చారిత్రక రచనలు

మొగలుల చరిత్రకు సంబంధించిన ముఖ్య ఆధారం తుజుకీ -ఇ-బాబరీ. దీనిని బాబర్ నామా అని కూడా అంటారు. స్వయంగా బాబర్ తుర్కీ(టర్కీ) భాషలో రచించిన గ్రంధం. మొగల్ చక్రవర్తుల చరిత్రకు సంబంధించిన మూలాధారలలో ఇది మౌలికమైనది.

బాబర్ కుమార్తె, హుమాయూన్ సోదరియైన గుల్బదన్ బేగం హుమాయూన్ నామాను తుర్కీ భాషలో రచించింది. ఇది హుమాయూన్ జీవిత చరిత్రకు సంబంధించినది.

అక్బర్ కోరికపై, హుమాయూన్ చరిత్రను, బయాజిద్ అనే వృద్ధుడు వివరిస్తుండగా అబుల్ ఫజల్ తారీఖ్-ఇ-హుమాయుని గ్రంధాన్ని రచించాడు. ఇది కేవలం అక్బర్ తృప్తి కొరకు రచించబడిన గ్రంధం కాబట్టి చరిత్రకారులు దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు.

అక్బర్ ఆదేశాల మేరకు అక్బర్ నామా అనే గ్రంధాన్ని అబుల్ ఫజల్ పారశీక భాషలో రచించాడు. చరిత్రకారుల దృష్టిలో ఈ గ్రంధం మొగలుల చరిత్రకు సంబంధించిన ఆధారలలో అత్యద్భుతమైన గ్రంధం.

అక్బర్ పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి విపులమైన విషయాన్ని అందించిన గ్రంధం అయిన్-ఇ-అక్బరీ. మౌర్యుల పాలనా వ్యవహారాలకు సంబంధించి చాణ్యుకుని అర్థశాస్త్రం ఎంత విలువైనదో, అక్బర్ కాలం నాటి పాలనా దక్షతకు సంబంధించి ఈ గ్రంధం అంతే విలువైనది.

అబుల్ ఫజల్ రచనలను, అక్బర్ కు సంబంధించిన విషయాల గురించి బదౌనీ రచించిన విమర్శనాత్మక రచనయే ముంతకాబ్-ఉల్-తవారిక్. ఇందులో అబుల్ ఫజల్, అక్బరుల మధ్య గల సన్నిహిత సంబంధాలను గురించి బదౌనీ స్పష్టంగా తెలియజేశాడు. అయితే బదౌనీకి అక్బర్ ఉదారవాదం, రాజపుత్ర విధానం, ఆదర్శవాదం వంటి విషయాలు నచ్చకపోవడం వల్ల అతని రచనలో చారిత్రక అంశాల కంటే కక్షసాధింపు అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి.

అక్బరు కాలంలో రచించబడిన మరో చక్కటి ఐతిహాసిక లేఖనం తబాకత్ - ఇ- అక్బరీ. దీనిని నిజాముద్దీన్ భక్షి రచించాడు. ఈ గ్రంధంలో గజనీ మహ్మద్ భారతదేశంపై దండయాత్ర చేసిన కాలం నాటి నుండి అక్బర్ పాలనా కాలం నాటి వరకు చరిత్ర వివరించబడినది. ఇదొక సాధారణ చరిత్ర గ్రంధం.

జహంగీర్ అధికారంలోని మొదటి 12 సంవత్సరాల కాలంలో జరిగిన విశేషాలను తెలియజేసే గ్రంధం తుజుక్-ఇ- జహంగీరి. స్వయంగా జహంగీర్ ఈ గ్రంధాన్ని రచించాడు. తన పాలనా కాలంలోని లోపాలను ఎత్తిచూపుతూ జహంగీర్ ఈ గ్రంధ రచన చేశాడు.

జహంగీర్ కాలంలో మరి కొన్ని రచనలు :

మసీర్-ఇ-జహంగీరీ - క్వాజా, ముతామిద్ ఖాన్ - ఇక్బాల్-నామా-ఇ-జహంగీరీ. ఇవి చారిత్రక గ్రంధాలు.

