తెలంగాణలో ప్రధాన నీటి పారుదల వనరులు గొట్టపు బావులు, తవ్విన బావులు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, మరియు ఇతర ఎత్తిపోతల పథకాలు. 

ఆయకట్టు ఆధారంగా తెలంగాణాలో గల నీటిపారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించారు:

1. 25,000 ఎకరాలు(10,000 హెక్టార్ల )కంటే ఎక్కువ ఆయకట్టు కలవ భారీ తరహా ప్రాజెక్టులు.

2. 5,000 ఎకరాలు (2,000 హెక్టార్ల) కంటే ఎక్కువ మరియు 25,000(1000 హెక్టార్ల) కంటే తక్కువ ఆయకట్టు కలవి మధ్యతరహా ప్రాజెక్టులు.

3.  5,000 ఎకరాలు (2,000 హెక్టార్ల) వరకు ఆయకట్టు కలవి చిన్నతరహా ప్రాజెక్టులు.

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు :

1. అలీసాగర్ ఎత్తిపోతల పథకం 

ప్రదేశం : నిజామాబాదు జిల్లా నవీపేట మండలం కోస్లీ గ్రామం నిర్మించబడింది.

నెలకొల్పిన కారణం : గోదావరి నది నీటిని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రోజెక్టుల మధ్య ఆయకట్టు స్థిరీకరణ.

ప్రత్యేకతలు : నిజామాబాదు జిల్లాలోని 6 మండలాలకు లబ్ది.

2. ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్ 

ప్రదేశం : కృష్ణా నదిపై జోగులాంబ గద్వాల జిల్లా రావులపల్లి గ్రామం వద్ద నిర్మించబడింది.

నెలకొల్పిన కారణం : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు బాధిత ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు తీర్చడానికి. 

ప్రత్యేకతలు : దీని ఎడమ కాలువకు NTR కాలువ అని, కుడి కాలువకు నాలా సోమనాద్రి కాలువ అని పేరు. 

3. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 

ప్రదేశం : తెలంగాణ లోని నల్గొండ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాల మధ్య కృష్ణ నదిపై నందికొండ వద్ద నిర్మించబడింది.

నెలకొల్పిన కారణం : ఎడమ కాలువ (లాల్ బహదూర్ కాలువ) ద్వారా తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు; కుడికాలువ (జవవర్ కాలువ) ద్వారా ఆంధ్రప్రదేశ్ గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించడానికి.

ప్రత్యేకతలు : ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత బహుళార్ధ సాధక ప్రాజెక్ట్.

4. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ 

ప్రదేశం : నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూరు గ్రామానికి సమీపంలో కడెం నదిపై నిర్మించారు.

నెలకొల్పిన కారణం : 68,150 ఎకరాల విస్తీర్ణంలో సాగునీరు అందించడానికి.

ప్రత్యేకతలు : గోదావరి లోయ పథకంలో అంతర్భాగంగా నిర్మించారు.

5. మూసీ ప్రాజెక్ట్ 

ప్రదేశం : సూర్యాపేట జిల్లా సోలిపేట గ్రామంలో మూసీనదిపై నిర్మించారు.

నెలకొల్పిన కారణం : రెండు వరద కాలువల ద్వారా సుమారు 31,540 ఎకరాలకు నీరు అందించడానికి

6. నిజాం సాగర్ ప్రాజెక్ట్ 

ప్రదేశం : కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం లోని అచ్చంపేట వద్ద మంజీరా నదిపై నిర్మించబడింది.

నెలకొల్పిన కారణం : 1,38,754 ఎకరాలకు సాగునీటి వసతి కోసం 

ప్రత్యేకతలు : నిజాం కాలంలో నిర్మించబడింది 

7. ఆర్గుల రాజారాం గుప్త ఎత్తిపోతల పథకం 

ప్రదేశం : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఉమ్మెడ గ్రామం వద్ద నిర్మించారు. 

నెలకొల్పిన కారణం : నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా

8. రాజోలి బండ డైవెర్షన్ 

ప్రదేశం : కర్ణాటక లోని రాయచూరు జిల్లా మఞ్ఞితాయాలోని రాజోలిబండ గ్రామం వద్ద తుంగభద్ర నదిపై నిర్మించారు.

నెలకొల్పిన కారణం : జోగులాంబ గద్వాల జిల్లాలోని 87,500 ఎకరాలకు నీటిని అందించడానికి 

ప్రత్యేకతలు : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్.

9. శ్రీరామ్ సాగర్ - మొదటి దశ 

ప్రదేశం :  నిజామాబాదు జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. 

నెలకొల్పిన కారణం :  నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాగు నీరు అందించడానికి. 

ప్రత్యేకతలు : తెలంగాణ రాష్ట్రంలో మొదటి బహుళార్ధసాధక ప్రాజెక్ట్. తెలంగాణ జీవనరేఖగా పిలుస్తారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మి అనే మూడు ప్రధాన కాలువల ద్వారా త్రాగు, సాగు నీరు అవసరాలను తీరుస్తుంది.