అబుల్ హసన్ తానీషా
ఇతని పరిపాలనా కాలం పొడుగునా మొగలాయులు, మహారాష్ట్రులు, ఆదిల్ షాహీల, కుతుబ్ షాహీల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. గోల్కొండ రాజ్యానికి రక్షణగా ఉంటానని శివాజీ తానీషా నుండి 20 లక్షల హొన్నులు తీసుకున్నాడు. 1677లో మొగలు సైన్యాలు బీజాపూర్ సైన్యాలు కలిసి గోల్కొండ పై దాడి చేశారు. మొగలులతో రాజీపడి తానీషా- ఔరంగజేబుతో సంధి కుదుర్చుకున్నాడు. తానీషా ప్రధానమంత్రులు అక్కన-మాదన్నలు హిందువులు. భద్రాచలం రామాలయానికి రూపురేఖలు దిద్దిన కంచర్ల గోపన్న (భక్తరామదాసు) తానీషా కాలంవాడే.
అక్కన్న మాదన్నలను ప్రధానమంత్రులుగా తానీషా నియమించడం, శివాజీకి ఆర్థిక సహాయం చేయడం, కుతుబ్ షాహీలు గతంలో చెల్లించవలసిన కప్పం మొగలులకు ఇవ్వకపోవడం వలన ఈ కారణాలతో ఔరంగజేబు గోల్కొండపై 1687లో దాడిచేసి, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఔరంగజేబుకి గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. తుదకు అబుల్ హసన్ తానీషాను మొగలులు బంధించి దౌలతాబాద్ కోటలో ఖైదు చేశారు. ఆయన బందీగా 13 సంవత్సరాలున్నాడు. తుదకు నిరసన వ్రతం పాటించి 1703లో మరణించాడు. ఔరంగజేబు 1707లో మరణించాడు. ఆయన తర్వాత ఢిల్లీ సింహాసనం పాలనలోకి గోల్కొండ విలీనం అయ్యింది. కుతుబ్ షాహీ వంశీయులు 8 మంది సుల్తానులు సుమారు 175 సంవత్సరాల పాటు గోల్కొండ రాజ్యాన్ని పాలించారు. 
దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యధిక జనాభా కలిగిన గోల్కొండ రాజ్యం (హిందువులను) అల్ప సంఖ్యాకులైన (ముస్లింలు) సమభావంతో పరిపాలించడం చరిత్రలో అపూర్వ సంఘటన అనే చెప్పాలి. అభివృద్ధిలో హిందూ-ముస్లిం అనే తారతమ్యం చూపించక నిష్పక్ష పాతంతో, మతాలకు అతీతంగా, కళలు పోషించి, విద్యాభివృద్ధి చేసి కుతుబ్ షాహీ పాలకులు ప్రజలకు ఆదర్శప్రాయులయ్యారు. ఔరంగజేబు మరణానంతరం మొగలు సామ్రాజ్యం విచ్ఛిన్నం అయింది. ఆ పరిస్థితుల్లో మొగల్ సుబేదారు అయిన 'చిన్ కిలిచ్ ఖాన్' నిజాం ఉల్ ముల్క్ గా 1724లో దక్కనులో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. నాణాలు మొగల్ చక్రవర్తుల పేర్లతోనే ముద్రించారు. నిజాంలు 1724 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం, 1 మాసం, 2 రోజులు మొత్తం 224 సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.