దేశీయంగా రూపొందిన సునామీ హెచ్చరిక వ్యవస్థ 2007 సెప్టెంబర్ నుంచి పనిచేయడం ప్రారంభించింది. భూకంపం సంభవించడానికి కనీసం పదినిమిషాల ముందుగానే పొంచి ఉన్న విపత్తు గురించి హెచ్చరించేలా ఇది పనిచేస్తోంది. 

జాతీయ సునామీ ముందు హెచ్చరికల కేంద్రం (NTEWC) ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూంటూంది. సునామీ తాకడానికి అవకాశం ఉన్న తీరం గురించి ఇది అందించే కచ్చితమైన సమాచారం ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుంటుంది. 

భూకంప పరిశీలన మీటర్లు, బోయ కట్టె వివరాలు, తరంగాల పరిణామాన్ని బట్టి వాస్తవ సమయ వివరాలను తెలుసుకుని సునామి హెచ్చరికను జారీ చేస్తుంది. 

సునామి 329 భూకంప అధ్యయన కేంద్రాల (27 జాతీయ, 302 అంతర్జాతీయ స్టేషన్లు) నుంచి వివరాలు స్వీకరించి వాటిని క్రోడీకరించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అంతేకాక, హిందూ మహా సముద్రం తీరం లోని 60 అంతర్జాతీయ అలల పర్యవేక్షక కేంద్రాల నుంచి వాస్తవ పరి స్థితిపై ఎన్టీఇడబ్ల్యుసి సమాచారాన్ని అందుకుంటోంది. సునామీ సంబంధిత భూకంపాల స్థాయిని, సునామీ ప్రభావంతో సముద్రంలో కెరటాల ప్రమాణం, దాని వల్ల ఎదురయ్యే వరిణామాల గురించి ముందస్తు హెచ్చరికల వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ప్రాంతీయ సునామీ సేవా కేంద్రంగా (రీజనల్ సునామీ సర్వీస్ ప్రొవైడర్- ఆర్టీఎస్పీ) గుర్తించారు. 

హిందూ మహాసముద్రం అంచున గల దేశాలకు 2011 అక్టోబర్ నుంచి సునామీ హెచ్చరికల సేవలు అందిస్తున్న హిందూ మహాసముద్ర సునామీ హెచ్చరిక వ్యవస్థను యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియాతో సమానంగా గుర్తించింది.