షాజహాన్ కాలంలో అబ్దుల్ హమీద్ లాహోరీ రచించిన 'పాదుషా - నామా' అధికారిక చారిత్రక గ్రంధంగా పేరెన్నిక గన్నది. అక్బరు కాలం నాటి ఉదారవాదాన్నుంచి, సనాతన మార్గం వైపునకు షాజహాన్ మళ్ళడం ఈ గ్రంధంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఔరంగజేబ్ కొలువులో 40 సంవత్సరాలు పనిచేసి, సమకాలీన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయిన మహమ్మద్ సాకీ ముస్తాయిద్ ఖాన్ 'మసీర్-ఇ-ఆలంగీర్' అనే గ్రంధాన్ని రచించాడు.

మహమ్మద్ ఘోరీ భారతదేశంపై దాడి చేసిన సమయం నుండి క్రీ.శ.1733 వరకు జరిగిన సంఘటనలను వివరిస్తూ రచించబడిన గ్రంధం ముంతాకబ్ -ఇ- లుబాబ్ లేదా తారీఖా - ఇ - కాసీ. ఈ గ్రంధాన్ని హాషింకాఫీ ఖాన్ రచించాడు.

విదేశీ యాత్రికుల రచనలు

అక్బర్ గుజరాత్ దండయాత్రానంతరం యూరోపియన్లతో సంబంధం ఎక్కువైనది. ఫాదర్ మోన్సరేట్ ఫతేపూర్ సిక్రీలో అక్బర్ తో కలిసి నివసించాడు. అక్బర్ మత జీవితం గురించి, దీన్-ఇల్లాహీ గురించి విశిష్టమైన సమాచారాన్ని ఫాదర్ మోన్సరేట్ తన రచనలలో తెలియజేశాడు.

జహంగీర్ కాలం నుండి భారతదేశానికి యూరోపియన్ల సందర్శన ఎక్కువైనది. క్రీ.శ.1615లో సర్ థామస్ రో జహంగీర్ సందర్శనార్థం రావడం ప్రధాన సంఘటనగా చెప్పవచ్చు. ఈయన రచనల్లో సూరత్ రేవు గురించి, మొగలుల వాణిజ్య పద్ధతుల గురించి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇతర యూరోపియన్ కంపెనీల గురించి కూడా తన రచనల్లో థామస్ లో పొందుపరిచాడు.

క్రీ.శ.1656 - 1658 మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రాంకోయిస్ బెర్నియర్ "ట్రావెల్స్ ఇన్ మొగల్ ఎంపైర్” అనే గ్రంధ రచన చేశాడు. ఆనాటి చారిత్రక ఆధారానికి ఇది సమగ్ర రచన.

టావెర్నియర్ అనే ఫ్రెంచి వజ్రాల వ్యాపారి 'ట్రావెల్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో మొగలుల కాలంలో భారతదేశంలో పంటల గురించి, ప్రజలు అనుసరించే విచిత్ర ఆచారాల గురించి ప్రస్తావించాడు.

అబ్బికారే అనే ఫ్రెంచి యాత్రికుడు “ది ట్రావెల్ ఆఫ్ అబ్బికారే ఇన్ ఇండియా అండ్ నియర్ ఈస్ట్" అనే గ్రంథంలో భారతదేశ రేవు పట్టణాల గురించి ప్రధానంగా చర్చించాడు.

ఔరంగజేబు కాలానికి సంబంధించిన అంశాల గురించి వర్ణించే ప్రామాణిక గ్రంధం “స్టోరియోడెమొగోర్”. దీని రచయిత నిక్కోలాయ్ మన్నూ. ఈ గ్రంధాన్ని మన్నూ ఇటాలియన్ భాషలో రచించాడు. ఇందులో గోల్కొండ ముట్టడి, మద్రాసు పట్టణ సౌందర్యాల గురించి విపులంగా వివరించాడు.

రాజస్థాన్ చరిత్రను టాడ్ అనే ఆంగ్ల ఉద్యోగి రచించాడు. ఇది అసమకాలికమైనప్పటికీ రాజస్థాన్ చరిత్రకు ప్రామాణిక గ్రంధంగా వర్ణించబడుతున్నది.

ఫ్రాన్సిస్కో తన రచన “రిమోనస్ట్రెయిన్టే'లో నీలిపంటను ఎలా పండిస్తారు. ఎంత విస్తీర్ణంలో పండిస్తారో వివరించాడు. 

