ఆహార ధాన్యాల పంపిణీ నిర్వహణ వ్యవస్థగా అభివృద్ధి చెందిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) జూన్ 1997లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థగా(TPDS)గా పునఃప్రారంభించబడింది. దీనిని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. TPDS సరైన ఏర్పాటు, ఆహార ధాన్యాల పంపిణీ అర్హులైన పేదలకు అందేందుకు అవసరమైన చర్యలు అమలు పరుస్తుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని TPDS, PDS పోషించే పాత్రను పోషిస్తూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టిని సారిస్తుంది.

లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థగా(TPDS) అంటే ఏమిటి?
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో TPDS అమలు జరుగుతుంది. TPDS జూన్ 1997లో పేదలపై దృష్టి సారించి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలులోకి వచ్చింది. TPDS యొక్క కార్యకలాపాల కింద, లబ్ధిదారులను రెండు వర్గాలుగా విభజించారు:
1. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు (BPL)
2. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలు (APL)
ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ, ఆహార ధాన్యాల కేటాయింపు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) యొక్క నిర్దేశిత డిపోలకు ఆహార ధాన్యాల రవాణా మొదలైన అంశాలకు సంబంధించి బాధ్యత వహిస్తుంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆహారధాన్యాల కేటాయింపు మరియు పంపిణీ, అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు, రేషన్ కార్డుల జారీ మొదలైన అంశాలకు సంబంధించి బాధ్యత వహిస్తుంది

PDS వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?
  • PDS రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రవేశపెట్టబడింది. 1960 సంవత్సరానికి ముందు PDS ద్వారా పంపిణీ ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడి ఉండేది.
  • 1960లలో ఆహార కొరతను నిర్వహించడానికి, పంపిణీని చూసుకోవడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించారు.
  • ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కమీషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్‌ను కూడా భారత ప్రభుత్వం దేశీయ సేకరణ, ఆహార ధాన్యాల నిల్వను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసింది.
  • 1970వ దశకంలో PDS అనేది ఆహార పంపిణీకి సార్వత్రిక పథకంగా పరిణామం చెందింది.
PDS వలన కలిగే ముఖ్య ప్రయోజనాలు :
దేశంలోని ప్రజల ఆహార భద్రత కు సంబంధించిన అంశాలను నిర్వహించడానికి వీలవుతుంది.
పేదలకు తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చేయడంలో సహకరిస్తుంది.