ్రూ, ఫణిక్కర్లను సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ ప్రకటన ఆంధ్రులకు సంతోషం కలిగించింది. ఆంధ్రులంతా ఒకే రాష్ట్రంలో జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆనందపడ్డారు. 

విశాలాంధ్ర ఉద్యమం

హైదరాబాద్ రాజ్య విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ సగానికి పైగా ఉన్న తెలంగాణా ఆంధ్రులకు నిజాం పాలనలో జరిగిన అన్యాయం, తెలుగువారు తమ భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం స్థాపించుకున్న సంస్థల గురించి, చేసిన కృషి కారణంగా పోలీసు చర్య తరువాత ఆంధ్ర, తెలంగాణాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టమయ్యాయి. ఆంధ్రులందరూ, ఒకే పాలనలోకి రావాలనే ఆకాంక్ష ఆంద్రోద్యమ తొలిరోజునుంచీ ఉంటూ వచ్చింది. 1937లోనే మామిడిపూడి వెంకటరంగయ్యగారు ఆంధ్రులందరూ సమైక్యమయ్యే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాలాంధ్ర ఏర్పాటు గురించీ దానివల్ల చేకూరే లాభాల గురించి ప్రచారం చేశారు. పత్రికలు కూడా ముఖ్యపాత్ర నిర్వహించాయి. పుచ్చలపల్లి సుందరయ్య గారు 'విశాలాంధ్ర' అనే పేరుతో ఒక దినపత్రిక స్థాపించారు.

1950 వరంగల్లు విశాలాంధ్ర మహాసభలో హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర స్థాపించాలని తీర్మానించారు. 1954లో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్ లో జరిగింది. ఈ సభలో కొందరు ప్రత్యేక తెలంగాణా బలహీన రాష్ట్రమవుతుందని, ప్రజాస్వామిక శక్తులు దెబ్బతింటాయని స్వామిరామానంద తీర్థ వాదించారు. తెలంగాణా పత్రికలు, ప్రముఖ నాయకులు విశాలాంధ్ర అవశ్యకతకూ ఉపయోగాలనూ ప్రచారం చేయడం జరిగింది.

రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం విచారణ కాలంనాటికే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భాషాపరంగా తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రాంతాలుగా విడిపోవాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలా, ఆంధ్రలోచేరి విశాలాంధ్రగా మారాలా అనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో సాయుధ పోరాటం ఆపి కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. వారికి తెలంగాణాలో అత్యధిక సీట్లు వచ్చినా, రాష్ట్రం మొత్తంమీద కాంగ్రెసుకు మెజారిటీ వచ్చి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 

అంతర్గత భేదాలు

రాష్ట్ర పునర్విభజన సంఘం ముందు తెలంగాణావాదులు, విశాలాంధ్రవాదులు తమ, తమ వాదాలను, బలాలను ప్రదర్శించడానికి సంసిద్ధులయ్యారు. విశాలాంధ్ర ఉద్యమం ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా నెహ్రూగారు చేసిన అనుచిత వ్యాఖ్య తెలంగాణా వాదులకు బలమిచ్చింది. హైదరాబాద్ ప్రజాసోషలిస్టు పార్టీ మహదేవ్ సింగ్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణా కోరారు. 1953 వరకు విశాలాంధ్రను కోరిన కొండా వెంకటరంగా రెడ్డి 1954లో కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నిక కాగానే తాను ప్రత్యేక తెలంగాణా వాదినని ప్రకటించాడు. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విశాలాంధ్రను సిఫారసు చేయగా ఆయా భాషారాష్ట్రాల ఏర్పాటు గురించి వారి ప్రతినిధులు మాత్రమే నిర్ణయించాలి అని ప్రకటించారు. ఆంధ్రప్రాంతంలో విశాలాంధ్ర పట్ల ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ తెలంగాణా వారు మాత్రం రాష్ట్ర పునర్విభజన సంఘం ముందు భిన్నాభిప్రాయాలు తెలియజేశారు. 

