మహమ్మద్ కులీ కుతుబ్ షా

ఇబ్రహీం కులీ కుతుబ్ షా పెద్ద కొడుకు అతని కన్నా ముందు చనిపోయాడు. రెండవ కొడుకు ఏ కారణం చేతనో సింహాసనం చేపట్టలేదు. ఇక మిగిలిన వాడు మూడవ కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ పదవి చేపట్టినాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్య పరిపాలనకు వచ్చేనాటికి 14 సంవత్సరాల బాలుడు. అప్పటికే రాజ్య వ్యవహారాలలో మంచి శిక్షణ పొందినాడు. ఇతడు మంచి విద్వాంసుడు. దక్కన్ భాషగ్రంధ కర్త. తెలుగులో కవి. కళలన్నా గొప్ప అభిమానం. ఇతని పాలనా కాలంలో సోదరుల, సామంతుల తిరుగుబాట్లను ఎదుర్కొన వలసి వచ్చినది. విజయనగర రాయలైన వెంకటపతితో తీవ్ర యుద్ధం జరిపినాడు. దక్కనులో మొగలాయిల విస్తరణ కూడా ఈయన కాలంలోనే ప్రారంభమైనది. విద్యలకు, కళలలకు ఎక్కువగా ఆదరణ ఇచ్చాడు. అందువల్లనే ఇతని కాలాన్ని గోల్కొండ చరిత్రలో 'స్వర్ణ యుగం'గా చరిత్రకారులు వర్ణిస్తారు.

మహమ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి హైదర్ మహల్ అనే బిరుదు ఇచ్చాడు. ఆమె పేరు మీదుగా భాగ్యనగరం అనే పెద్ద నగరాన్ని క్రీ.శ. 1591లో పారశీక సంప్రదాయ వాస్తు పద్ధతులతో నిర్మించాడు. ఇదియే నేడు హైదరాబాద్ గా పిలువబడుతున్నది. శాస్త్రీయ నిర్మాణ పద్ధతులతో చార్ మినార్, చార కమాన్, జామా మసీదు, దారుల్ షిఫా, బాదుషాహీ అఘఖానా, దాద్ మహల్ వంటి నిర్మాణాలు కుతుబ్ షాహి వాస్తు-హిందూవాస్తు-సమ్మేళనంతో నిర్మించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా తొలి ఉర్దూకవి. ఇతడు కులియత్ అనే గ్రంథాన్ని రచించాడు.

మహమ్మద్ కులీ తండ్రి లాగే సాహిత్య పోషకుడు. సారంగు తమ్మయ్యకు ఆశ్రయమిచ్చాడు. రాజామల్లారెడ్డి, శివధర్మోత్తరం, పద్మపురాణం వంటి గ్రంధాలు రచించాడు. మహమ్మద్ కులీ తన రచనలను ది కురియత్ అనే సంకలనాలుగా సేకరించిన ఉర్దూ కవులలో ప్రప్రథముడు. 

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 

మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీ.శ. 1612లో మరణించిన తర్వాత ఆయనకు కుమారులు లేని కారణంగా ఆయన తమ్ముడు మీర్జా ఆమీన్ కొడుకు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాను వారసునిగా ప్రకటించాడు. ఇతను క్రీ.శ. 1612 లో అధికారానికి వచ్చాడు. ఇతడు నిజాయితీ పరుడు, దైవభక్తి కలవాడు. ఇతడు ఏ యుద్ధాలు చేయలేదు. మొగలుల ఆక్రమణలను తట్టుకునేందుకు, ప్రతి సంవత్సరం వారికి 20 లక్షల హొన్నులు (డబ్బు) పేష్కస్ గా ఇచ్చేవాడు. మహమ్మద్ కుతుబ్ షా కాలంలోనే డచ్చి, ఇంగ్లీషు వారికి తూర్పుకోస్తా తీరం వెంబడి వర్తక స్థావరాలను - కేంద్రాలను స్థాపించుకోవడానికి ఫర్మానాలు జారీచేశాడు. డచ్చివారు మచిలీపట్నం, నిజాంపట్నం, పులికాట్స్ లోనూ ఆంగ్లేయులు, పులికాట్, నాగపట్టణాలలో వర్తక కేంద్రాలు నిర్మించుకున్నారు. ఇతని కాలంలోనే దక్షిణ భారత దేశంలోనే పెద్దదైన హైదరాబాద్ మక్కా మసీదుకు పునాదులు వేయడం జరిగింది.

అబ్దుల్లా కుతుబ్షా

మహమ్మద్ కుతుబ్ షా పెద్దకొడుకు అబ్దుల్లా కుతుబ్ షా క్రీ.శ.1626లో రాజ్యానికొచ్చాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్య క్షీణదశ ప్రారంభమైనది. ఇతని కాలంలోనే ఆంగ్లేయులు బలపడి అలజడులు కలిగించ సాగినారు. ఇతను ఇరాన్ తో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. ఇతడు 46 సంవత్సరాలు పాలన చేశాడు. ఇతని తల్లి హయత్ బక్షీ బేగం ఆధ్వర్యంలోనే రాజ్యపాలన చేశాడు. కుతుబ్ షాహీలు షియా ముస్లిం తెగలకు చెందిన వారు. మొగలులు సున్నీ తెగలకు చెందుతారు. హైదరాబాద్ కు నాణాలపై 'సున్నీ ఖలీఫాల' పేర్లు ముద్రించాలని మొగలులు షాజహాన్ అబ్దుల్లా కుతుబ్ షాను ఆదేశించాడు. శుక్రవారం ప్రార్ధనల్లో ఇరాన్‌షా పేరు కుతుబ్ షాహీలు ఉచ్చరించకూడదు. అబ్దుల్లా కుతుబ్ షా మొగలుల ఫర్మానాకు తల ఒగ్గి షాజహాన్ కు కొన్ని లక్షల హొన్నులు (రూపాయలు) వజ్రవైఢూర్యాలు పంపి మొగలుతో సంధి చేసుకున్నాడు. దీనితో గోల్కొండ స్వతంత్ర్యం కోల్పోయింది. 1655, 1656 లో మొగలు సేనలు గోల్కొండపై దాడులు చేశాయి. అబ్దుల్లా తన కుమార్తెను ఔరంగజేబు కొడుకు మహమ్మద్ కిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా ఔరంగజేబుతో సంధి చేసుకున్నాడు. 1672లో అబ్దుల్లా కుతుబ్ షా మరణించాడు.

కుతుబ్ షాహీలు-5