చిత్రలేఖనము

  • హుమాయూన్ పర్షియా నుండి సుప్రసిద్ధ చిత్రలేఖనా ప్రతిభావంతులైన, మీర్ సయ్యద్ అలీ, అబ్దుల్ సమద్ లను భారతదేశం రప్పించాడు. చిత్రకళలో నిష్ణాతులైన వీరిరువురూ “దస్తన్, అమీల్, హజ్జా” అనే గ్రంథాన్ని రచించారు. మొగల్ చిత్రలేఖనా పద్ధతిలో రూపొందించబడిన మొదటి చిత్రం క్రీ.శ.1562లో తాన్సేన్ దర్బార్ ప్రవేశ సన్నివేశం.
  • అక్బర్ కాలంలో అబ్దుల్ సయద్, ఫరూఖ్ బేగ్, ఖుస్రూఖులీ, లాల్ కీసు, హరిబంద్, దశపంత్ మొదలైన వారు ఆస్థాన చిత్రకారుల్లో ముఖ్యులు.
  • స్వయంగా జహంగీర్ గొప్పచిత్రకారుడు. ఉస్తాద్ మన్సూర్, ఖిషన్స్ మనోహర్, గోవర్ధన్ అనే వారు జహంగీర్ ఆస్థాన చిత్రకారుల్లో ప్రముఖులు.
  • ఒకే చిత్రానికి వేర్వేరు కళాకారులు రంగులు వేసినప్పుడు వారు వేసిన రంగును బట్టి కళాకారులను గుర్తించడం జహంగీర్ చిత్రకళా పరిజ్ఞానానికి నిదర్శనం.
  • షాజహాన్ కాలంలో సహజ రంగులకు బదులుగా కృత్రిమంగా మెరుగులను కల్పించే పద్ధతికి ప్రాధాన్యం ఇవ్వడం వలన సహజమైన కళలు ఉట్టిపడే రంగులకు బదులు బంగారు మెరుగుల తళతళలను ప్రోత్సహించడం వల్ల చిత్రకళ సహజత్వాన్ని కోల్పోయింది.
  • ఔరంగజేబు ఇస్లాం మతానికి వైరుధ్యాన్ని సూచించే కళలను ప్రోత్సహించకపోవడంతో అతని కాలం నుండి చిత్రకళ మరుగున పడింది.

భవనాలు - వాస్తుకళ

  • క్రీ.శ.1533-34లో గుజరాత్ మీద సాధించిన విజయానికి చిహ్నంగా హుమాయూన్ ఢిల్లీలో “దీన్ పనహ” అనే దుర్గాన్ని కట్టించాడు.
  • అక్బర్ కాలంలో నిర్మించబడిన ఫతేపూర్ సిక్రి నిర్మాణం అతని వాస్తుకళా పోషణకు ఒక మచ్చుతునక. అలహాబాద్ లోని 40 స్తంభాల మండపం, సికింద్రా వద్దగల అక్బర్ సమాధి, జోదాబాయి మహల్, జహంగీర్ మహల్, ఆగ్రా, ఢిల్లీ, లాహోర్ అలహాబాద్ కోటలు అక్బర్ కాలం నాటి నిర్మాణాలు.
  • జహంగీర్ కాలం నాటి ఎతి-మాద్-దౌలా సమాధి అతి ముఖ్యమైనది. ఇది నూర్జహాన్ తండ్రి పేరిట నిర్మించబడినది. పాలరాతి నిర్మితమైన ఈ కట్టడం రాజపుత్ర పద్ధతిలో నిర్మించబడిది. తాజ్ మహల్ కు మాతృక నమూనాగా దీనిని వర్ణిస్తారు.
  • షాజహాన్ నిర్మించిన నిర్మాణాలలో ఢిల్లీలోని ఎర్రకోట ముఖ్యమైనది. ఇందులోని రంగమహల్, ముంతాజ్ మహల్, దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్ ముఖ్యమైన నిర్మాణాలు.
  • ఆగ్రా కోటలోని ముసల్మాన్ బుర్జ్, మోతీమసీద్ ఇతని కాలంలోని నిర్మాణాలే. మన దేశంలో అన్నిటికంటే పెద్దదైన జహాన్ - నామా మసీద్ షాజహాన్ కట్టడమే.
  • షాజహాన్ నిర్మించిన కట్టడాలన్నింట్లోకి తలమానికమైనది తాజ్ మహల్. ఈ నిర్మాణ ముఖ్య వాస్తుశిల్పి ఉస్తాద్ ఇశా.