సంఘం సిఫారసులు

రాష్ట్ర పునర్విభజన సంఘం వివిధ అభిప్రాయాలను సేకరించి 1955 సెప్టెంబర్ లో నివేదిక సమర్పించింది. హైదరాబాద్ రాష్ట్ర విభజనను ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు కాబట్టి కన్నడ ప్రాంతాలను మైసూర్ ప్రాంతాల తోనూ, మరాఠీ ప్రాంతాలను బొంబాయి ప్రాంతాలతోనూ, సంలీనం చేయాలని చెబుతూ విశాలాంధ్ర వల్ల ముక్కోటి ఆంధ్రులకు నీటి వనరులు, ఖనిజ సంపద, విద్యుచ్ఛక్తి, ముడి పదార్థాల రంగాలలో ఎంతో లాభం చేకూరగలదని భావించారు. హైదరాబాద్ రాజధాని అయితే రాజధాని సమస్య తీరుతుందని విశాలాంధ్ర వల్ల కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు నిర్మించి, రాష్ట్రాభివృద్ధి చేయవచ్చునని కూడా ఆ సంఘం అభిప్రాయపడింది. పాలనావ్యయం తగ్గుతుందని భావించారు. విశాలాంధ్ర స్థాపన ఆదర్శ ప్రాయమైంది. అని చెబుతూ సంఘం ప్రత్యేక తెలంగాణా వారి వాదనలోకూడా కొంత బలమున్నది, దానిని తోసిపుచ్చడం సులభం కాదని అభిప్రాయ పడింది. విశాలాంధ్రరాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరుగు తుందని కె.వి.రంగారెడ్డి, చెన్నారెడ్డి వాదించి ప్రత్యేక తెలంగాణాను కోరారు. దీనికి స్పందిస్తూ సంఘం 1961లో ఏర్పడబోయే తెలంగాణా శాసనసభలో 2/3 మంది విశాలాంధ్రను కోరితే తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో సంలీనం చేయవచ్చునని అప్పటివరకు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సంఘం చేసిన సిఫారసు విచిత్రమైంది. 

ఈ నివేదిక పట్ల తెలంగాణా వాదులు హర్షం వెలిబుచ్చినా అత్యధికులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అత్యధిక కాంగ్రెసు సభ్యులు విశాలాంధ్రను కోరగా, కమ్యూనిస్టులు తమ స్థానాలకు రాజీనామా చేసి విశాలాంధ్ర సమస్యపై తిరిగి పోటీ చేయగలమని ప్రకటించారు. హైదరాబాద్ శాసనసభలోని 147 మంది సభ్యులు అభిప్రాయ ప్రకటన చేయగా 103 మంది విశాలాంధ్రను కోరారు. 15 మంది తటస్థంగా ఉంటే కేవలం 29 మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణాను సమర్ధించారు. బూర్గుల రామకృష్ణారావుగారు ఢిల్లీ వెళ్ళి విశాలాంధ్ర ఏర్పాటును గురించి అగ్రనాయకులను ఒప్పించారు. ప్రత్యేక తెలంగాణా వాదుల అనుమాన నివృత్తికోసం ఈ రెండు ప్రాంతాల ప్రతినిదులతో 1956 ఫిబ్రవరిలో కాంగ్రెసు అధిష్టానవర్గం, సమావేశం ఏర్పాటు చేసింది.

పెద్దమనుషుల ఒప్పందం

ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో జరిగిన చర్చలలో హైదరాబాద్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, చెన్నారెడ్డి, కొండా వెంకటరంగా రెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు జె.వి. నరసింగారావుగార్లు పాల్గొనగా ఆంధ్రరాష్ట్రం నుంచి నీలం సంజీవరెడ్డి, గోపాలరెడ్డి, గౌతులచ్చన్న, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారామారాజు పాల్గొన్నారు. తెలంగాణాకు రక్షణలు కల్పిస్తూ పెద్దమనుషుల ఒప్పందం పై సంతకాలు చేశారు.

ఈ అంగీకారం ప్రకారం : 

  • రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య మరియు సాధారణ పరిపాలనా విభాగాలపై అయ్యే ఖర్చు తగు నిష్పత్తిలో ఇరు ప్రాంతాలు భరించాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని కేవలం ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి. ఈ నిబంధనను 5 సంవత్సరాల అనంతరం సమీక్షించి అసెంబ్లీలోని తెలంగాణా శాసనసభ్యులు కోరిన పక్షంలో మరో 5 సంవత్సరాలకు గాను పొడిగించాలి. 
  • తెలంగాణా శాసనసభ సభ్యులు కోరిన విధంగానే తెలంగాణా లో మద్యపాన నిషేధాన్ని అమలు జరపాలి. 
  • తెలంగాణాలో అమలులో గల విద్యా సౌకర్యాలను తెలంగాణా విద్యార్థులందరికీ వర్తింపజేసి వాటిని మరింతగా అభివృద్ధి పరచాలి. తెలంగాణాలోని సాంకేతిక విద్యాసంస్థల్లో తెలంగాణా విద్యార్థులకే మాత్రమే ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేయాలి. అలా కుదరని పక్షంలో రాష్ట్రంలోని మొత్తం సీట్లను తెలంగాణా విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. ఈ రెండిట్లో తెలంగాణా ప్రాంతానికి ఏది ప్రయోజనకరంగా ఉంటే దానిని కొనసాగించాలి.
  • ఉద్యోగుల విభజన ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలో చేయాలి. 
  • ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆయా ప్రాంతాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలి.
  • తెలంగాణాలో సాధారణ పరిపాలన మరియు న్యాయ విభాగాల్లో ఉర్దూ భాషను 5 ఏళ్ళ పాటు కొనసాగింపు. ఉద్యోగ నియామకాలకు తెలుగుభాషా పరిజ్ఞానం తప్పని సరి చేయకూడదు కాని ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకు ఉద్యోగులకు నిర్వహించే తెలుగు పరీక్షలో తప్పక ఉద్యోగులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 
  • తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు స్థానికతకు 12 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  • తెలంగాణా ప్రాంతపు బహుముఖాభివృద్ధి కొరకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు. 
  • తెలంగాణలోని అన్ని వ్యవసాయ భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధీనంలో ఉండాలి. 
  • ప్రాంతీయ మండలిలో ఉండే 20 మంది సభ్యులలో జిల్లాకు ఒక్కరు చొప్పున 9 మంది అసెంబ్లీ సభ్యులు, 6 మంది సభ్యులు అసెంబ్లీ నుండి గాని పార్లమెంటు నుండి గాని తెలంగాణా అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోవాలి. మరో 5 మంది సభ్యులు బయటివారుగా ఉండాలి. వీరిని తెలంగాణా వారే ఎన్నుకోవాలి. 
  • ప్రాంతీయ సంఘం భారత రాజ్యాంగం ప్రకారం 371 అధికరణను అనుసరించి రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడే ఒక చట్టబద్ధ సంస్థగా రూపొందుతుంది. ప్రాంతీయ సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కలిగే భేదాభిప్రాయాను సరిదిద్దడానికి భారత ప్రభుత్వం కలుగ జేసుకోవచ్చును. ఈ ఏర్పాటు మధ్యలో మరొక ఒప్పందం లేకపోతే సమీక్ష పది సంవత్సరాల అనంతరం జరుగుతుంది.
  • క్యాబినెట్ మంత్రుల నియామకం 60:40గా ఉండాలి. తెలంగాణ ప్రాంతం నుండి ఒక ముస్లిం అభ్యర్థిని మంత్రిగా నియమించాలి. 11. ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడయితే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వాడై ఉండాలి. ఒక వేళ ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడై ఉండాలి. 
  • హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని ఆశించారు. ఆంధ్రప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు.

పై అంశాల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి. తెలంగాణ ప్రాంత నిధులు రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ అని పేరు పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రాంత ప్రతి నిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్ర ప్రదేశ్ పేరుండాలని పట్టుబట్టారు. 

తెలంగాణ ప్రాంత ప్రతినిధులు హైకోర్టు బెంచి గుంటూరు లో, హైదరాబాద్ లో ప్రధానపీఠం ఉండాలన్నారు. గుంటూరు లో బెంచి అవసరం లేదని, హైకోర్టు హైదరాబాద్ లోనే ఉండాలని ఆంధ్రప్రతినిధులు వాదించారు.

ఈ హామీలతో ఒప్పందం కుదరగానే విశాలాంధ్ర ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొత్త రాష్ట్రానికి ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు పెట్టారు. 1956 నవంబర్ 1వ తేదీన నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా, సి.ఎం.త్రివేది గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.




Tags :   Andhra Pradesh Formation     AP Formation      Andhra Pradesh History     AP History